లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి జిల్లాలో రైతు ఆందోళన కార్యక్రమం చివరకు హింసాత్మకంగా మారింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ అయిన అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు బన్బీర్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. మంత్రి అజయ్ మిశ్రా వెంట ఆయన కొడుకు ఆశిష్ సైతం కాన్వాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలిపేందుకు భారతీయ కిసాన్ యూనియన్‌కి చెందిన పలువురు రైతులు నల్ల జెండాలతో బయల్దేరారు. మార్గమధ్యంలో టికోనియా–బన్బీర్‌పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు ఇచ్చారు. అదే సమయంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అక్కడి రైతుల మీదుగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మంత్రి కుమారుడే వాహనాన్ని నడుపుతున్నాడని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు.
కార్లు తగులబెట్టిన రైతులు
ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న రైతులు ఆశిష్ వాహనంతో పాటు మూడు కార్లకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. రాళ్లు విసిరారు. పరిస్థితులు అదుపు తప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీసీ) ప్రశాంత్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. విషయం తెలిసిన వెంటనే రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ లఖిమ్‌పూర్ ఖేరికి వెళ్లారు.
అదంతా కుట్ర: అజయ్ మిశ్రా
నిరసనలు తెలుపుతున్న రైతుల మీదుగా తన కుమారుడు కారు నడిపించాడన్న ఆరోపణల్ని మంత్రి అజయ్ మిశ్రా తోసిపుచ్చారు. ‘ఈ ఘటన జరిగిన సమయంలో నా కుమారుడు అసలు ఇక్కడ లేడు. ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉంది. తమకు మద్దతు పలికేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. దీంతో వారి వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. వాహనం రైతులపై పడడంతో నలుగురు రైతులు మరణించారు. ఆగ్రహించిన రైతులు బీజేపీ కార్యకర్తలను చావబాదారు. దీంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఆ వాహన డ్రైవర్ చనిపోయారు’ అని మంత్రి వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. యూపీ సీఎం రాజీనామా చేయాలని ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్‌చేశారు. ‘ కొందరు రైతులపై కాల్పులు జరిగినట్లు మాకు సమాచారం అందింది. ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు’ అని తికాయత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల మరణాలకు కారకులైన మంత్రి, మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment