తమిళనాడు:తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర సీఎం మధ్య వివాదం.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాగులేని కారణంగా మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించే అంశాన్ని గవర్నర్ తోసిపుచ్చారు.
రాష్ట్రంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను ప్రస్తుతం మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్నారు. ఈ శాఖలను ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నెరసు, గృహ శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామికి కేటాయిస్తున్నట్లు పేర్కొని సీఎం స్టాలిన్.. గవర్నర్‌కు లేఖ పంపారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆర్.ఎన్. రవి.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ ప్రతిపాదన మనీలాండరింగ్ కేసును తప్పదారిపట్టించేదిగా ఉందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని అధికార డీఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గవర్నర్ పూర్తిగా బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్ముడి ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉందనే ఆరోపణలపై ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్ మే31 న సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారని పొన్ముడి ఆరోపించారు. కేవలం ఆరోపణలపై ఎలాంటి చర్య తీసుకోబోమని సీఎం స్టాలిన్ తిరిగి లేఖలో అప్పుడే సమాధానమిచ్చినట్లు చెప్పారు.
సెంథిల్ బాలీజీ కేసు..
‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ మంత్రి సెంథిల్ బాలాజీ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం.
ఇదీ చదవండి:తమిళ మంత్రి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment