కోవిడ్ మహమ్మారి అందరికీ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పాఠాన్ని, జీవిత పరమార్థాన్ని నేర్పించి ఉంటుంది. 2020లో ఎక్కువ కాలం అందరూ ఇళ్లకు, తమ తమ పరిసరాలకే పరిమితం కావడం వల్ల దేశవ్యాప్తంగా పర్యావరణపరంగా, పచ్చదనం పెరుగుదల విషయంలో ఎంతో కొంత మేలు జరిగింది. ప్రస్తుతం వివిధ రూపాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడంతో పాటు ఒకసారి వాడి పారేసే వస్తువులకు గిరాకీ పెరగడం కాలుష్యం పెరుగుదలకు కారణమవుతోంది. ఇది పర్యావరణానికి సైతం నష్టం కలగజేస్తోంది. అయితే పర్యావరణ పరిరక్షణతో పాటు పుడమితల్లికి సాంత్వన చేకూర్చే వివిధ వినూత్న ఆవిష్కరణలకు కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు శ్రీకారం చుట్టారు. – సాక్షి, హైదరాబాద్
‘క్లాన్ ఎర్త్ అప్పారెల్ అండ్ ఫ్యాషన్స్’ లక్ష్యం పది లక్షల మొక్కలు
కాలుష్యం వ్యాప్తి, వాతావరణ మార్పులకు కొంతలో కొంతైనా తమ వంతుగా అడ్డుకట్ట వేయడంతోపాటుగా, ఎవరూ లేని వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రియాంక మండల్, బ్రోటీన్ విశ్వాస్ కోల్‌కతాలో ‘క్లాన్ ఎర్త్ అప్పెరల్ అండ్ ఫ్యాషన్స్’ను ప్రారంభించారు. 2030 కల్లా పది లక్షల మొక్కలు నాటాలనేది ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఎలా అంటే...పర్యావరణహిత ముడిపదార్థాలతో తయారు చేసిన బ్యాక్‌పాక్ బ్యాగ్‌లు, వాక్స్‌డ్ కాటన్ కాన్వాస్‌తో తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. వీటిలో మహిళల బ్యాగులు, పురుషుల వ్యాలెట్లు, బ్యాక్‌పాక్‌లు, కోకోనట్ క్యాండిల్స్‌తో పాటు వెదురు టూత్‌బ్రెష్, నేలలో నాటడానికి అనువైన నోట్ పుస్తకం వంటి 14 వస్తువులతో కూడిన ‘జీరో వేస్ట్ కిట్’వంటి ఉత్పత్తులున్నాయి. ఒక్కో వస్తువును వినియోగదారులు కొనుగోలు చేయగానే ఈ సంస్థ ప్రతినిధులు ఐదేసి మొక్కలు నాటడమే ప్రత్యేకతగా నిలుస్తోంది.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ‘చుక్’ఉత్పత్తులు
అయోధ్యకు చెందిన వేద్‌కృష్ణ తాను స్థాపించిన ‘చుక్’సంస్థ ద్వారా చెరుకు పిప్పితో డిస్పోజబుల్ ప్లేట్స్, బౌల్స్, బాక్స్‌లు తదితరాలను తయారు చేస్తున్నాడు. లెక్కకు మించి ఉత్పత్తి అవుతున్న చెత్తాచెదారం తగ్గించడంతో పాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలు, తదితరాలతో సులభంగా మళ్లీ భూమిలో కలిసిపోగలిగే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు. భారత రైల్వేస్ మొదలుకుని అమెజాన్, హల్దీరామ్, లైట్ బైట్ ఫుడ్స్, స్టార్‌బక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలెన్నో ‘చుక్’ కస్టమర్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన బాలీవుడ్ నటులు రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకునే వివాహా విందుకు 75 వేల యూనిట్ల తమ ఉత్పత్తులను ఈ సంస్థ పంపించింది.
‘ఎకో రైట్’ ద్వారా మాస్క్‌ల తయారీ
అహ్మదాబాద్‌కు చెందిన ఉదిత్‌సూద్, నిఖితా బర్మేచా ‘ఎకో రైట్’ సంస్థను ప్రారంభించారు. పర్యావరణహిత బ్యాగ్‌లు, రీసైకిల్ చేసిన కాటన్, జూట్ కలిపి (జూటన్) మాస్క్‌లు తయారుచేసి విక్రయిస్తున్నారు. పిల్లల కోసం వారికిష్టమైన కార్టూన్ల బొమ్మలతో బ్యాగ్‌లను తయారుచేస్తున్నారు. ఈవిధంగా 18 రకాల వస్తువులు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పనిచేసే వారిలో 90% మహిళా సిబ్బందే.
‘కార్బన్ క్రాఫ్ట్స్ డిజైన్’ పేరుతో టైల్స్
పర్యావరణహిత నిర్మాణాలతో పాటు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ‘కార్బన్ క్రాఫ్ట్స్ డిజైన్’ అనే కంపెనీ పనిచేస్తోంది. ముంబైలో ఈ సంస్థను తేజాస్ సిడ్నాల్ ప్రారంభించారు. అతనితో కలసి కొందరు ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పర్యావరణంలో, ఇతరత్రా వెలువడే వాయుకాలుష్యం నుంచి ‘బ్లాక్ కార్బన్’ను విడదీసి కార్బన్ టైల్స్‌ను ఈ కంపెనీ తయారుచేస్తోంది. వాయుకాలుష్యం నుంచే వివిధ రకాల భవన నిర్మాణ వస్తువులను, ముడిసరుకును తయారుచేస్తున్నారు. వాయుకాలుష్యం నుంచి సేకరించిన ఆయా హానికారక వస్తువులను సరైన పద్ధతుల్లో వేరు చేసి, వాటికి సిమెంట్, ఇతర సహజ ముడివస్తువులతో కార్బన్ టైల్స్, ఇతర వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. తాము చేపట్టే నిర్మాణాల్లో ఆ వస్తువులనే ఉపయోగిస్తున్నారు.
‘మింక్’ పేరుతో ఖాదీ వస్తువులు
రోజువారి జీవన విధానంలో ఖాదీ వినియోగాన్ని పెంచేందుకు, సహజమైన రంగులు, సేంద్రియ కాటన్ తదితరాలను ఉపయోగించి తయారుచేసే పర్యావరణహిత దుస్తులను మింక్ లేదా మినీ కౌచర్ సంస్థ రూపొందిస్తోంది. ఈ సంస్థను మిని, కొచ్చెరి సి షిబు ప్రారంభించారు. ప్రధానంగా ఖాదీని ఉపయోగించి మహిళలకు సంబంధించిన వివిధ రకాల దుస్తులు తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment