జైపూర్: ప్రముఖ గుజ్జర్ నాయకుడు, గుజ్జర్ ఆరక్షన్ సంఘర్ష్ సమితి కన్వీనర్, కల్నల్ కిరోరి సింగ్ బైంస్లా(82) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. గుజ్జర్ల రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా కిరోరి సింగ్ గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
వికీపీడియా వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలోని ముండియా గ్రామంలో 1940, సెప్టెంబర్ 12న కిరోరి సింగ్ బైంస్లా జన్మించారు. మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత తండ్రి అడుగుజాడల్లో నడిచి.. భారత సైన్యంలో చేరారు. 1960 నుంచి 2000 వరకు ఆర్మీలో పనిచేశారు. 1962 ఇండో-చైనా యుద్ధం, 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పోరాడారు. రిటైర్ అయిన తర్వాత 14 ఏళ్ల పాటు గుజ్జర్ల రిజర్వేషన్ల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. కిరోరి సింగ్ భార్య రేషమ్ 1996లో చనిపోయారు.
కల్నర్ బైంస్లా ఫౌండేషన్ ద్వారా రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్య, ఆరోగ్యంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వివాహాల్లో ఆర్భాటపు ఖర్చులు అవసరం లేదని పదేపదే చెప్పేవారు. కిరోరి సింగ్ బైంస్లా తన కుమారుడితో కలిసి 2019లో బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment