Sushil Chandra
-
నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌కుమార్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల తదుపరి ప్రధాన అధికారిగా ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషనర్(ఈసీ)గా ఉన్న రాజీవ్ కుమార్ తదుపరి సీఈసీగా 15న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ నోటిఫికేషన్‌ను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. రాజీవ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నిబంధన (2) ప్రకారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. 15 మే, 2022 నుంచి ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉంటారు’’అని ఆ నోటిఫికేషన్ వెల్లడించింది. కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ 2025 ఫిబ్రవరి వరకు పదవిలో కొనసాగుతారు. 1960, ఫిబ్రవరి 19న జన్మించిన కుమార్‌కు 2025 నాటికి 65 ఏళ్లు పూర్తవుతాయి. సీఈసీ లేదంటే ఎన్నికల కమిషనర్లు ఆరేళ్లు లేదంటే వారికి 65 ఏళ్లు పూర్తి కావడం ఏది ముందైతే అంతవరకు పదవిలో ఉంటారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు, మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు రాజీవ్ పర్యవేక్షణలోనే జరగనున్నాయి. రాజీవ్ కుమార్ ఈసీలో చేరడానికి ముందు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2020, సెప్టెంబర్ 1న ఆయన ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ కుమార్ బిహార్–జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాజీవ్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది. -
ఈసీ ఎవరి తొత్తు కాదు: సీఈసీ సుశీల్ చంద్ర
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగుతోందన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. గురువారం ఉదయం కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘‘ఐదు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల కోసం 31,000 కొత్త పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు ఆయన. మహిళలచే నిర్వహించబడే 1,900 పోలింగ్ బూత్‌లను సృష్టించాం. తద్వారా మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడం కనిపించింది. 5 రాష్ట్రాలలో 4 రాష్ట్రాల్లో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా నమోదు అయ్యిందని చెప్పారు సీఈసీ. ఇక ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే సమస్యే లేదు. 2004 నుండి EVMలు నిరంతరం ఉపయోగించబడుతున్నాయి. 2019 నుండి మేము ప్రతి పోలింగ్ బూత్‌లో VVPATని ఉపయోగించడం ప్రారంభించాము. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. ఇక యూపీలో ఈవీ ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ వివరణ ఇచ్చారు. స్ట్రాంగ్‌రూమ్ నుంచి ఓట్లు వేసిన ఏ ఈవీఎంను బయటకు తీయలేరు. కొన్ని పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి. మేం ఇచ్చిన వివరణతో ఆ పార్టీల వాళ్లు సంతృప్తి చెందారు. వారణాసిలోని ఈవీఎంలపై లేవనెత్తిన ప్రశ్నలు శిక్షణ నిమిత్తం ఉద్దేశించబడ్డాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం శిక్షణ అవసరాల కోసం ఈవీఎంల తరలింపు గురించి రాజకీయ పార్టీలకు తెలియజేయకపోవడమే ADM చేసిన పొరపాటు. ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే. ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించిన సమయంలో, EC MCC ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించింది. మొత్తం 5 రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే MCC ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 2,270 ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. One Nation One Election is a good suggestion but this needs a change in the Constitution. The Election Commission is fully geared up and is capable of holding all the elections simultaneously. We are ready to hold elections only once in 5 years: CEC Sushil Chandra pic.twitter.com/reixPOoqIl — ANI (@ANI) March 10, 2022 మీ అభ్యర్థిని తెలుసుకోండి(Know your candidate) యాప్ ఎన్నికల సంఘం చేపట్టిన విజయవంతమైన ప్రయత్నం. నేర నేపథ్యం ఉన్నవారు ఓటర్లకు తెలియాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి, మేము ఈ యాప్‌ని సృష్టించాము. ఈ ఎన్నికల్లో మొత్తం 6,900 మంది అభ్యర్థులలో 1,600 కంటే ఎక్కువ మంది నేర నేపథ్యం ఉన్నవాళ్లే! అని తెలిపారు సీఈసీ సుశీల్ చంద్ర. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి.. ఇది మంచి సూచన. అయితే దీనికి రాజ్యాంగంలో మార్పు అవసరం. అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. -
అసెంబ్లీ ఎన్నికలు 2022: ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు షురూ..
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. ఏడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ జనవరి 8న ప్రకటించింది. దీంతో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై కూడా నిషేదం విధించారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా 900 మంది అబ్జర్వర్లను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఇదే అభ్యర్థి వ్యయాన్ని రూ.28లక్షలుగా నిర్ణయించారు. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియ జనవరి 14న మొదలై.. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఫలితాలతో ముగియనుంది. చదవండి: (ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల) -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. కేంద్రానికి ఈసీ కీలక సూచన
ఒమిక్రాన్ భయాందోళనల నడుమ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. 2022 ఏడాది మొదట్లో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి పెరిగే అవకాశాలు ఉండడంతో ఈసీ, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలు, ర్యాలీల నిర్వహణతో కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నడుమ.. సోమవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో భేటీ సందర్భంగా ఈసీ ఈ కీలక సూచన చేసింది. వాయిదా ప్రసక్తే లేదు! ఒమిక్రాన్ విజృంభించే నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే అంశం పరిశీలించాలంటూ ప్రధాని మోదీ, ఈసీని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లపై చీఫ్ ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర స్పందిస్తూ.. యూపీ పరిస్థితుల సమీక్ష తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖతో చర్చలు, ఆయా రాష్ట్రాల్లో పర్యటనకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే సోమవారం చర్చల అనంతరం ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశంలో ఈసీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు వ్యాక్సినేషన్ పెంచాలంటూ కేంద్రంతో చేసిన సూచనలే అందుకు నిదర్శనం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, గోవాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ వంద శాతానికి చేరువైందని, ఉత్తర ప్రదేశ్‌లో 85 శాతం, మణిపూర్ పంజాబ్‌లో 80 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ఈసీ, కేంద్రాన్ని కోరింది. వరుస భేటీలు ఆరోగ్య కార్యదర్శి కాకుండా.. ఇంకోవైపు ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ దళాలను అప్రమత్తం చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఆయా విభాగాల హెడ్లతో సమావేశమవుతోంది. అంతేకాదు పంజాబ్, గోవా ఎన్నికల్లో డ్రగ్స్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్బీఐని సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఈసీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. చదవండి: PM Modi Mann Ki Baat.. స్వీయ అప్రమత్తతే దేశానికి బలం -
25% ఓటర్లు 30 ఏళ్లలోపు వారే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 18 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు నాలుగో వంతు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆవిష్కరించిన అట్లాస్ వెల్లడించింది. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల విశేషాలతో రూపొందించిన ఈ అట్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఈనెల 15న విడుదల చేశారు. 17వ లోక్‌సభ కోసం జరిగిన 2019 సాధారణ ఎన్నికలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ. అట్లాస్‌లో పొందుపరిచిన ముఖ్యాంశాలు ► మొత్తం 543 నియోజకవర్గాల్లో 8,054 మంది పోటీ చేయగా, అందులో 726 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు. 78 మంది మహిళా అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ► అత్యధికంగా 185మంది అభ్యర్థులు పోటీపడిన నియోజకవర్గం నిజామాబాద్. అత్యల్పంగా ముగ్గురు మాత్రమే పోటీ చేసిన నియోజకవర్గం తుర(మేఘాలయ). ► వయస్సు పరంగా చూస్తే 18–29 ఏళ్ల మధ్య 25.37 శాతం ఓటర్లు ఉన్నారు. ఈ విభాగంలో అత్యధికంగా మిజోరాంలో 39.77 శాతం, అత్యల్పంగా కేరళలో 20.16 శాతం, తెలంగాణలో 26.08% ఉన్నారు. ► 30–59 మధ్య వయస్సు వారు దేశవ్యాప్త ఓటర్లలో 59.77% ఉన్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీలో అత్యధికంగా ఈ కేటగిరీలో 62.14% కాగా, తెలంగాణలో 61.37% మంది ఉన్నారు. ► 60–79 ఏళ్ల మధ్య వారు మొత్తం ఓటర్లలో 13.15 శాతం ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు మొత్తం ఓటర్లలో 1.71 శాతం ఉన్నారు. ► అత్యధిక ఓటర్లు కలిగిన టాప్–5 నియోజకవర్గాల్లో మొదటిస్థానంలో మల్కాజిగిరి ఉండగా, ఐదో స్థానంలో చేవెళ్ల నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే సుమారు 56 లక్షల ఓటర్లు ఉన్నారు. ► అత్యల్పంగా పోలైన ఓట్ల శాతం నమోదైన 10 నియోజకవర్గాల్లో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ► లింగ నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. అత్యధికంగా పుదుచ్చేరిలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,118 మంది మహిళా ఓటర్లు ఉండగా, ఏపీలో 1,018మంది, తెలంగాణలో 990 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. -
2022లో ఐదు అసెంబ్లీలకు సకాలంలోనే ఎన్నికలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది సకాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించిన ఎన్నికలతో ఎంతో అనుభవం గడించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ‘అసెంబ్లీల పదవీకాలం ముగియకముందే ఎన్నికలు జరపడం, విజేతల జాబితాలను గవర్నర్‌కు సమర్పించడం ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యం’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ ఉపఎన్నికలను, ఎమ్మెల్సీ ఎన్నికలను ఇటీవలి కాలంలో వాయిదా వేసినందున..వచ్చే ఏడాది మొదట్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు సాధ్యమేనా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..‘ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. కేసులు కూడా కొద్దిగా తగ్గాయి. మహమ్మారి సమయంలోనే బిహార్‌తోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిపిన అనుభవం వచ్చింది. మహమ్మారి సమయంలోనూ ఎన్నికలు ఎలా జరపాలనే విషయంలో ఎన్నో నేర్చుకున్నాం’అని వివరించారు. ‘ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతోంది. ఈ మహమ్మారి త్వరలోనే అదుపులోకి వస్తుందనే నమ్మకం మాకుంది. వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కచ్చితంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అవకాశం ఉంది’అని సుశీల్ చంద్ర పేర్కొన్నారు. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవిడ్ వ్యాపించకుండా ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. 80 ఏళ్లు పైబడిన వారికి, కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు వీలు కల్పించింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ల సంఖ్యను 1,500 నుంచి వెయ్యికి తగ్గించింది. అదేవిధంగా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఎన్నికలకు గాను ఓటర్లు భౌతిక దూరం పాటించేందుకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను సుమారు 80వేలకు పెంచింది. పశ్చిమబెంగాల్లో ఎన్నికల సందర్భంగా నిబంధనల అతిక్రమణను గమనించిన ఈసీ కొన్ని దశల పోలింగ్‌కు.. రాజకీయ పార్టీల రోడ్‌షోలు, ర్యాలీలను నిషేధించింది. బహిరంగ సమావేశాల్లో పాల్గొనాల్సిన వారి సంఖ్యను 500కు పరిమితం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలోనూ, ఫలితాల అనంతరం రాజకీయ పార్టీల విజయోత్సవాలను కూడా నిషేధించింది. కాగా, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం 2022 మార్చితో పూర్తవుతుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మేలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల్లో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాలు, పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. -
కేంద్ర ఎన్నికల సంఘంలో కరోనా కలకలం
-
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సుశీల్ చంద్ర
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సుశీల్ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికల కమిషనర్‌గా చెలామణిలోకి వస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆయన 1980 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన అధికారి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తయారీలో సుశీల్ చంద్ర కీలక పాత్ర పోషించారు. టీ ఎస్ క్రిష్ణ మూర్తి తర్వాత ఓ ఐఆర్ఎస్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. -
ఇలా చేయకపోతే.. మీ పాన్ రద్దు
న్యూఢిల్లీ : మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తారా? పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేశారా. చేయకపోతే త్వరపడండి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలులో పాన్‌కార్డు, ఆధార్ లింకుచేయకపోతే పాన్‌కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇన్‌కం టాక్స్ రిటర్నలతో అను సంధానం కాని ప్యాన్లను రద్దుచేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఛైర్మన్ సుశీల్ చంద్ర తాజాగా వెల్లడించారు. ఆధార్, పాన్‌కార్డు నంబర్ల లింకింగ్‌కు గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సిబిడిటి ఛైర్మన్ ఈ హెచ్చరిక చేశారు. బయోమెట్రిక్ ఐడి ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌చేయాలని సిబిడిటి ఛైర్మన్ తెలిపారు. అసోచామ్ సదస్సులో పాల్గొన్న సుశీల్‌చంద్ర పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఐటిశాఖ ఇప్పటివరకూ 42 కోట్ల పాన్ నెంబర్లను జారీచేయగా, వీటిలో 23 కోట్ల పాన్‌కార్డులు మాత్రమే లింక్ అయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే మార్చి 31వ తేదీలోపు లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆధార్‌ను పాన్‌కార్డుతో లింక్చేస్తే పాన్‌కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల సంక్షేమపథకాలు అర్హులైన వ్యక్తులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుందన్నారు. కాగా సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల్లో విధిగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలకు పాన్ లింకింగ్ తప్పనిసరి కాదు. -
రూ.కోటి ఆదాయం దాటిన వారెంతమందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : 2018-19 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటిన వారి సంఖ్య 1.5 లక్షల మందిగా నమోదయ్యారు. డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర అసోచామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ వివరాలను విడుదల చేశారు. 125కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆర్ధికవృద్ధి 7.5శాతంగా ఉందని, కేవలం 1.5 లక్షల రిటర్నులు మాత్రమే కోటి రూపాయలకు పైబడిన ఆదాయం ఉన్నట్లు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ లాంటి విస్తృతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ సంఖ్య ఇంకా తక్కువగానే ఉందన్నారు. జీడీపి, వినియోగం పెరుగుతున్న దశలో కేవలం 1.5 లక్షలమంది మాత్రమే రిటర్నులు దాఖలుచేయడం శోచనీయమన్నారు. 2014-15లో 69వేలు మాత్రమే ఉందని, ఆ సంఖ్య ఇపుడు 1.5 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా వేతనజీవులే వున్నారనీ, సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లోని వారి ఆదాయం వివరాలు నమోదు కాలేదని తెలిపారు. ఏప్రిల్, జనవరి మధ్య ఈ ఏడాది కేవలం రూ.6.31 కోట్ల ఆదాయం పన్నురిటర్న్ దాఖలు అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం పోలిస్తే.. ఇది 37 శాతం ఎక్కువ. అలాగే 95 లక్షల మంది మొదటిసారిగా ఆదాయ వివరాలను నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 కోట్ల అదనపు పన్ను చెల్లింపుదారులను ఆశిస్తే 1.06 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులు మాత్రమే నమోదయ్యారని సీబీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. -
వార్షికాదాయం 9 లక్షలు దాటినా పన్ను లేదు!
సాక్షి బిజినెస్ డెస్క్: ఈ బడ్జెట్లో సెక్షన్ 87–ఏ కింద లభించే పన్ను రిబేటును పెంచడంతో చిన్న వేతనజీవుల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతోంది. ఈ రిబేటుతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర పన్నుమిన హాయింపులను కూడా పూర్తిగా వినియోగిం చుకుంటే రూ.10 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో రూ.3.50 లక్షలలోపు పన్ను ఆదాయంపై రూ.2,500 పన్ను రిబేటు లభించేది. ఇప్పడు ఈ రిబేటును రూ.5 లక్షల పన్ను ఆదాయంపై రూ.12,500కు పెంచారు. ఇప్పుడు వీటికి అదనంగా సెక్షన్ 80–సీ కింద లభించే రూ.1.50 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణానికి చెల్లించే వడ్డీ రూ.2,00,000, ఎన్పీఎస్కు చెల్లించే రూ.50 వేలు పన్ను మినహాయింపులను వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం వచ్చేవారు కూడా ఒక్క రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పన్ను ఆదాయం (టాక్సబుల్ ఇన్కమ్) రూ.5,00,000 కన్నా ఒక్క రూపాయి దాటినా ఈ రిబేటు వర్తించదు. అప్పుడు ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను లెక్కించి చెల్లించాల్సిందే. ఈ రిబేటును పెంచడంతో వార్షిక ఆదాయం రూ.5.50 లక్షలలోపు ఉన్న వారు ఎటువంటి పొదుపు చేయాల్సిన అవసరం లేకుండానే పన్ను భారం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 5 లక్షల వార్షికాదాయం గలవారికి నేరుగా రూ. 12,500 మేర రిబేటు లభిస్తుందని, దీంతో వారిపై పన్ను భారం ప్రసక్తి ఉండదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి మాత్రం ’పాత’ పన్ను రేట్లు యథాప్రకారం కొనసాగుతాయన్నారు. అయితే పీపీఎఫ్, జీపీఎఫ్, బీమా పథకాలు, మొదలైన వాటిల్లో రూ. 1.5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేసిన పక్షంలో రూ. 6.5 లక్షల వార్షికాదాయ వర్గాలూ పన్ను రిబేటు ప్రయోజనాలు పొందవచ్చని సుశీల్ వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంచడంతో వేతన జీవులకు మరో రూ. 10 వేల మేర అదనపు ప్రయోజనమూ లభిస్తుందన్నారు. దీంతో సుమారు 3 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందగలరన్న సుశీల్ చంద్ర.. ఖజానాకు మాత్రం రూ. 4,700 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందన్నారు. రూ. 5 లక్షల దాకా ఆదాయవర్గాలకు రిబేట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 18,500 కోట్ల దాకా ఆదాయం పోతుందన్నారు. -
ఐటీ చట్టాలు దుర్వినియోగం చేయొద్దు
న్యూఢిల్లీ: పన్నులు కట్టే విషయంలో వేతన జీవుల కన్నా కార్పొరేట్లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర సూచించారు. వివిధ మినహాయింపులు పోనూ భారత్‌లో బడా కంపెనీలపై విధిస్తున్న పన్ను భారం చాలా తక్కువే ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో పన్నులు ఎగవేసే ఉద్దేశంతో.. ఐటీ చట్టాలను దుర్వినియోగం చేయొద్దని సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్ర ఈ విషయాలు తెలిపారు. ‘చట్టాలు చాలా మటుకు సరళం చేశాం. సాధారణంగా మీరు అడిగేట్లుగానే రేటు కూడా సముచిత స్థాయిలోనే ఉండేలా చూస్తున్నాం. ఇక, పరిశ్రమవర్గాలు నిఖార్సుగా పన్నులు కడుతున్న పక్షంలో పన్ను రేటు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. వేతన జీవులకన్నా కంపెనీలు ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన చెప్పారు. -
సీబీడీటీ ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర పదవీకాలాన్ని మరో సం.రంపాటు పొడిగించారు. త్వరలో ముగియనున్న సీనియర్ బ్యూరోక్రాట్ సుశీల్ చంద్ర పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అపాయింట్మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. మే 31, 2018 వరకు పొడిగిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ఆరుగురు సభ్యులతో కూడిన సీబీడీటీ చంద్ర నేతృత్వంలో నల్లధనాన్ని ఎదుర్కోవడంలో విజయవంతమవుతున్న నేపథ్యంలో ఆయన పదవిని విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ గ్రాడ్యుయేట్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1980 వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి సుశీల్ చంద్ర గత ఏడాది నవంబరు 1న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ గా నియమితులయ్యారు. 2015 డిశెంబర్ నుంచి సీబీడీటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఛైర్మన్‌గా ఈయన పదవీకాలం జూన్ తో ముగియనుంది. మరోవైపు సీబీడీటీ చీఫ్ పదవి రేసులో ఉన్న నిషి సింగ్, గోపాల్ ముఖర్జీ చంద్ర కంటే ముందే రిటైర్ కానున్నారు. -
4.17 లక్షల కోట్లు.. అనుమానాస్పదం
నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లపై సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర • 18 లక్షల మంది అకౌంట్ల పరిశీలన... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు 18 లక్షల మంది సుమారు రూ.4.17 లక్షల కోట్ల అనుమానాస్పద డిపాజిట్లు చేసినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర గురువారం నాడు తెలిపారు. ‘‘ఆదాయపు పన్ను శాఖ వద్ద ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం... సంబంధిత వ్యక్తుల్లో 13 లక్షల మందికి నేడు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ప్రశ్నలను పంపడం జరిగింది. మిగిలిన 5 లక్షల మందికి శుక్రవారం ప్రశ్నలను పంపుతాం’’ అని బడ్జెట్ సెమినార్ అనంతర విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పైన పేర్కొన్న 18 లక్షల మంది డేటానే కాకుండా, మరో 10 లక్షల మంది డేటానూ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సీబీడీటీ స్వచ్ఛ ధన్ అభియాన్ (ఆపరేషన్ క్లీన్ మనీ) కింద వీరందరి డేటాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. పన్నుల ఎగవేతదారులను గుర్తించి, వారిపై చర్యలకు సీబీడీటీ తగిన చర్యలను అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. అనుమానాస్పద డిపాజిట్లకు సంబంధించి సీబీడీటీ నుంచి ఈ–మెయిల్స్ అందుకున్నవారు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఈ వారం మొదట్లోనే చైర్మన్ చంద్ర స్పష్టం చేశారు. వీరందరూ తమ ఆదాయాలకు, డిపాజిట్లకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. మార్చి నాటికి రిటర్న్స్ సమర్పించాల్సిందే! పన్ను అసెస్మెంట్లను త్వరితం చేయాల్సిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిప్రకారం, అసెస్మెంట్ ఇయర్లో మార్చి ముగిసేనాటికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా అన్ని ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఐటీ రిటర్న్స్, రివైజ్డ్ రిటర్న్స్ ప్రక్రియ మొత్తం మార్చినాటికి పూర్తవ్వాలని ఫైనాన్స్ బిల్లు 2017కు సంబంధించి ఒక మెమోరాండంలలో రెవెన్యూ శాఖ పేర్కొంది. రిటర్న్స్ ఫైలింగ్‌లో ఆలస్యం అయితే, ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ఆదాయం రూ. 5 లక్షల లోపు అయితే ఈ ఫీజు రూ.1,000గా ఉంది. ఆపైన రూ.5,000గా ఉంది. జూలై తరువాత, డిసెంబర్ లోపు అయితే ఈ మొత్తం ఫీజు చెల్లించాలి. ఫైలింగ్ డిసెంబర్ దాటితే రూ.10,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాత కేసులపైనా ఐటీ దృష్టి నల్లకుబేరులు, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం తాజాగా ఆదాయ పన్ను చట్టంలో తాజాగా సవరణలు చేసింది. దీని ప్రకారం లెక్కల్లో చూపని ఆస్తులు, డిపాజిట్లు రూ. 50 లక్షలపైగా విలువ చేసేవి.. ఐటీ సోదాల్లో బైటపడిన పక్షంలో అధికారులు పదేళ్ల క్రితం నాటి ఐటీ రిటర్న్‌లను కూడా పునఃపరిశీలించవచ్చు. ఇప్పటిదాకా ఆరేళ్ల దాకా మాత్రమే ఉండగా.. దీన్ని పదేళ్లకు పొడిగించినట్లు సుశీల్ చంద్ర తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇందుకు సంబంధించిన సవరణ అమల్లోకి రానుంది. దీంతో అసెస్సీకి సంబంధించి 2007 నాటి ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి, నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో మీ ఖాతాలు సరిచూసుకోండి న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులను గుర్తించడానికి నవంబర్ 8 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సేకరించిన సమాచారాన్ని.. తమ వద్ద ఉన్న సమాచారంతో ఐటీ శాఖ సరిచూస్తోంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపుదారులు నోట్ల రద్దు తర్వాత తమ ఖాతాల్లో నగదు జమల మొత్తాన్ని ఆన్లైన్లో సరిచూసుకోవాలని, ఒకవేళ తేడాలుంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది. ఖాతాదారుల ఇబ్బందులు తొలగించడానికి, అలాగే వారికి సహాయం చేయడానికి ఐటీ శాఖ యూజర్ గైడ్‌ను అందుబాటులో ఉంచింది. ఖాతాల్లో నగదు జమల సమాచారాన్ని incometaxindiaefiling. gov. in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పాన్ నంబర్‌తో దీనిని సరిచూసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్‌లోని ‘కాంప్లియన్స్’ విభాగంలోని ‘2016 క్యాష్ ట్రాన్సాక్షన్స్’ లింక్‌లో గతేడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకూ చేసిన లావాదేవీల సమాచారం ఉంచింది. తన ఖాతా నంబర్ పాన్‌కు సంబంధించినది అని పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతా కనుక పాన్‌కు సంబంధించినది కాకపోతే సంబంధిత ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆదాయపన్ను కార్యాలయానికి వెళ్లకుండానే నగదు జమ వివరాలను వెబ్సైట్లోనే వివరించేలా ఆ శాఖ చర్యలు తీసుకుంది.