ఉద్యోగులూ.. ఖాదీ దుస్తులనే ధరించండి
పాట్నా: తమను తాము మహాత్మా గాంధీ అనుచరులుగా పేర్కొన్న బీహార్ ప్రభుత్వ పెద్దలు.. ఉద్యోగులందరూ ఇకపై ఖాదీ (ఖద్దరు) దుస్తులనే ధరించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజని కుమార్ సింగ్ శుక్రవారం అన్ని శాఖల ఉద్యోగులకు లేఖలు రాశారు.
'ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తోంది. అందుకు ప్రతిగా మీరు కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పనులు చేయాల్సి ఉంటుంది. వారానికి కనీసం రెండు సార్లు ఖద్దరు దుస్తులు ధరించి కార్యాలయాలకు రావాలి. దీనివల్ల చేనేత రంగం బలపడటమే కాకుండా ఆర్థికంగా పరిపుష్టిని సాధించే వీలవుతుంది' అని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉద్యోగులు తు.చ. తప్పకుండా పాటించాలని, దీనివల్ల చేనేత రంగంలో మరింత మందికి ఉపాధి లభిస్తుందని, పైపెచ్చు ఖాదీ ధారణ పర్యావరణానికి కూడా మేలుచేస్తుందని బీహార్ పౌర సరఫరాల శాఖ మంత్రి షయమ్ రజాక్ అన్నారు.