సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పండుగ వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక నెల బోనస్ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయించింది. తద్వారా సుమారు 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో రాష్ట్ర ఖజానాపై 1,023 కోట్ల రూపాయల భారం పడుతుంది. నాన్-గెజిటెడ్ రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వ, సహాయక విద్యా సంస్థల సిబ్బంది, స్థానిక సంస్థలు, జిల్లా పంచాయతీలతో పాటు రోజువారీ కూలీలు కూడా 30 రోజుల బోనస్‌ను దీపావళి బహుమతిగా అందుకుంటారు.
నిబంధనల ప్రకారం, గరిష్టంగా కేటాయించిన బోనస్ ప్రతి ఉద్యోగికి 6,908 రూపాయలు. బోనస్‌లో 25 శాతం నగదు రూపంలోనూ, మిగిలిన 75 శాతం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కు చేర్చబడుతుంది. పీఎఫ్ ఖాతా లేని వారికి అదే మొత్తానికి జాతీయ భద్రతా ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది. 2020 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ 30 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు పూర్తిస్థాయి అర్హత కలిగిన తాత్కాలిక బోనస్‌ను అందుకుంటారు. రోజువారీ కూలీల బోనస్ గరిష్టంగా రూ.1,200 గా ఉండనుంది. కాగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా దీపావళి బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment