గువహతి : వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ సాగుతున్న ప్రచారాన్ని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తోసిపుచ్చారు. ‘నేను రాజకీయ నేతను కాదు..నాకు అలాంటి కోరిక లేద’ని రాజ్యసభ సభ్యులు గగోయ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది రాజ్యసభ సభ్యత్వాన్ని తాను ఆమోదించడం రాజకీయాల్లో లాంఛనంగా ప్రవేశించే దిశగా తీసుకున్న నిర్ణయం కాదని ఇండియాటుడేతో మాట్లాడుతూ పేర్కొన్నారు. రాజ్యసభకు తాను నామినేటెడ్ సభ్యుడనని, రాజకీయపార్టీకి చెందిన అభ్యర్థిగా తాను నామినేట్ కాలేదన్న విషయం ప్రజలు గుర్తెరగాలన్నారు.
తనకు ఆసక్తి ఉన్న అంశాలపై స్వతంత్రంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడిగా తాను ఉండాలనుకున్నానని, అలా ఉండటం తనను రాజకీయ నేతగా చేసిందా అని ఆయన ప్రశ్నించారు. కాగా వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో రంజన్ గగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థి కావచ్చని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గగోయ్ వ్యాఖ్యానించారు. రామమందిర తీర్పుపై సంతోషంతో ఉన్న బీజేపీ రంజన్ గగోయ్‌కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసిందని, ఆయన ఈ పదవిని ఆమోదించడం చూస్తుంటే ఆయన క్రియాశీలక రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారని తెలుస్తోందని తరుణ్ గగోయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు తరుణ్ గగోయ్ వ్యాఖ్యలను అస్సాం బీజేపీ విభాగం సైతం అర్ధరహితమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment