Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితకు దక్కని ఊరట | Delhi Court Defers BRS Leader K Kavithas Bail Plea Hearing To April 4 | Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితకు దక్కని ఊరట

Published Mon, Apr 1 2024 3:44 PM | Last Updated on Mon, Apr 1 2024 4:35 PM

Delhi Court Defers BRS Leader K Kavithas Bail Plea Hearing To April 4 - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 4న చేపడతామని తెలిపింది.

తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్‌ 16 వరకు మధ్యంతర బెయిల్‌ లేదా సాధారణ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రౌస్‌ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో వాదనలు వాడీవేడీగా జరిగాయి. కవిత తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.

కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 160 ప్రకారం తొలి సమన్లలోనే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కవితను ఒక్కోసారి రాత్రి కూడా విచారించారని చెప్పారు. 

ఈ సందర్భంగా అరుణ్‌ పిళ్లై స్టేట్‌మెంట్‌ అంశాలను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన తొమ్మిది స్టేట్‌మెంట్‌లు ఒక రకంగా ఉంటే పదో  స్టేట్‌మెంట్‌ పూర్తి విరుద్దంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జ్ షీట్, అడిషనల్ చార్జ్ షీట్‌లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. ఇరు వాదనలు విన్న  న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్‌ 9వ తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement