బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు అంత్యంత ఆశ్యర్యకర విషయాన్ని వెల్లడించారు. నిజానికి తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగే జంతువులని, బహుశా గతంలో మనుషులు.. తోడేలు పిల్లలకు చేసిన హానికి ప్రతీకారంగా అవి ఇలా దాడులకు దుగుతుండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బహ్రయిచ్‌లోని మహసీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలు గత మార్చి నుంచి తోడేళ్ల భీభత్సాన్ని ఎదుర్కొంటున్నారు. జూలై నెల నుండి ఇప్పటివరకూ ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా దాదాపు 36 మంది తోడేలు దాడులలో గాయపడ్డారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి, బహ్రయిచ్ కతర్నియాఘాట్ వన్యప్రాణుల విభాగం అటవీ అధికారి జ్ఞాన్ ప్రకాష్ సింగ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తోడేళ్ళు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉంటాయని, గతంలో వాటి పిల్లలను మనుషులు చంపేశారని అన్నారు. వాటికి ఏదో ఒక రకమైన హాని జరిగినందుకే అవి ప్రతీకారంగా దాడులకు దిగుతున్నాయని అన్నారు.
పదవీ విరమణ తర్వాత ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కు సలహాదారుగా పనిచేస్తున్న సింగ్ తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ 20-25 ఏళ్ల క్రితం జౌన్‌పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లోని సాయి నది ఒండ్రుమట్టిలో తోడేళ్ళు కనిపించేవి. ఈ నేపధ్యంలో కొందరు పిల్లలు తోడేళ్ల గుహలోకి ప్రవేశించి అక్కడున్న తోడేలు పిల్లలను చంపినట్లు ఆనాడు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఆ తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగాయి. వాటి దాడుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు.
బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ గ్రామాల్లో జరుగుతున్న తోడేలు దాడులకూ వాటి ప్రతీకారమే కారణం కావచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో బహ్రయిచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాయి. దీంతో తోడేళ్లు దాడికి దిగడం మొదలుపెట్టాయి. అప్పడు అటవీ అధికారులు దాడి చేసిన తోడేళ్లను పట్టుకుని 40-50 కిలోమీటర్ల దూరంలోని చకియా అడవిలో వదిలిపెట్టారు.
అయితే చకియా అడవి తోడేళ్లకు సహజ నివాసం కాదు. ఈ తోడేళ్లు చకియా నుండి ఘఘ్రా నది ఒడ్డున ఉన్న తమ గుహలోకి తిరిగి వచ్చి, ప్రతీకార దాడులకు పాల్పడూ ఉండవచ్చన్నారు. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “సింహాలు, చిరుతపులులు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉండవు. కానీ తోడేళ్లుకు ఆ స్వభావం ఉంటుంది. తోడేళ్లు వాటి పిల్లలకు మనుషుల నుంచి ఏదైనా హాని జరిగినా, అవి మనుషులను వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment