పవిత్ర చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఆరునెలల తర్వాత కేదార్‌నాథ్ క్షేత్ర ద్వారాలు తెరుచుకున్నాయి. తొలిరోజే దాదాపు 16వేలమంది భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కేదార్‌నాథ్‌తోపాటే గంగోత్రి, యమునోత్రిలోనూ భక్తుల దర్శనాలు ఆరంభమయ్యాయి.
దేవభూమి ఉత్తరాఖండ్ హరహర మహాదేవ్ నామస్మరణతో మారుమోగింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. అక్షయ తృతీయనాడు.. భజనలు, సంకీర్తనల మధ్య క్షేత్ర ద్వారాలు తెరిచారు అధికారులు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. హెలికాఫ్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు.
కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకోవడంతో.. పవిత్ర చార్‌ధామ్ యాత్ర మొదలైంది. ఆరునెలలపాటు మూసి ఉన్న ద్వారాలు తెరుచుకునే సమయంలో.. దేవాలయ ప్రాంగణం జై కేదార్ నినాదాలతో మారుమోగింది. దాదాపు 16 వేలమంది భక్తులు తొలిరోజు కేదారీశ్వరుని దర్శనానికి వచ్చారు. వేలాదిమంది భక్తులతోపాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. సతీసమేతంగా కేదారనాథుడిని దర్శించుకున్నారు. తొలి పూజలో పాల్గొన్నారు.
కేదార్‌నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను కలిపి చార్‌ధామ్ యాత్రగా పిలుస్తారు. కేదారధామంతోపాటే గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. పరమపవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్ర గంగోత్రి దర్శనంతో ప్రారంభమవుతుంది. గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదారనాథుని దర్శించుకుంటారు భక్తులు. చివరగా బద్రినాథ్ ధామం చేరుకుని యాత్రను ముగిస్తారు. భూమిపై వైకుంఠంగా పరిగణించే బద్రీనాథ్ క్షేత్ర ద్వారాలు ఈనెల 12న ఉదయం 6 గంటలకు తెరుచుకోనున్నాయి.
ఏటా లక్షలమంది భక్తులు చార్‌ధామ్ యాత్రకు తరలివస్తుంటారు. గతేడాది రికార్డు స్థాయిలో 55 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఈసారి యాత్ర ప్రారంభం నాటికే 22.15 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రకు పటిష్ట ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment