4.17 లక్షల కోట్లు.. అనుమానాస్పదం | Rs 4.17 lakh crore suspicious deposits by 18 lakh people post note ban: CBDT | Sakshi
Sakshi News home page

4.17 లక్షల కోట్లు.. అనుమానాస్పదం

Published Fri, Feb 3 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

4.17 లక్షల కోట్లు.. అనుమానాస్పదం

4.17 లక్షల కోట్లు.. అనుమానాస్పదం

నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లపై  సీబీడీటీ చైర్మన్‌ సుశీల్‌ చంద్ర
18 లక్షల మంది అకౌంట్ల పరిశీలన...


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు 18 లక్షల మంది సుమారు రూ.4.17 లక్షల కోట్ల అనుమానాస్పద డిపాజిట్లు చేసినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) చైర్మన్‌ సుశీల్‌ చంద్ర గురువారం నాడు తెలిపారు. ‘‘ఆదాయపు పన్ను శాఖ వద్ద ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం... సంబంధిత వ్యక్తుల్లో 13 లక్షల మందికి నేడు ఈమెయిల్, ఎస్‌ఎంఎస్‌ ప్రశ్నలను పంపడం జరిగింది. మిగిలిన 5 లక్షల మందికి శుక్రవారం ప్రశ్నలను పంపుతాం’’ అని బడ్జెట్‌ సెమినార్‌ అనంతర విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పైన పేర్కొన్న 18 లక్షల మంది డేటానే కాకుండా, మరో 10 లక్షల మంది డేటానూ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

సీబీడీటీ స్వచ్ఛ ధన్‌ అభియాన్‌ (ఆపరేషన్‌ క్లీన్‌ మనీ) కింద వీరందరి డేటాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.   పన్నుల ఎగవేతదారులను గుర్తించి, వారిపై చర్యలకు సీబీడీటీ తగిన చర్యలను అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. అనుమానాస్పద డిపాజిట్లకు సంబంధించి సీబీడీటీ నుంచి ఈ–మెయిల్స్‌ అందుకున్నవారు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఈ వారం మొదట్లోనే చైర్మన్‌ చంద్ర స్పష్టం చేశారు.  వీరందరూ తమ ఆదాయాలకు, డిపాజిట్లకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.

మార్చి నాటికి రిటర్న్స్‌ సమర్పించాల్సిందే!
పన్ను అసెస్‌మెంట్లను త్వరితం చేయాల్సిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిప్రకారం, అసెస్‌మెంట్‌ ఇయర్‌లో మార్చి ముగిసేనాటికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా అన్ని ఐటీ రిటర్న్స్‌ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఐటీ రిటర్న్స్, రివైజ్డ్‌ రిటర్న్స్‌ ప్రక్రియ మొత్తం మార్చినాటికి పూర్తవ్వాలని ఫైనాన్స్‌ బిల్లు 2017కు సంబంధించి ఒక మెమోరాండంలలో రెవెన్యూ శాఖ పేర్కొంది. రిటర్న్స్‌ ఫైలింగ్‌లో ఆలస్యం అయితే, ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ఆదాయం రూ. 5 లక్షల లోపు అయితే ఈ ఫీజు రూ.1,000గా ఉంది. ఆపైన రూ.5,000గా ఉంది. జూలై తరువాత, డిసెంబర్‌ లోపు అయితే ఈ మొత్తం ఫీజు చెల్లించాలి. ఫైలింగ్‌ డిసెంబర్‌ దాటితే రూ.10,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

పదేళ్ల పాత కేసులపైనా ఐటీ దృష్టి   
నల్లకుబేరులు, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం తాజాగా ఆదాయ పన్ను చట్టంలో తాజాగా సవరణలు చేసింది. దీని ప్రకారం లెక్కల్లో చూపని ఆస్తులు, డిపాజిట్లు రూ. 50 లక్షలపైగా విలువ చేసేవి.. ఐటీ సోదాల్లో బైటపడిన పక్షంలో అధికారులు పదేళ్ల క్రితం నాటి ఐటీ రిటర్న్‌లను కూడా పునఃపరిశీలించవచ్చు. ఇప్పటిదాకా ఆరేళ్ల దాకా మాత్రమే ఉండగా.. దీన్ని పదేళ్లకు పొడిగించినట్లు సుశీల్‌ చంద్ర తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇందుకు సంబంధించిన సవరణ అమల్లోకి రానుంది. దీంతో అసెస్సీకి సంబంధించి 2007 నాటి ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి, నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  

ఆన్‌లైన్‌లో మీ ఖాతాలు సరిచూసుకోండి   
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులను గుర్తించడానికి నవంబర్‌ 8 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సేకరించిన సమాచారాన్ని.. తమ వద్ద ఉన్న సమాచారంతో ఐటీ శాఖ సరిచూస్తోంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపుదారులు నోట్ల రద్దు తర్వాత తమ ఖాతాల్లో నగదు జమల మొత్తాన్ని ఆన్‌లైన్‌లో సరిచూసుకోవాలని, ఒకవేళ తేడాలుంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది.  ఖాతాదారుల ఇబ్బందులు తొలగించడానికి, అలాగే వారికి సహాయం చేయడానికి ఐటీ శాఖ యూజర్‌ గైడ్‌ను అందుబాటులో ఉంచింది.

ఖాతాల్లో నగదు జమల సమాచారాన్ని incometaxindiaefiling. gov. in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పాన్‌ నంబర్‌తో దీనిని సరిచూసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్‌లోని ‘కాంప్లియన్స్‌’ విభాగంలోని ‘2016 క్యాష్‌ ట్రాన్సాక్షన్స్‌’ లింక్‌లో గతేడాది నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 30 వరకూ చేసిన లావాదేవీల సమాచారం ఉంచింది. తన ఖాతా నంబర్‌ పాన్‌కు సంబంధించినది అని పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతా కనుక పాన్‌కు సంబంధించినది కాకపోతే సంబంధిత ఆప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆదాయపన్ను కార్యాలయానికి వెళ్లకుండానే నగదు జమ వివరాలను వెబ్‌సైట్‌లోనే వివరించేలా ఆ శాఖ చర్యలు తీసుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement