ముందు కెరీర్‌..తర్వాతే పిల్లలు! | Changing Perspective of Indian Women | Sakshi
Sakshi News home page

ముందు కెరీర్‌..తర్వాతే పిల్లలు!

Aug 30 2024 4:25 AM | Updated on Aug 30 2024 4:25 AM

Changing Perspective of Indian Women

మారుతున్న భారతీయ మహిళల దృక్పథం 

20–30 ఏళ్ల మధ్యలో బిడ్డలను కంటున్న వారి శాతం తగ్గుదల 

35 ఏళ్ల తర్వాత తల్లులు అవుతున్నవారు పెరుగుదల 

తగ్గుతున్న శిశు మరణాలు .. కేంద్ర గణాంకాల శాఖ నివేదిక  

ఇల్లు.. పెళ్లి.. పిల్లలు.. ఇది నిన్నటితరం భారతీయ మహిళల మాట..  ఉన్నత చదువు.. కెరీర్‌..  పెళ్లి.. కెరీర్‌లో స్థిరత్వం.. ఆ తర్వాతే పిల్లలు.. ఇదీ నేటి భారతీయ మహిళల దృక్కోణంలో  వచ్చిన మార్పు..  అవును.. పిల్లలకు జన్మనిచ్చే విషయంలో భారత మహిళల దృక్పథం  మారుతోంది. 

ముందు ఉన్నత చదువును అభ్యసించడం, మంచి ఉద్యోగం సాధించి కెరీర్‌ను  మొదలుపెట్టడం, ఆ తర్వాత దాంపత్య బంధంతో ఒక్కటి కావడం, కెరీర్‌లో స్థిరత్వం ఇవన్నీ  సమకూరాకే సంతానం కనడానికి మొగ్గుచూపుతున్నారు. కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరే  వరకు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఈ మేరకు 2016 తర్వాత నుంచి భారత  మహిళల దృక్పథంలో గణనీయ మార్పులు వచ్చాయని కేంద్ర గణాంకాలు – కార్యక్రమాల  అమలు శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 

‘భారతదేశంలో మహిళలు, పురుషులు– 2023’  పేరుతో  విడుదల చేసిన ఈ నివేదికలో దేశంలో జనాభా పెరుగుదల, పురుషులు–మహిళల  నిష్పత్తి, సంతానం విషయంలో మహిళల దృక్పథం తదితర అంశాలపై కీలక విషయాలను  పొందుపరిచింది. అందులోని ప్రధాన అంశాలు ఇవీ..     – సాక్షి, అమరావతి

2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లు   దేశ జనాభా 2036 నాటికి ఏకంగా  152.2 కోట్లకు చేరుతుందని నివేదిక  పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల జనాభా నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. 2011లో  దేశంలో ప్రతి వేయిమంది  పురుషులకు 943 మంది మహిళలు  ఉండగా... 2036 నాటికి 952కు  పెరుగుతారని అంచనా. 2011లో దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం  ఉండగా 2036 నాటికి  48.8 శాతానికి పెరగనున్నారు.

మారుతున్న ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’  
భారతదేశంలో ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ (ఏజ్‌ స్పెసిఫిక్‌ ఫెర్టిలిటీ రేట్‌) గణనీయంగా మారుతోంది.  20 – 24 ఏళ్లు, 25 – 29 ఏళ్లు, 30– 34 ఏళ్లు, 35– 39 ఏళ్లు.. ఇలా ఐదేళ్లు  ఒక్కో కేటగిరీగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో ప్రతి వేయి మంది మహిళలు ఏడాదిలో ఎంతమంది బిడ్డలకు జన్మనిస్తారో దాన్ని వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు అని అంటారు.  

మహిళల నిర్ణయానికి కారణాలివే
» కెరీర్‌లో స్థిరపడ్డాక నిర్దేశిత లక్ష్యాలు సాధించేవరకు బిడ్డలను కనేందుకు మహిళలు ఇష్టపడటం లేదు. బిడ్డలను కంటే కెరీర్‌పై తగినంత శ్రద్ధ చూపించలేమని, అలాగే వారికి కావాల్సినంత సమయం కేటాయించలేమనే భావనతో ఉన్నారు. అందుకే 20 నుంచి 29 ఏళ్ల మధ్యలో కెరీర్‌లో స్థిరపడ్డాకే బిడ్డలను కనాలని భావిస్తున్న మహిళల శాతం పెరుగుతోంది. దీంతో ఆ కేటగిరీల్లో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది.  

»   ఇక కెరీర్‌లో స్థిరపడ్డాక బిడ్డలను కంటున్న మహిళల శాతం పెరుగుతోంది. దేశంలో 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు పెరుగుతుండట­మే అందుకు నిదర్శనం. 2011– 2015 మధ్య 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 32 ఉండగా... 2016– 2020లో అది 35కు పెరిగింది.  

»   ఇక 18 ఏళ్ల లోపే బిడ్డలను కంటున్న వారిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య వ్యత్యాసం ఉంది. 2016–2020లో నిరక్షరాస్యుల్లో 18 ఏళ్ల లోపు వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 39గా ఉండగా... అక్షరాస్యుల్లో ఆ రేటు 11కే పరిమితమైంది. 

తగ్గుతున్న  ప్రసూతి మరణాలు.. 
ప్రసూతి మరణాలను తగ్గించడంలో భారతదేశం నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తోంది. 2030 నాటికి దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలను 70కు తగ్గించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో 2018–­20 నాటికి ప్రసూతి మరణాలను 97కు తగ్గించారు. 2030 నాటికి కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పూర్తి ధీమాతో ఉంది. ఇక దేశంలో శిశు మరణా లు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రతి వేయి కాన్పులకు శిశు మరణాల రేటు 2015లో 43గా ఉండగా.. 2020నాటికి 32కు తగ్గింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement