
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది సకాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించిన ఎన్నికలతో ఎంతో అనుభవం గడించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ‘అసెంబ్లీల పదవీకాలం ముగియకముందే ఎన్నికలు జరపడం, విజేతల జాబితాలను గవర్నర్‌కు సమర్పించడం ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యం’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ ఉపఎన్నికలను, ఎమ్మెల్సీ ఎన్నికలను ఇటీవలి కాలంలో వాయిదా వేసినందున..వచ్చే ఏడాది మొదట్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు సాధ్యమేనా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..‘ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. కేసులు కూడా కొద్దిగా తగ్గాయి. మహమ్మారి సమయంలోనే బిహార్‌తోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిపిన అనుభవం వచ్చింది. మహమ్మారి సమయంలోనూ ఎన్నికలు ఎలా జరపాలనే విషయంలో ఎన్నో నేర్చుకున్నాం’అని వివరించారు. ‘ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతోంది. ఈ మహమ్మారి త్వరలోనే అదుపులోకి వస్తుందనే నమ్మకం మాకుంది. వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కచ్చితంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అవకాశం ఉంది’అని సుశీల్ చంద్ర పేర్కొన్నారు.
గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవిడ్ వ్యాపించకుండా ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. 80 ఏళ్లు పైబడిన వారికి, కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు వీలు కల్పించింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ల సంఖ్యను 1,500 నుంచి వెయ్యికి తగ్గించింది. అదేవిధంగా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఎన్నికలకు గాను ఓటర్లు భౌతిక దూరం పాటించేందుకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను సుమారు 80వేలకు పెంచింది.
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా నిబంధనల అతిక్రమణను గమనించిన ఈసీ కొన్ని దశల పోలింగ్‌కు.. రాజకీయ పార్టీల రోడ్‌షోలు, ర్యాలీలను నిషేధించింది. బహిరంగ సమావేశాల్లో పాల్గొనాల్సిన వారి సంఖ్యను 500కు పరిమితం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలోనూ, ఫలితాల అనంతరం రాజకీయ పార్టీల విజయోత్సవాలను కూడా నిషేధించింది. కాగా, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం 2022 మార్చితో పూర్తవుతుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మేలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల్లో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాలు, పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment