రాయ్‌పూర్: ఆయుధాలు వీడి లొంగిపోవాలని లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మావోయిస్టులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పుర్‌లో ఆదివారం(డిసెంబర్15) జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షా మాట్లాడుతూ‘ఆయుధాలు వీడి లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరండి. మీ పునరావాసం బాధ్యత మాది. లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బస్తర్‌లో నక్సలిజం అంతమైతే ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు కశ్మీర్ కన్నా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తాం’ అని అమిత్ షా అన్నారు.
భారత్‌ను నక్సల్ రహితంగా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు కట్టుబడి ఉన్నారన్నారు షా. కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న సమయంలో తీవ్రవాద శక్తులపై చర్యలు వేగంగా ఉండేవి కాదని విమర్శించారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చర్యల్ని వేగవంతం చేశామన్నారు. ఈ ఏడాదిలో 287మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అంతం చేయగా 992మందిని అరెస్టు చేశామని 836మంది లొంగిపోయారని షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment