
విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యంపై చర్చలు.. ఎంఓయూలపై సంతకాలు చేసిన చంద్రబాబు, బిల్‌గేట్స్
ఈ విషయాలను ‘ఎక్స్’ ద్వారా వెల్లడించిన సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో సాంకేతికత వినియోగంపై ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేసేలా ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ ఢిల్లీలో బుధవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. బిల్‌గేట్స్‌ను కేంద్ర సహాయ మంత్రులు చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులతో కలిసి సీఎం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయి.
భేటీ అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని ‘ఎక్స్ ద్వారా తెలిపారు. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం. స్వర్ణాంధ్రప్రదేశ్–2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.
గేట్స్ ఫౌండేషన్‌తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంలో, లక్ష్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నా. ఏపీ పురోగతికి బిల్‌గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పోస్టు చేశారు.
దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తాం: బిల్‌గేట్స్
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై బిల్‌గేట్స్ హర్షం వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘తక్కువ ఖర్చుతో కూడిన డయాగ్నొస్టిక్స్, వైద్య పరికరాలను స్థానికంగా తయారు చేయడం ద్వారా పేదల బతుకుల్లో కొత్త వెలుగులు నింపే సామర్థ్యం మన భాగస్వామ్యానికి ఉందన్న సంగతి నన్ను ఎంతో ఉత్సాహపరుస్తుంది.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ప్రాథమిక విద్యా రంగాల్లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఏఐ టెక్నాలజీతో మనం పరిష్కరించవచ్చు. ఆయా రంగాల్లో మనం సాధించే విజయాలు మొత్తం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తాయనడంలో సందేహం లేదు’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నట్టు తెలిపింది.
నేను నిద్రపోను..మిమ్మల్ని పోనివ్వను
కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు క్లాస్
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎంపీలుగా గెలిచి ఏడు నెలలు గడిచింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మీరేం చేస్తున్నారు. ఏయే మంత్రులను, ఏ అధికారులను కలిశారో చెప్పండి. పనిలో మీరు వహించిన నిర్లక్ష్యానికి ఫుల్‌స్టాప్ పెట్టండి. మీ పనితీరు మార్చుకోండి’ అంటూ సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలకు క్లాస్ పీకారు.
మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళతానంటే కుదరదంటూ హెచ్చరించారు. ఢిల్లీ వచ్చిన సీఎం చంద్రబాబు.. మంగళవారం రాత్రి కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. ఒక్కో ఎంపీ పనితీరుపై చంద్రబాబు ప్రశ్నించారు. కేవలం పార్లమెంట్‌కు వెళ్లి హాజరు వేయించుకుంటే సరిపోదని, పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించారు.
పనితీరుపై అసంతృప్తి..
కేవలం ఇద్దరు ఎంపీల పనితీరుపై మాత్రమే చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్ర మంత్రులను కలవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు ఇవ్వాలని కోరినట్టు ఆ ఇద్దరు ఎంపీలు సీఎం దృష్టికి తెచ్చారు. ‘మీ ఇద్దరి సంగతి సరే. మిగతా వాళ్లు ఎందుకు సరిగా పనిచేయడం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి కదా? మరి మిగతా వారు ఎందుకు ఈ చొరవ చూపడం లేదు.
మీరు సాధించింది ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధిపై మీరు ఎందుకు పనిచేయడం లేదు. ఎవరైనా నాకు ఒకటే. నిరంతరం కష్టపడి పనిచేయాల్సిందే. పదేపదే కేంద్ర మంత్రులను కలవాల్సిందే. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందే. ఇకపై నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అంటూ ఎంపీలపై అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment