70గంటల పని విధానాన్ని మీరు సమర్థిస్తారా?
రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? వారానికి ఎన్ని రోజులు పని చేయాలి..? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తరచుగా సూచించే వారానికి 70గంటల పని విధానాన్ని మీరు సమర్థిస్తారా? ముందు ఈ స్టోరీ క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చదవండి.. చివరికి సమాధానం మీకే దొరుకుతుంది!
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ 32ఏళ్ల వ్యక్తి తన రైట్ హ్యాండ్‌కి ఉన్న 5 వేళ్లలో నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. కారణం ఏంటో తెలుసా? పని ఒత్తిడి..! అవును..! అతనికి నెలకు 50 వేల రూపాయల జీతం.. ఓ కంపెనీలో కంప్యూటర్ అపరేటర్‌గా పని చేస్తున్నాడు.. రోజుకు 12గంటలకు మించి అతనితో కంపెనీ మేనేజర్ పని చేయించుకుంటున్నాడు. జాబ్ మానేద్దామంటే అతని తండ్రి ఏమో మేనేజర్‌కు మంచి ఫ్రెండట..! ఉద్యోగం మానేస్తా అంటే తన తండ్రి ఒప్పుకోడు.. అందుకే ఫోర్ ఫింగర్స్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తితో కసాకసా కోసుకున్నాడు.
ఇది రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా పూణే బ్రాంచ్ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ ఎలా చనిపోయిందో గుర్తుంది కదా? రాత్రి-పగలు తేడా లేకుండా, కనీసం వీకాఫ్ కూడా ఇవ్వకుండా ఆమెతో కంపెనీ వెట్టిచాకిరి చేయించుకుంది.. చివరకు ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది.
మరో ఘటనలో వరుసగా 45 రోజులుగా సరైన నిద్రలేని 40 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ సుశాంత్ చక్రవర్తి ముంబైలోని అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో పని చేస్తున్న సుశాంత్ ఎన్నో నెలలగా తీవ్రమైన పని ఒత్తిడితో బాధపడుతున్నాడని ఆయన భార్య కన్నీటిపర్యంతమైంది. ఇవన్నీ ఇండియాలో నిత్యం జరిగే కొన్ని ఘటనలు మాత్రమే..! మీడియా దృష్టికి, పోలీసు స్టేషన్ వరకు రాని కేసుల సంఖ్యకు లెక్కే ఉండదు..!
'వారానికి 70గంటలు పనిచేయాలి...' ఇది నారాయణమూర్తి పదేపదే చెబుతున్న మాట.. మరోసారి కూడా అదే చెప్పారాయన..! దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నది ఆయన వాదన. ఇండియాలో పేదరికాన్ని పోగొట్టాలంటే ఇలా కష్టపడాలట..! కేవలం వ్యాపారవేత్తలే ఉద్యోగాలను సృష్టించగలరని.. దేశానికి ఆదాయాన్ని తీసుకురాగలిగేది కూడా వారేనని నారాయణమూర్తి చాలా స్పీచ్‌ల్లో చెబుతున్నారు. అంతేకాదు.. పెట్టుబడిదారి విధానంతో మంచి రోడ్లు, మంచి ఉద్యోగాలు వస్తాయని..దేశాన్ని ముందుకు నడిపేది క్యాపిటలిజమేనని ఆయన అంటున్నారు.
పనిలోపనిగా సోషలిస్ట్ సిద్ధాంతాలను నమ్మిన భారత్ తొలి ప్రధాని నెహ్రూని ఆయన విమర్శిస్తున్నారు. నెహ్రూ సోషలిస్టిక్ విధానాల వల్ల ఇండియా చాలా నష్టపోయిందని ఆరోపిస్తున్నారు.70వ దశకం ప్రారంభంలో తనకు పారిస్‌లో పని చేసే అవకాశం వచ్చిందని.. అక్కడున్నవారంతా ఇండియాను మురికి దేశంగా భావించేవారని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి. అప్పటికి దేశంలో పేదరికం ఉందని.. రోడ్లన్నీ గుంతలమయంగా ఉండేవని.. ఆ తర్వాత పెట్టుబడిదారి విధానాల కారణంగా ఆ పరిస్థితి మారిందని చెప్పారు. వ్యాపారాల్లో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండకూడదని.. పెట్టుబడిదారులు ఉద్యోగాలు సృష్టించడం ద్వారా దేశాన్ని నిర్మిస్తారని, వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని.. ఇదే దేశం ఎదుగుదలకు కారణం అవుతుందని నారాయణమూర్తి అప్పట్లోనే భావించారట..!
