జాతిపిత మహాత్మాగాంధీ అంటే స్వతంత్ర పోరాటం.. ఆపై ఠక్కున గుర్తుకు వచ్చేది ఆయన చేసిన స్వదేశీ ఉద్యమమే. గాంధీ మహాత్ముడు స్వయంగా చరఖా చేతపట్టి నూలువడికి.. చేనేత దుస్తులను ధరించేవారు. దాదాపు శతాబ్దం తరువాత.. మళ్లీ దేశంలో అప్రకటి స్వదేశీ ఉద్యమం మొదలైంది. చేనేత, ఖాదీ, ఖద్దర్ దుస్తులకు దేశంలో విపరీతమైన గిరాకీ ఏర్పడింది.
ముఖ్యంగా ఆధునిక యువత ఈ దుస్తులపై అధికంగా మోజు పెంచుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాషన్‌గా ఉండే ప్రతి వస్తువును.. హ్యాండ్‌మేడ్‌గా (చేతివృత్తులు) ఉండేలా యువత చూసుకుంటోంది. ఇదే చేనేత వృత్తులు అవలంబించేవారికి కొత్త ఉపాధిని అందిస్తోందని పలువురు ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. ఖాదీ దుస్తుల్లో చరఖా మీద నూలు వడికిన వాటికి ఉత్తర భారతీయ యువత అధిక ప్రధాన్యతను ఇస్తోందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
స్వతంత్రం వచ్చాక.. ఖాదీ పరిశ్రమ ఏళ్ల తరబడి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. పేదవాళ్లు మాత్రమే ఖాదీ దుస్తులు ధరిస్తారనే అపోహ కూడ ఒక కారణం. అయితే ఆధునిక కాలంలో ఖాధీ అత్యంత లగ్జరీ, విలాసవంతమైన దుస్తులుగా గుర్తింపు పొందడంతో మళ్లీ డిమాండ్ పెరిగిందని.. ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మన ఖాదీ దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని ముంబై డిజైనర్లు పేర్కొంటున్నారు.
ఆధునిక యువతలో దేశభక్తి అధికంగా పెరగడం, అదే సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం సామాజికంగా బలపడ్డంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఫ్యాషన్ డిజైన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సునీల్ సేథీ చెప్పారు. అందులోనూ ఖాదీలో రంగులు, విభిన్న మోడల్స్ అందుబాటులోకి రావడంతో.. వీటిని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అన్నారు.