ద్వైపాక్షిక ఒప్పందానికి కృషి | I am also waiting PM Modi on Trumps tweet | Sakshi
Sakshi News home page

ద్వైపాక్షిక ఒప్పందానికి కృషి

Sep 10 2025 8:12 AM | Updated on Sep 11 2025 6:04 AM

I am also waiting PM Modi on Trumps tweet

భారత్, అమెరికా ప్రజల కోసం ట్రంప్‌తో కలిసి పనిచేస్తా  

ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

న్యూఢిల్లీ:  భారత్, అమెరికాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇరుపక్షాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యపరమైన అవరోధాలను తొలగించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై మోదీ ప్రతిస్పందించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ట్రంప్‌ ప్రకటనను పరోక్షంగా స్వాగతించారు.
 

 భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. రెండు మిత్ర దేశాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి వాణిజ్య చర్చలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 

రెండు దేశాల పౌరులకు మేలు జరిగేలా, ఉజ్వల భవిష్యత్తు ఉండేలా తాము కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చిచెప్పారు. మోదీ–ట్రంప్‌ మధ్య సోషల్‌ మీడియాలో అనుసంధానం గత నాలుగో రోజుల్లో ఇది రెండోసారి కావడం విశేషం. భారత్‌–అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్‌ చెప్పగా, అందుకు మోదీ ఈ నెల 6న హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల బంధంపై ట్రంప్‌ అభిప్రాయాన్ని ప్రశంసించారు.  
 

భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత్‌పై ట్రంప్‌ సర్కార్‌ మండిపడుతోంది. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్‌ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధాలను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం త్వరలో ఇండియాకు రానుంది. అమెరికా నుంచి భారత నావికాదళం పీ–8ఐ లాంగ్‌ రేంజ్, మల్టిమిషన్‌ మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేస్తోంది. దీనిపై త్వరలో ఇరుపక్షాల మధ్య తుది చర్చలు జరుగనున్నాయి. 
 

ట్రంప్ పోస్ట్‌ను రీట్వీట్ చేసిన ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement