khadi wear
-
Khadi Fabric: ఖాదీ ఎందుకంత స్పెషల్? జరీ అంత కాస్ట్లీ ఎందుకు?
ఎర్రకోట అనగానే ఎవరికై నా పతాకావిష్కరణ గుర్తుకొస్తుంది. వినువీధిలో త్రివర్ణ పతాక రెపరెపలు చూడగానే మనసు దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అటువంటి వేడుకలో ఖాదీకి కూడా చోటు లభిస్తే.. నేరుగా దేశ ప్రధాని మోదీతో ముచ్చటించే అవకాశం లభిస్తే.. మన ముఖం పొందూరు జరీ ఖాదీ పంచె అంచులా మెరిసిపోతుంది. ఉత్సాహం ఉప్పొంగి మనసే ఉత్సవ వేదికగా మారుతుంది. సరిగ్గా అటువంటి అపురూప అనుభవమే ఇద్దరు పొందూరు ఖాదీ కళాకారుల సొంతమైంది. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయిన పొందూరు ఖాదీ ప్రతినిధులుగా దేశ రాజధాని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, ప్రధానితో మాట్లాడే అపురూప క్షణాలు జీవితంలో మర్చిపోలేనివని ఉత్సవాల్లో పాల్గొన్న నేతకారులు గర్వంగా చెబుతున్నారు. ఢిల్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారినే ఎందుకు ఎంపిక చేశారు? వారి ప్రత్యేకత ఏమిటి? ఢిల్లీలో అనుభవాలు ఏమిటి? వారి నుంచే తెలుసుకుందాం. కాంతమ్మా.. కుశలమా.. ఈమె పేరు జల్లేపల్లి కాంతమ్మ. పొందూరు. వయసు 75. ఆరేళ్ల ప్రాయం నుంచి సంప్రదాయ ఖాదీ వస్త్రం తయారు చేస్తోంది. దేశంలోనే నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం గల అతికొద్ది మంది వ్యక్తుల్లో కాంతమ్మ ఒకరు. ముగ్గురు కుమారులు బాగానే స్థిరపడినా.. ఖాదీ మీద మక్కువతో ఆమె పాత ఇంటిలోనే ఉంటూ రోజుకు 6 గంటలు ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. కేవలం రోజుకు రూ.200 మాత్రమే సంపాదిస్తున్నా.. కోట్ల రూపాయల విలువైన తృప్తి కోసమే తాను ఈ పని చేస్తున్నానని గర్వంగా చెబుతున్నారు ఆమె. తాను 75 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నానని అంటే అది ఖాదీ పుణ్యమేనని.. చెబుతారు కాంతమ్మ. అసలు కాంతమ్మ ఎంచుకున్న సంప్రదాయ విధానం ఏమిటి? వాలుగు చేప ముల్లుతో పత్తిని శుభ్రపరచడం ఖాదీ వస్త్రం తయారీలో ఈ దశలు కీలకమైనవి.. నిడుచుటగా పిలిచే ప్రక్రియలో పత్తి గింజలను వేరు చేయడం పత్తిని మెత్తగా తయారు చేయడం చిలపలు పోయడం మరిచిపోలేని జ్ఞాపకం.. నేను చదువుకోలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది.. ఖాదీ తయారీలో భాగమవ్వడమే. నేను ఏ రోజూ కష్టపడుతున్నాననే భావన నాలో రానీయను. ఇష్టంగా పనిలో నిమగ్నమవుతా. నన్ను కలిసేందుకు చాలా మంది వస్తుంటారు. ఖాదీ తయారీలో ప్రక్రియల్ని ఓపికగా వివరిస్తా. వారికి అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టను. ఖాదీ గొప్పతనాన్ని వారికి చెబుతా. ఢిల్లీ.. ఎర్రకోట ప్రధాన మంత్రి వంటి పదాలు వినడమే తప్ప.. నేను ఎప్పుడూ చూస్తానని కలలో కూడా ఊహించ లేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు నాలాంటి సామాన్యురాలిని ఎర్రకోటకు పిలిచి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం. చాలా గర్వంగా ఉంది. – జల్లేపల్లి కాంతమ్మ, పొందూరు. ఏకు చుట్టడం జరీ నేతలో మొనగాడు చిత్రంలో వీరిద్దరి పేర్లు భద్రయ్య, లక్ష్మి. భార్యభర్తలు. ఊరు పొందూరు. ఇద్దరూ నేతకారులే. జరీపంచె నేతలో ఒకే ఒక్కడు ఈ భ ద్రయ్య. మంచి నైపుణ్యం ఈయన సొంతం. ఏఎన్నార్ పేరుతో పిలిచే ఖాదీ పంచెకు బంగారం వర్ణంలో ఉండే అంచును అత్యంత అద్భుతంగా నేయడంలో ఈయనది అందెవేసిన చేయి. ఇంటర్ వరకు చదువుకున్న భద్రయ్య వృత్తిలో సంతృప్తి వెతుకునే వ్యక్తి త్వం ఉన్న మనిషి. రోజుకు కేవలం రూ.500 మాత్ర మే సంపాదించే ఈయన జరీనేతలో దేశవ్యాప్తంగా ఉన్న కొద్ది మంది నేతన్నలలో మొనగాడే. ఈ నేతకు ఇద్దరు వ్యక్తులు అవసరం కావడంతో భార్య సహకారంతో మనసుకు నచ్చిన పనిచేసి దేశప్రధాని మనసును గెలుచుకున్నాడు ఈ నేతన్న. ఏమిటీ జరీ నేత..ఖరీదు ఎందుకంత..! పంచెకు అంచు అందం. అంచు ఎంత ఎక్కువ తళుక్కుమంటే అంత ఖరీదైనదని అర్థం. శ్వేత, గోధుమ వర్ణంలో సున్నితంగా ఉండే ఖాదీ జరీపంచెలు కాస్త ఖరీదైన వ్యవహారం. మామూలు ఖాదీ పంచె రూ. 600 నుంచి రూ.800 మధ్యలో లభ్యమవుతుంది. ఒక్కో జరీ పంచె ఖరీదు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుందంటే దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. జీవితాంతం గుర్తుండిపోయేలా.. ఉదయం లేవడం.. వృత్తిలో నిమగ్నమవ్వడం. నా కుటుంబం. ఇదే నా దినచర్య. ఢిల్లీకి బయల్దేరాలని ఖాదీ బోర్డు సభ్యులు చెబితే ఆశ్చర్యమేసింది. అదీ ఎర్రకోటలో జరిగే మువ్వన్నెల వేడుకకు.. ప్రధానిని కలిసేందుకు అంటే చాలా గర్వపడ్డాను. ప్రధానమంత్రిని దగ్గర నుంచి చూశా. ఓ నేతకారుడిగా నాకు దక్కిన ఈ గొప్పఅవకాశం.. ఆ అద్భుత క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నాకు వృత్తిలో చేదోడు వాదోడుగా ఉండే నా భార్యతో సహా నేను ఢిల్లీకి వెళ్లడం జీవితంలో మరిచిలేనిది. – బళ్ల భద్రయ్య, పొందూరు -
‘రణ్వీర్- దీపికా వివాహ విందుకు వీరే సప్లై చేశారు’
కోవిడ్ మహమ్మారి అందరికీ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పాఠాన్ని, జీవిత పరమార్థాన్ని నేర్పించి ఉంటుంది. 2020లో ఎక్కువ కాలం అందరూ ఇళ్లకు, తమ తమ పరిసరాలకే పరిమితం కావడం వల్ల దేశవ్యాప్తంగా పర్యావరణపరంగా, పచ్చదనం పెరుగుదల విషయంలో ఎంతో కొంత మేలు జరిగింది. ప్రస్తుతం వివిధ రూపాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడంతో పాటు ఒకసారి వాడి పారేసే వస్తువులకు గిరాకీ పెరగడం కాలుష్యం పెరుగుదలకు కారణమవుతోంది. ఇది పర్యావరణానికి సైతం నష్టం కలగజేస్తోంది. అయితే పర్యావరణ పరిరక్షణతో పాటు పుడమితల్లికి సాంత్వన చేకూర్చే వివిధ వినూత్న ఆవిష్కరణలకు కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు శ్రీకారం చుట్టారు. – సాక్షి, హైదరాబాద్ ‘క్లాన్ ఎర్త్ అప్పారెల్ అండ్ ఫ్యాషన్స్’ లక్ష్యం పది లక్షల మొక్కలు కాలుష్యం వ్యాప్తి, వాతావరణ మార్పులకు కొంతలో కొంతైనా తమ వంతుగా అడ్డుకట్ట వేయడంతోపాటుగా, ఎవరూ లేని వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రియాంక మండల్, బ్రోటీన్ విశ్వాస్ కోల్‌కతాలో ‘క్లాన్ ఎర్త్ అప్పెరల్ అండ్ ఫ్యాషన్స్’ను ప్రారంభించారు. 2030 కల్లా పది లక్షల మొక్కలు నాటాలనేది ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఎలా అంటే...పర్యావరణహిత ముడిపదార్థాలతో తయారు చేసిన బ్యాక్‌పాక్ బ్యాగ్‌లు, వాక్స్డ్ కాటన్ కాన్వాస్‌తో తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. వీటిలో మహిళల బ్యాగులు, పురుషుల వ్యాలెట్లు, బ్యాక్పాక్లు, కోకోనట్ క్యాండిల్స్‌తో పాటు వెదురు టూత్‌బ్రెష్, నేలలో నాటడానికి అనువైన నోట్ పుస్తకం వంటి 14 వస్తువులతో కూడిన ‘జీరో వేస్ట్ కిట్’వంటి ఉత్పత్తులున్నాయి. ఒక్కో వస్తువును వినియోగదారులు కొనుగోలు చేయగానే ఈ సంస్థ ప్రతినిధులు ఐదేసి మొక్కలు నాటడమే ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ‘చుక్’ఉత్పత్తులు అయోధ్యకు చెందిన వేద్‌కృష్ణ తాను స్థాపించిన ‘చుక్’సంస్థ ద్వారా చెరుకు పిప్పితో డిస్పోజబుల్ ప్లేట్స్, బౌల్స్, బాక్స్‌లు తదితరాలను తయారు చేస్తున్నాడు. లెక్కకు మించి ఉత్పత్తి అవుతున్న చెత్తాచెదారం తగ్గించడంతో పాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలు, తదితరాలతో సులభంగా మళ్లీ భూమిలో కలిసిపోగలిగే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు. భారత రైల్వేస్ మొదలుకుని అమెజాన్, హల్దీరామ్, లైట్ బైట్ ఫుడ్స్, స్టార్‌బక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలెన్నో ‘చుక్’ కస్టమర్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన బాలీవుడ్ నటులు రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకునే వివాహా విందుకు 75 వేల యూనిట్ల తమ ఉత్పత్తులను ఈ సంస్థ పంపించింది. ‘ఎకో రైట్’ ద్వారా మాస్క్‌ల తయారీ అహ్మదాబాద్‌కు చెందిన ఉదిత్సూద్, నిఖితా బర్మేచా ‘ఎకో రైట్’ సంస్థను ప్రారంభించారు. పర్యావరణహిత బ్యాగ్‌లు, రీసైకిల్ చేసిన కాటన్, జూట్ కలిపి (జూటన్) మాస్క్‌లు తయారుచేసి విక్రయిస్తున్నారు. పిల్లల కోసం వారికిష్టమైన కార్టూన్ల బొమ్మలతో బ్యాగ్‌లను తయారుచేస్తున్నారు. ఈవిధంగా 18 రకాల వస్తువులు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పనిచేసే వారిలో 90% మహిళా సిబ్బందే. ‘కార్బన్ క్రాఫ్ట్స్ డిజైన్’ పేరుతో టైల్స్ పర్యావరణహిత నిర్మాణాలతో పాటు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ‘కార్బన్ క్రాఫ్ట్స్ డిజైన్’ అనే కంపెనీ పనిచేస్తోంది. ముంబైలో ఈ సంస్థను తేజాస్ సిడ్నాల్ ప్రారంభించారు. అతనితో కలసి కొందరు ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పర్యావరణంలో, ఇతరత్రా వెలువడే వాయుకాలుష్యం నుంచి ‘బ్లాక్ కార్బన్’ను విడదీసి కార్బన్ టైల్స్‌ను ఈ కంపెనీ తయారుచేస్తోంది. వాయుకాలుష్యం నుంచే వివిధ రకాల భవన నిర్మాణ వస్తువులను, ముడిసరుకును తయారుచేస్తున్నారు. వాయుకాలుష్యం నుంచి సేకరించిన ఆయా హానికారక వస్తువులను సరైన పద్ధతుల్లో వేరు చేసి, వాటికి సిమెంట్, ఇతర సహజ ముడివస్తువులతో కార్బన్ టైల్స్, ఇతర వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. తాము చేపట్టే నిర్మాణాల్లో ఆ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. ‘మింక్’ పేరుతో ఖాదీ వస్తువులు రోజువారి జీవన విధానంలో ఖాదీ వినియోగాన్ని పెంచేందుకు, సహజమైన రంగులు, సేంద్రియ కాటన్ తదితరాలను ఉపయోగించి తయారుచేసే పర్యావరణహిత దుస్తులను మింక్ లేదా మినీ కౌచర్ సంస్థ రూపొందిస్తోంది. ఈ సంస్థను మిని, కొచ్చెరి సి షిబు ప్రారంభించారు. ప్రధానంగా ఖాదీని ఉపయోగించి మహిళలకు సంబంధించిన వివిధ రకాల దుస్తులు తయారు చేస్తున్నారు. -
‘మందు తాగం.. ఖాదీ వస్త్రాలే ధరిస్తాం’
చండీగఢ్: మరో కొద్ది రోజుల్లో హరియాణ అసెంబ్లీ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలన్ని అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార కార్యక్రమాల వంటి అంశాల గురించి కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. పార్టీ టికెట్ ఆశించేవారు తప్పకుండా వీటిని పాటించాలని పేర్కన్నది. ఈ మేరకు ‘ఘోష్నా పత్ర’ పేరుతో ఉన్న నియమాల జాబితాను హరియాణా కాంగ్రెస్ చీఫ్ సెల్జా కుమారి ట్వీట్ చేశారు. మంచి వారు, అంకితభావం గల అభ్యర్థులను ఎంపిక చేయడం కోసమే ఈ నియమాలను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావించే వారు మద్యం సేవించమని.. ఖాదీ వస్త్రాలు ధరిస్తామని స్పష్టం చేయాలి. గాంధీమార్గంలో పయనిస్తూ.. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని హామీ ఇవ్వాలి. అంతేకాక లౌకిక వాదాన్ని విశ్వసిస్తామని.. కుల, మత విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయనని ప్రమాణం చేయాలి. అంతేకాక జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థి టికెట్ ఆశిస్తే.. రూ.5000 చెల్లించాలని.. ఎస్సీ అభ్యర్థులైతే రూ. 2వేలు, మహిళా అభ్యర్థులైతే రూ.3000 చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కోసం భారీ ఎత్తున బరిలోకి దిగుతుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. గతంలో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితం అయ్యింది. -
ఖాదీ హో
స్వాతంత్య్ర భావనలకు ప్రతీక ఖాదీ.స్వరాజ్య పోరాట చిహ్నం ఖాదీ.ఖాదీ అంటే అదేదో ఫ్రీడమ్ ఫైటర్ల బ్రాండ్ అనేది ఓ పాత నమ్మకం. ఇప్పుడు ఫ్రీడమ్‌ను ఇష్టపడేది యువతే.అలాంటప్పుడు యూత్ స్వతంత్ర పోకడలకు ఖాదీ ఓ స్టైల్ స్టేట్మెంట్ ఎందుకు కాకూడదు?దేశం కోసం జయహో అన్నట్టే... తమ దేహం మీద స్టైల్‌గా ఖాదీ హో అంటోందిప్పటి యువత. ►మోడ్రన్‌గా కనిపించాలంటే ఖాదీ చీరకు బ్లౌజ్‌గా లూజ్ క్రాప్‌టాప్స్, షర్ట్స్, జాకెట్‌ని ఎంపిక చేసుకోవచ్చు. సింపుల్ అండ్ మార్వలెస్ అనే కితాబులు పొందవచ్చు. ►‘ఖాదీ చీరనా! అది బామ్మల కట్టు మనకొద్దు’ అనే మాట ఈ నయాస్టైల్ చూస్తే మార్చేసుకుంటారు. తమ వార్డ్రోబులో ఖాదీకి ప్రత్యేక స్థానం ఇస్తారు. ►వెస్ట్రన్ డ్రెస్‌ల మీదకు వేసి షోల్డర్‌లెస్ క్రాప్స్ ఖాదీ చీరను అందాన్ని కూడా వినూత్నం చేసేసింది. ఆధునిక మహిళ చేత అభినందనలు అందుకుంటోంది. ►ఒకప్పుడంటే ముడులు వేసే రవికలు ఉండేవి. ఇప్పుడా స్టైల్ మారి కొత్తగా రూపుదిద్దుకుంది. కుచ్చులున్న జాకెట్ ముడితో ఖాదీ కట్టు మరింత కలర్ఫుల్గా మారింది. -
మోదీ కుర్తాకు యువత ఫిదా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ధరించే కుర్తా–జాకెట్‌కు యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దేశంలోని ఏడు ఖాదీ ఇండియా అవుట్‌లెట్లల్లో కలిపి రోజుకు 1,400కు పైగా మోదీ కుర్తా–జాకెట్లు అమ్ముడవుతున్నాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) చైర్మన్ వీకే సక్సేనా తెలిపారు. కాగా, ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ వస్త్ర శ్రేణిని ఖాదీ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని అవుట్లెట్లలో వీటిని అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, కోల్కత్తా, జైపూర్, జోథ్‌పూర్, భోపాల్, ముంబై, ఎర్నాకులం ఖాదీ అవుట్లెట్లలో సగటున రోజుకు 200కు పైగా మోదీ ‘కుర్తా–జాకెట్లు’ అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఖాదీని ప్రోత్సహించాలన్న నరేంద్రమోదీ పిలుపు ఇవ్వటంతో ఈ వస్త్రాల అమ్మకాలు పెరిగినట్లు అభిప్రాయపడ్డారు. -
ఖైదీల జీవితానికి ఖాదీ డిజైనింగ్..!
తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రయాణం మొదలుపెడితేనే జీవితం మెరుగవుతుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా తమ జీవితాలను కొత్తగాడిజైన్ చేసుకుంటున్నారు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ మహిళాఖైదీలు. అందుకోసం వారికి కొండంత ఆసరాను అందిస్తూ సృజనాత్మ ప్రపంచంలో జీవించే హక్కును కలిగిస్తున్నారు ఆ జైలు అధికారులు. సెలీనా.. జానకి.. హసీనా దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలు అది. అక్కడ వేల సంఖ్యలో ఖైదీలు శిక్షలో భాగంగా జీవన నైపుణ్యాలలో శిక్షణ పొందుతుంటారు. ప్రత్యేకించి మహిళా ఖైదీలు కొందరు విడుదలై వచ్చాక ఖాదీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో నిలదొక్కుకుంటున్నారు. ‘‘మూడేళ్ల క్రితం నేను ఖైదీని. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సర్కిల్లో నేనూ ఒకరిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను’’ అంటుంది 22 ఏళ్ల సెలీనా. మరొక మాజీ ఖైదీ జానకి ఓ బొటిక్‌ని నిర్వహిస్తూ తన 24 ఏళ్ల కొడుకుతో కలిసి సమాజంలో గర్వంగా బతుకుతోంది. ‘మొదట చాలా నిరాశకు గురయ్యాను. నా తల రాతను నేనే తిట్టుకునేదాన్ని. కానీ, జీవితాన్ని తిట్టుకుంటూ కూర్చోనక్కర్లేదని జైలులో గ్రహించాను. జైల్లో నేర్చుకున్న విద్య నాకో కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అని చెబుతోంది జానకి. మూడేళ్ల పాటు జైలులో ఉన్న హసీనా తన కుటుంబంలోని వారందరితోనూ పూర్తి దూరంగా ఉంది. ఇప్పుడు పాత సంబంధాలను పునర్నిర్మించుకోవాలని ఆమె కోరుకోవడం లేదు. ‘‘నాకు అవసరమైనప్పుడు నా కుటుంబం నన్ను దూరంగా పెట్టింది. కనీసం నాతో మాట్లాడటానికే ఇష్టపడేది కాదు. ఇప్పుడు.. నేను వారి నుంచి చాలా దూరం వచ్చేశాను. కానీ, వారు నాతో మాట్లాడాలనుకుంటున్నారు’ అంటూ ఫ్యాషన్ రంగంలో తన కాళ్లపై తాను నిలబడిన తర్వాత మారిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌కు డ్రెస్ డిజైనింగ్! హరీశ్వ్యాస్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న బాలీవుడ్ చిత్రం ‘మార్క్‌షీట్’ (కొత్తది) కోసం దుస్తులను రూపొందించిన కొంతమంది ఖైదీలలో వీరు ముఖ్యులుగా ఉన్నారు. ఈ చిత్ర తారాగణం కోసం మహిళా ఖైదీలు రూపొందించిన దుస్తులను ధరించి మోడల్స్ ఫ్యాషన్ షోలో వెలిగిపోయారు. ఈ ఫ్యాషన్ షోను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ జహీద్తో సహా ఇతర నటీనటులు సందర్శించారు. ‘‘సినిమా, క్రికెట్ రంగాలలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో వెంటనే ప్రజలకు తెలిసిపోతుంది. జైలులో ఉన్న వ్యక్తులు నేరాలకు పాల్పడినవారే కావచ్చు. కానీ, వారెప్పటికీ అలా నేరస్తులుగానే ఉండిపోనక్కర్లేదు. వారిలో కష్టపడాలనే తత్త్వం, నిజాయితీ కనిపిస్తోంది. కొన్నేళ్ల తర్వాత జైలు ఖైదీలు ఒక సినిమాకు క్యాస్టూమ్ రూపకర్తలుగా ఉన్నారని చరిత్రలో లిఖించబడుతుంది’’ అన్నారు వీరంతా! ఫ్యాషన్ డిజైనర్ వింకీ సింగ్ మాట్లాడుతూ ‘డిజైనింగ్ దుస్తులు అంటేనే వ్యాపారపరంగా చూస్తాం. కానీ, ఈ సినిమాలో డ్రెస్సులను చూస్తే ఒక విభిన్నమైన ఆలోచన కలుగుతుంది. నేను సినిమాలకు, సినిమా ప్రముఖులకు దుస్తులను డిజైన్ చేశాను. ఆ విధంగా మార్క్‌షీట్ కోసం పనిచేసే అవకాశం లభించింది. అయితే, అదే సినిమాకు జైలు ఖైదీలతో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేనిది. వారానికి మూడు సార్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ఖైదీలను కలిసేవాడిని. వారిలో పని నేర్చుకోవాలనే తపన, సృజన చాలా గొప్పది’’ అని అన్నారు. మరోవైపు తరుణ్ తహిలియాన్, రీతూకుమార్ వంటి ప్రముఖ డిజైనర్లతో కలిసి పని చేస్తూ సమాజంలో తామూ ఒక సృజనాత్మక రంగంతో కలిసి నడుస్తున్నారు ఈ మహిళా ఖైదీలు. – ఎన్.ఆర్. -
ఖాదీ.. అదే మా నినాదం
జాతిపిత మహాత్మాగాంధీ అంటే స్వతంత్ర పోరాటం.. ఆపై ఠక్కున గుర్తుకు వచ్చేది ఆయన చేసిన స్వదేశీ ఉద్యమమే. గాంధీ మహాత్ముడు స్వయంగా చరఖా చేతపట్టి నూలువడికి.. చేనేత దుస్తులను ధరించేవారు. దాదాపు శతాబ్దం తరువాత.. మళ్లీ దేశంలో అప్రకటి స్వదేశీ ఉద్యమం మొదలైంది. చేనేత, ఖాదీ, ఖద్దర్ దుస్తులకు దేశంలో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా ఆధునిక యువత ఈ దుస్తులపై అధికంగా మోజు పెంచుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాషన్‌గా ఉండే ప్రతి వస్తువును.. హ్యాండ్మేడ్గా (చేతివృత్తులు) ఉండేలా యువత చూసుకుంటోంది. ఇదే చేనేత వృత్తులు అవలంబించేవారికి కొత్త ఉపాధిని అందిస్తోందని పలువురు ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. ఖాదీ దుస్తుల్లో చరఖా మీద నూలు వడికిన వాటికి ఉత్తర భారతీయ యువత అధిక ప్రధాన్యతను ఇస్తోందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్రం వచ్చాక.. ఖాదీ పరిశ్రమ ఏళ్ల తరబడి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. పేదవాళ్లు మాత్రమే ఖాదీ దుస్తులు ధరిస్తారనే అపోహ కూడ ఒక కారణం. అయితే ఆధునిక కాలంలో ఖాధీ అత్యంత లగ్జరీ, విలాసవంతమైన దుస్తులుగా గుర్తింపు పొందడంతో మళ్లీ డిమాండ్ పెరిగిందని.. ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మన ఖాదీ దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని ముంబై డిజైనర్లు పేర్కొంటున్నారు. ఆధునిక యువతలో దేశభక్తి అధికంగా పెరగడం, అదే సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం సామాజికంగా బలపడ్డంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఫ్యాషన్ డిజైన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సునీల్ సేథీ చెప్పారు. అందులోనూ ఖాదీలో రంగులు, విభిన్న మోడల్స్ అందుబాటులోకి రావడంతో.. వీటిని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అన్నారు. -
ఉద్యోగులూ.. ఖాదీ దుస్తులనే ధరించండి
పాట్నా: తమను తాము మహాత్మా గాంధీ అనుచరులుగా పేర్కొన్న బీహార్ ప్రభుత్వ పెద్దలు.. ఉద్యోగులందరూ ఇకపై ఖాదీ (ఖద్దరు) దుస్తులనే ధరించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజని కుమార్ సింగ్ శుక్రవారం అన్ని శాఖల ఉద్యోగులకు లేఖలు రాశారు. 'ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తోంది. అందుకు ప్రతిగా మీరు కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పనులు చేయాల్సి ఉంటుంది. వారానికి కనీసం రెండు సార్లు ఖద్దరు దుస్తులు ధరించి కార్యాలయాలకు రావాలి. దీనివల్ల చేనేత రంగం బలపడటమే కాకుండా ఆర్థికంగా పరిపుష్టిని సాధించే వీలవుతుంది' అని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉద్యోగులు తు.చ. తప్పకుండా పాటించాలని, దీనివల్ల చేనేత రంగంలో మరింత మందికి ఉపాధి లభిస్తుందని, పైపెచ్చు ఖాదీ ధారణ పర్యావరణానికి కూడా మేలుచేస్తుందని బీహార్ పౌర సరఫరాల శాఖ మంత్రి షయమ్ రజాక్ అన్నారు.