న్యూఢిల్లీ: ఢిల్లీని శుక్రవారం భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దేశ రాజధానితోపాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అయితే రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం కారణంగా దేశ రాజధాని, పరిసరి ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది.
ఇప్పుడిప్పుడే ఢిల్లీలోవాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పొల్యూషన్‌తో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్న ఢిల్లీ వాసులు.. ప్రస్తుతం మంచి గాలిని పీల్చుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ నగరం గాలి నాణ్యత సూచికలో 52గా నమోదైంది. ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 24, ఘజియాబాద్‌లో 34, నోయిడాలో46గా నమోదైంది. గురుగ్రామ్ 69, బులంద్‌షహర్ 21, మీరట్ 28, ముజఫర్‌నగర్ 29గా ఉంది.
అయితే ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగవ్వడం వెనక చురుకుగా కదులుతున్న రుతుపవనాల ద్రోణి కారణమని అధికారాన్ని భావిస్తున్నారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడిన సంగతి తెలిసిందే. దీంతో గాలిలోని కాలుష్యం వర్షానికి కొట్టుకుపోయినట్లు, అదే విధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి కూడా సహయపడినట్లు పేర్కొన్నారు.
కాగా ఈనెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షం వార్షిక, నెలసరి సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఇది 1000 మి. మీ మార్కును దాటింది. సెప్టెంబర్‌లో సాధారణం కంటే 55% ఎక్కువ వర్షపాతం నమోదైంది. శుక్రవారం మూడు గంటల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సఫ్దర్‌జంగ్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. గత 9 సంవత్సరాల్లో లేని గాలి నాణ్యత 2024 ఫిబ్రవరిలో నమోదైంది. గాలి నాణ్యత సూచిక 200 కంటే తక్కువగా నమోదు కాగా.. గతంలో అయితే AQI 400 నమోదు అయింది.
Comments
Please login to add a commentAdd a comment