వారానికి 70 గంటల పని విధానం కారణంగా గుండెపోటు ముప్పు 33శాతం పెరుగుతుందని కెంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. అధిక పని ఒత్తిడితో 2016లో 7 లక్షల 45 వేల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు. 2010 - 2019 మధ్య 350 మంది ఇండియన్ డాక్టర్స్ కేవలం ఓవర్ టైమ్ వర్క్‌ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అటు అమెరికాలో వృత్తిపరమైన ఒత్తిడి ఆరోగ్య సమస్యలను విపరీతంగా పెంచుతుందని నివేదికలు చెబుతున్నాయి. పని-సంబంధిత ఒత్తిడి కారణంగా అమెరికాలో సంవత్సరానికి 20,231 మంది మరణిస్తున్నారు.
అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం అధిక పని ఒత్తిడితో ఆత్మహత్యలు 27శాతం పెరిగాయి. ఇక WHO స్టడి ప్రకారం వారానికి 55గంటలకు మించి పని చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం 1.3రెట్లు పెరుగుతుంది. మెడిబడ్డి రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 62శాతం మంది తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు..! అటు 160 దేశాల్లోని 1,28,278 మంది ఉద్యోగులను సర్వే చేసిన గాలప్.. ప్రతీ 1,000 మంది భారతీయ ఉద్యోగులలో 350 మంది విపరీతమైన కోపాన్ని కలిగి ఉన్నారని తేల్చింది. అటు తీవ్రమైన పని వేళల కారణంగా డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ టైమ్ వర్క్ కారణంగా తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటి సమస్యలు పెరుగుతాయి. ఇది డాక్టర్లు చెబుతున్న పచ్చి నిజాలు..!
సరే.. ఓసారి ఆరోగ్యం విషయాలను పక్కనపెడదాం..! పోని నారాయణమూర్తి చెప్పినట్టు కేవలం క్యాపిటలిజం మాత్రమే దేశాలను ముందుకు నడిపిస్తున్నాయా అంటే కాదనే చెప్పాలి.! చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిలో ఒకటిగా ఎదగడానికి ఉపయోగపడింది ఆ దేశం నమ్మిన సోషలిస్ట్ సిద్ధాంతాలు. అటు నాటి సోవియట్ రష్యాతో పాటు క్యూబా లాంటి దేశాలు సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ద్వారానే అభివృద్ధి చెందాయి. సరే ఈ సోషలిజాన్ని కూడా పక్కన పెడదాం..! మరి స్వీడన్, నార్వే దేశాల్లో వారానికి 35-40 పని గంటల విధానమే ఉంది కదా.. మరి అక్కడ ఉచిత ఆరోగ్యసేవలు, మెరుగైన ఉద్యోగ భద్రత ఎందుకున్నట్టు? గొడ్డుచాకిరి చేస్తేనే ప్రొడక్టవిటీ ఉంటుందని నారాయణమూర్తి చెప్పిన మాటలకు యూరప్‌లోని అభివృద్ధి చెందిన దేశాల ఉద్యోగ విధానాలకు ఏమాత్రం పొంతన లేదు.
ఇవి కళ్లకు కనిపిస్తున్న నిజాలు..! వీటి అన్నిటిని సమ్ అప్ చేసి ఒక మాట చెప్పనా.. 'A worker chained by exploitation may produce results, but never innovation.. true productivity thrives in freedom, not fear...' టార్గెట్లు పెట్టి డెడ్‌లైన్లు విధించి ఓవర్‌టైమ్ చేస్తే ఏదో ఒక ప్రొడక్టివిటీ కనిపిస్తుంది కానీ బెటర్ అవుట్‌పుట్ అయితే రాదు..! ఇండియాలో ఇప్పటికి చాలా కంపెనీల్లో వారానికి 48గంటల పని విధానం ఉంది. వారానికి ఆరు రోజుల వర్క్ ఉంటే రోజుకు 8 గంటలు పని చేస్తున్నట్టు లెక్కా! ఇక 48గంటలకే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. మరి వారానికి 70 గంటల పని అంటే రోజుకు దాదాపు 12గంటలు పనిచేయాలి..! మరి పర్శనల్ లైఫ్ ఏది? అంటే జీవితాంతం ఉద్యోగం చేయడానికి మనుషులు పుడుతున్నట్టా? మనుషులా.. మెషీన్లా? ఓ యాంత్రానికి కూడా రెస్ట్ లేకపోతే అది సరిగ్గా పనిచేయదు.. మరి బాడీకి, మైండ్‌కి విశ్రాంతి అవసరం లేదా?
-త్రినాథ్ బండారు
Comments
Please login to add a commentAdd a comment