సాక్షి, అమరావతి: సీటు బెల్టు పెట్టుకోకుండా హైవేపై దూసుకుపోయారా.. అయితే మీ ఇంటికి చలానా వచ్చేస్తుంది. పొల్యూషన్ సర్టిఫికెట్‌గానీ ఇతరత్రా అనుమతులుగానీ లేకుండా వాహనంలో ప్రయాణిస్తున్నారా.. జరిమానా తప్పదు.. మీ వాహనాన్ని ఎవరూ ఆపరు. తనిఖీ చేయరు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాల కొరడా ఝళిపిస్తారు. అదే అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎస్) పనితీరు.
దేశంలో అన్ని హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉద్యుక్తమైంది. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ‘అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఏటీఎస్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖల వద్ద ఉన్న వాహనాల డాటాబేస్‌తో అనుసంధానిస్తూ ఏటీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఏటీఎస్ వ్యవస్థను పరీక్షించిన ఎన్‌హెచ్‌ఏఐ దశలవారీగా అమలు చేయనుంది.
హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ తీరును పరిశీలించేందుకు టోల్‌గేట్లు, ఇతర ప్రధాన కూడళ్లు, మలుపుల వద్ద సీసీ కెమెరాలను, ఇతర ఆధునిక సాంకేతిక వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేస్తారు.
హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను ఈ వ్యవస్థ స్కాన్ చేస్తుంది. ఆ నంబర్ ఉన్న వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్, పిట్‌నెస్ సర్టిఫికెట్, అవసరమైన ఇతర సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అని ఆటోమేటిగ్గా పరిశీలిస్తుంది. సరుకు రవాణా వాహనాలను పర్మిట్లు ఉన్నాయా లేదా కూడా పరిశీలిస్తుంది. అవసరమైన సర్టిఫికెట్లు లేవని గుర్తిస్తే వెంటనే ఆ వాహన నంబర్‌ప్లేటు ఆధారంగా జరిమానా విధిస్తారు. సంబంధిత చిరునామాకు చలానా పంపిస్తారు.
ఇక ఎవరైనా సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే, సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానా విధించి సంబంధిత చిరునామాకు చలానా పంపిస్తారు.
ఆ జరిమానాలు విధించిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాల రవాణా శాఖ కార్యాలయాలకు ఎన్‌హెచ్‌ఏఐ నివేదిస్తుంది.
ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు ఆ జరిమానాలను వసూలు చేస్తారు.
హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా పటిష్టంగా పర్యవేక్షించడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఏటీఎస్ వ్యవస్థ ఏర్పాటు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment