Eknath Shinde Govt: త్వరలో కొత్త జిల్లాలు! | Eknath Shinde govt Maharashtra Division of Districts | Sakshi
Sakshi News home page

Eknath Shinde Govt: త్వరలో కొత్త జిల్లాలు!

Published Sat, Jul 30 2022 1:36 AM | Last Updated on Sat, Jul 30 2022 1:36 AM

Eknath Shinde govt Maharashtra Division of Districts - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర చిత్రపటం (మ్యాపు) రూపురేఖలు త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని గత అనేక రోజులుగా డిమాండు ఉండటంతో నూతన జిల్లాల ఏర్పాటుకు నూతన ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. కానీ ముఖ్యమంత్రి షిందే నాసిక్‌ జిల్లా పర్యాటనలో ఉన్నారు. ఆయన శుక్రవారం రాత్రి మాలేగావ్‌లో బసచేయనున్నారు. దీంతో అక్కడి నాయకులతోపాటు స్థానిక ప్రజలు అనేక సంవత్సరాలుగా డిమాండు చేస్తున్నట్లుగా నాసిక్‌ జిల్లాను విభజించి మాలేగావ్‌ను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనను ఆయన ముందు ఉంచనున్నారు. దీనిపై ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో శనివారం తన పర్యటనలో నూతనంగా మాలేగావ్‌ జిల్లాను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయిని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనుంది. మాలేగావ్‌తోపాటు అనేక జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలను మరోసారి కదలికవచ్చింది. దీంతో రాబోయే రోజులలో మరిన్ని జిల్లాలు ఏర్పాటైతే రాష్ట్ర మ్యాప్‌ మారనుంది. జిల్లాల విభజన డిమాండుకు ప్రధాన కారణం ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అసౌకర్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పనుల జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలను విభజించి అదనంగా జిల్లాలు, తాలూకాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో అనేక జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ అనేక సంవత్సరాలు ఉంది.

దేశంలో అతిపెద్ద జిల్లాగా వెలుగొందుతున్న ఠాణే జిల్లాను 2013లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం రెండుగా విభజించింది. అందులో పాల్ఘర్‌ జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. దీంతో మిగతా జిల్లాల డిమాండ్లు ఆ సమయం నుంచి అధికమయ్యాయి. కానీ ఒక్కో కొత్త జిల్లా ఏర్పాటు చేయడానికి సుమారు రూ.350 కోట్లకుపైగా ఖర్చవుతాయి. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. కానీ కొత్తగా ఏర్పడిన షిందే ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో 36 జిల్లాలు, 288 తాలూకాలు ఉన్నాయి. ఇందులో 18 జిల్లాలను విభిజించి అందులోంచి 22 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలనే డిమాండు ఎప్పట్నుంచో ఉంది. ముఖ్యంగా 2015లోనే ఈ అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. అయితే రాష్ట్రంలో మారిన ప్రభుత్వాలు, రాజకీయ సమీకరణాలు తదితరాల అనంతరం మళ్లీ ఈ జిల్లాల విభజన అంశం తెరపైకి వచ్చింది.  

విభజన కానున్న లాతూరు జిల్లా! 
లాతూరు జిల్లాను విభజించి లాతూర్‌తోపాటు ఉద్గీర్‌ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని డిమాండు ఉంది. ఈ మేరకు ఉద్గీర్‌ జిల్లా ఏర్పాటు విషయంపై విభాగ కమిషనర్‌ సునీల్‌ కేంద్రేకర్‌ సూచనలను కోరారు. ముఖ్యంగా జిల్లా ఏర్పాటు అయితే నూతన జిల్లా కేంద్రం ఉద్గీర్‌లో జిల్లా కలెక్టరేట్‌ భవనం ఇతర విషయాలపై పరిశీలన కూడా జరగుతున్నట్లు సమాచారం. ఉద్గీర్‌ పట్టణం కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంది. లాతూరు నుంచి 70 కిలోమీరట్ల దూరంలో ఉన్న ఉద్గీర్‌లోని మార్కెట్లు చుట్టుపక్కల పరిసరాల్లో ఎంతో ప్రసిద్ధి. అనేక ఏళ్లుగా లాతూరు జిల్లాను విభజించి ఉద్గీర్‌ జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండు ఉంది.

ఉద్గీర్‌ జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నూతనంగా ఉద్గీర్‌ జిల్లా ఏర్పాటైతే లాతూర్‌ జిల్లాలోని మూడు తాలూకాలతోపాటు నాందేడ్‌ జిల్లాలోని లోహా కంధార్‌ తాలూకాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా కొత్తగా 22 జిల్లాలు, 49 తాలూకాలు ఏర్పాటు చేయాలని విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుందనేది వేచిచూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement