ఢిల్లీ: మణిపూర్‌లో గిరిజనులు-గిరిజనేతరుల నడుమ చెలరేగిన వివాదాలు.. తీవ్ర హింసకు దారి తీశాయి. అల్లర్ల మూలంగా 60 మంది సాధారణ పౌరులు బలికాగా.. 300 మందిదాకా గాయపడ్డారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోందని మణిపూర్ హోంశాఖ ప్రకటించుకుంది. ఈ తరుణంలో మణిపూర్ హింస వెనుక మరో కారణం ఉందని ఓ ప్రొఫెసర్ అనుమానిస్తున్నారు.
మణిపూర్ అల్లర్ల వెనుక డ్రగ్ మాఫియా హస్తం ఉండొచ్చని అంటున్నారు జేఎన్‌యూ ప్రొఫెసర్ భగత్ ఓయినమ్. తాజాగా.. ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో హింస చెలరేగడానికి గల కారణాలని విశ్లేషించారు. బీజేపీ ప్రభుత్వం డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ దెబ్బకు విలవిలలాడిపోయిన మాఫియా.. మణిపూర్‌లో హింసకు కారణం అయ్యిందన్నారు.
ఇక.. కుకీ వర్గం తమ ఉనికి గురించి ఆందోళన చెందడం కూడా హింసకు మరో కారణమని అన్నారాయన. కుకీ వర్గం మయన్మార్ నుంచి అక్రమంగా మణిపూర్‌కు వలస వచ్చిందని ఆరోపించాయారన. మెయితీ కమ్యూనిటీకి గనుక ఎస్టీ హోదా లభిస్తే.. తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని, తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని కుకీ కమ్యూనిటీ అభద్రతా భావంలోకి కూరుకుపోయింది. అందుకే మెయితీలతో ఘర్షణకు దిగి.. మణిపూర్ కల్లోలానికి కారణమైందని తెలిపారాయన.
మే 3వ తేదీన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మునుపెన్నడూలేని రీతిలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అగ్గికి ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. అప్రమత్తమైన మణిపూర్ సర్కార్.. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు. మణిపూర్ సీఎం అభ్యర్ధన మేరకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికప్పుడు స్పందించి పారా మిలటరీ బలగాలను మణిపూర్లో మోహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంతగా పరిస్థితిని చక్కదిద్దినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణ నష్టంతో పాటు సుమారు 1,500 నివాసాలు ధ్వంసమై ఆస్తినష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేల డిష్యుం.. డిష్యుం. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment