రాయ్‌పూర్ : పురాణాల్లో భర్త ప్రాణాల కోసం యుముడినే సావిత్రి ఎదురించిందని చెబుతుంటారు. అదే విధంగా తన భర్త ప్రాణాల కోసం అడవి బాట పట్టింది ఓ మహిళ. మావోయిస్టుల చెర నుండి తన భర్తను రక్షించుకునేందుకు రెండున్నరేళ్ల కూతురితో సహా తన ప్రాణాలనూ ఫణంగా పెట్టింది. తీరా భర్తను మావోయిస్టులు విడిచిపెట్టినా.. ఆమె మాత్రం అడవి నుంచి ఇంకా బయటకు రాకపోవడం కుటుంబ సభ్యులను ఆందోళన గురిచేస్తోంది.
వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్ తీవ్ర ఆవేదనకు గురైంది. దీంతో తాను ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలని భావించి.. పవార్‌ను విడుదల చేయాలని మావోయిస్టులను వేడుకుంటూ ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, ఈ వీడియోకు నక్సల్స్ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్థానిక జర్నలిస్టు సాయంతో ఆమె తన రెండున్నరేళ్ల కూతురిని వెంటతీసుకొని దండకారణ్యంలోకి వెళ్లింది.
ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టడంతో వారు సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ, వారిని వెతుక్కుంటూ వెళ్లిన సోనాలీ పవర్ మాత్రం అడవి నుంచి బయటకు రాకపోవడంతో పోలీసులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అడవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అశోక్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు పేర్కొన్నారు. సోనాలీ పవార్ కూడా సురక్షితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, నక్సల్స్ తమను ఇబ్బంది పెట్టలేదని, ఇరువురికి రూ. 2వేలు ఇచ్చి అడవి నుంచి పంపించినట్టు ఆనంద్ యాదవ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment