అగర్తల: దక్షిణ త్రిపురలోని రాజ్‌నగర్‌లో సీపీఐ నేత బాదల్ షీల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ హత్య సంచలనంగా మారింది. జిల్లా పరిషత్ అభ్యర్థి షిల్‌ను బీజేపీ మద్దతు కలిగిన గూండాలు హత్య చేశారని త్రిపుర ప్రతిపక్ష సీపీఐ (ఎం) ఆరోపించింది. ఈ హత్యకు నిరసనగా నేడు (ఆదివారం) 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని రాష్ట్ర బీజేపీ తెలిపింది. దక్షిణ త్రిపుర ఎస్పీ అశోక్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేత షీల్‌పై కొందరు దాడి చేశారని, నిందితులను ఇంకా గుర్తించలేదన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారన్నారు. తాము ఈ కేసును సుమోటోగా తీసుకున్నామన్నారు.
రాజ్‌నగర్ మార్కెట్‌లో షీల్‌పై కత్తులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అగర్తలలోని ప్రభుత్వ జీబీ పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షీల్ మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు షీల్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ ఇది బాదల్‌షీల్ హత్య కాదని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఈ దారుణ హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. బంద్ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment