ఫ్యాషన్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తున్న తీహార్ మాజీ ఖైదీలు. వాళ్లు ధరించిన దుస్తులు వాళ్లు డిజైన్ చేసినవే!
తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రయాణం మొదలుపెడితేనే జీవితం మెరుగవుతుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా తమ జీవితాలను కొత్తగాడిజైన్ చేసుకుంటున్నారు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ మహిళాఖైదీలు. అందుకోసం వారికి కొండంత ఆసరాను అందిస్తూ సృజనాత్మ ప్రపంచంలో జీవించే హక్కును కలిగిస్తున్నారు ఆ జైలు అధికారులు.
సెలీనా.. జానకి.. హసీనా
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలు అది. అక్కడ వేల సంఖ్యలో ఖైదీలు శిక్షలో భాగంగా జీవన నైపుణ్యాలలో శిక్షణ పొందుతుంటారు. ప్రత్యేకించి మహిళా ఖైదీలు కొందరు విడుదలై వచ్చాక ఖాదీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో నిలదొక్కుకుంటున్నారు. ‘‘మూడేళ్ల క్రితం నేను ఖైదీని. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సర్కిల్‌లో నేనూ ఒకరిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను’’ అంటుంది 22 ఏళ్ల సెలీనా. మరొక మాజీ ఖైదీ జానకి ఓ బొటిక్‌ని నిర్వహిస్తూ తన 24 ఏళ్ల కొడుకుతో కలిసి సమాజంలో గర్వంగా బతుకుతోంది. ‘మొదట చాలా నిరాశకు గురయ్యాను. నా తల రాతను నేనే తిట్టుకునేదాన్ని. కానీ, జీవితాన్ని తిట్టుకుంటూ కూర్చోనక్కర్లేదని జైలులో గ్రహించాను. జైల్లో నేర్చుకున్న విద్య నాకో కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అని చెబుతోంది జానకి. మూడేళ్ల పాటు జైలులో ఉన్న హసీనా తన కుటుంబంలోని వారందరితోనూ పూర్తి దూరంగా ఉంది. ఇప్పుడు పాత సంబంధాలను పునర్నిర్మించుకోవాలని ఆమె కోరుకోవడం లేదు. ‘‘నాకు అవసరమైనప్పుడు నా కుటుంబం నన్ను దూరంగా పెట్టింది. కనీసం నాతో మాట్లాడటానికే ఇష్టపడేది కాదు. ఇప్పుడు.. నేను వారి నుంచి చాలా దూరం వచ్చేశాను. కానీ, వారు నాతో మాట్లాడాలనుకుంటున్నారు’ అంటూ ఫ్యాషన్ రంగంలో తన కాళ్లపై తాను నిలబడిన తర్వాత మారిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.
బాలీవుడ్‌కు డ్రెస్ డిజైనింగ్!
హరీశ్‌వ్యాస్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న బాలీవుడ్ చిత్రం ‘మార్క్‌షీట్’ (కొత్తది) కోసం దుస్తులను రూపొందించిన కొంతమంది ఖైదీలలో వీరు ముఖ్యులుగా ఉన్నారు. ఈ చిత్ర తారాగణం కోసం మహిళా ఖైదీలు రూపొందించిన దుస్తులను ధరించి మోడల్స్ ఫ్యాషన్ షోలో వెలిగిపోయారు. ఈ ఫ్యాషన్ షోను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ జహీద్‌తో సహా ఇతర నటీనటులు సందర్శించారు. ‘‘సినిమా, క్రికెట్ రంగాలలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో వెంటనే ప్రజలకు తెలిసిపోతుంది. జైలులో ఉన్న వ్యక్తులు నేరాలకు పాల్పడినవారే కావచ్చు. కానీ, వారెప్పటికీ అలా నేరస్తులుగానే ఉండిపోనక్కర్లేదు. వారిలో కష్టపడాలనే తత్త్వం, నిజాయితీ కనిపిస్తోంది. కొన్నేళ్ల తర్వాత జైలు ఖైదీలు ఒక సినిమాకు క్యాస్టూమ్ రూపకర్తలుగా ఉన్నారని చరిత్రలో లిఖించబడుతుంది’’ అన్నారు వీరంతా! ఫ్యాషన్ డిజైనర్ వింకీ సింగ్ మాట్లాడుతూ ‘డిజైనింగ్ దుస్తులు అంటేనే వ్యాపారపరంగా చూస్తాం. కానీ, ఈ సినిమాలో డ్రెస్సులను చూస్తే ఒక విభిన్నమైన ఆలోచన కలుగుతుంది. నేను సినిమాలకు, సినిమా ప్రముఖులకు దుస్తులను డిజైన్ చేశాను. ఆ విధంగా మార్క్‌షీట్ కోసం పనిచేసే అవకాశం లభించింది. అయితే, అదే సినిమాకు జైలు ఖైదీలతో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేనిది. వారానికి మూడు సార్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ఖైదీలను కలిసేవాడిని. వారిలో పని నేర్చుకోవాలనే తపన, సృజన చాలా గొప్పది’’ అని అన్నారు. మరోవైపు తరుణ్ తహిలియాన్, రీతూకుమార్ వంటి ప్రముఖ డిజైనర్లతో కలిసి పని చేస్తూ సమాజంలో తామూ ఒక సృజనాత్మక రంగంతో కలిసి నడుస్తున్నారు ఈ మహిళా ఖైదీలు.
– ఎన్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment