చెన్నై: సైక్లోన్ మాండూస్.. ఈ పేరు ఇప్పుడు దక్షిణ భారత దేశాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఏపీ, తమిళనాడు వైపుగా దూసుకొస్తున్న ఈ తుపాన్ ఏమేర నష్టం చేస్తుందో అనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి అధికార యంత్రాంగాలు. గురువారం అర్ధరాత్రికి తీవ్ర రూపం దాల్చి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురువారం ఉదయం చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో.. పుదుచ్చేరి కరైకాల్‌కి దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. ఈ ప్రభావంతో చెన్నైలో ఇప్పటికే వానలు మొదలు అయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం.. తుపానుగా మారి మరింత బలపడింది. ఈ తుపానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ఇంతకీ..
ఈ మాండూస్ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా?.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగాళా ఖాతంలోని ఈ ప్రస్తుత తుపాన్‌కు నామకరణం చేసింది. అరబ్‌లో మాండస్ అంటే అర్థం నిధి పెట్టె అని.
చెన్నైలోని వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడు ఉత్తర భాగం గుండా తుపాన్ ప్రవేశిస్తుంది. పుదుచ్చేరి, శుక్రవారం రాత్రి కల్లా ఏపీలోని దక్షిణ భాగం వైపు తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అదే సమయంలో తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. వాతావరణ శాఖ మాత్రం ఏపీకి సంబంధించి దక్షిణ కోస్తాంధ్రా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment