న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల తదుపరి ప్రధాన అధికారిగా ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషనర్(ఈసీ)గా ఉన్న రాజీవ్ కుమార్ తదుపరి సీఈసీగా 15న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ నోటిఫికేషన్‌ను తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. రాజీవ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నిబంధన (2) ప్రకారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. 15 మే, 2022 నుంచి ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉంటారు’’అని ఆ నోటిఫికేషన్ వెల్లడించింది. కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ 2025 ఫిబ్రవరి వరకు పదవిలో కొనసాగుతారు. 1960, ఫిబ్రవరి 19న జన్మించిన కుమార్‌కు 2025 నాటికి 65 ఏళ్లు పూర్తవుతాయి. సీఈసీ లేదంటే ఎన్నికల కమిషనర్లు ఆరేళ్లు లేదంటే వారికి 65 ఏళ్లు పూర్తి కావడం ఏది ముందైతే అంతవరకు పదవిలో ఉంటారు.
త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు, మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు రాజీవ్ పర్యవేక్షణలోనే జరగనున్నాయి. రాజీవ్ కుమార్ ఈసీలో చేరడానికి ముందు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2020, సెప్టెంబర్ 1న ఆయన ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ కుమార్ బిహార్–జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాజీవ్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment