ఒకే దేశం– ఒకే పన్ను విధానం తర్వాత ఒకే దేశం–ఒకే ఎన్నిక దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేగంగా కదులుతున్నారు. ఇప్పుడు.. ఎవరూ ఊహించని విధంగా ఒకే దేశం – ఒకే పేరుపైనా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఇండియా దటీజ్ భారత్ అని రాజ్యాంగంలోని ఒకటవ అధికరణంలో పొందుపర్చారు. ఒక దేశానికి రెండురకాల పేర్లు పెట్టారు. అసలు దేశానికి రెండు పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది...దాని వెనుక జరిగిందేమిటి ?
ఇండియా దటీజ్ భారత్ అని మన రాజ్యాంగం చెపుతోంది. ఒకటో అధికరణం ప్రకారం దేశానికి రెండు పేర్లు పెట్టారు. ఇలా రెండు పేర్లు పెట్టడం వెనుక రాజ్యాంగ సభలో రెండురోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. మన దేశ చారిత్రక వారసత్వానికి అనుగుణంగా భారత్ అని పేరు పెట్టాలని రాజ్యాంగసభ సభ్యులు సేత్ గోవింద్‌దాస్, హరి విష్ణు కామత్ వాదించారు. అంతేకాదు ఇండియా అనే ఆంగ్లపదం ఆంగ్లేయుల పాలనను సూచిస్తుందన్నారు. మరోవైపు హరిగోవింద్‌పంత్ భారత్‌వర్షగా దేశం పెట్టాలని సూచించారు. మరికొందరు సభ్యులు చైనా యాత్రీకుడు హ్యుయాన్ త్సాంగ్ తన రచనల్లో దేశం పేరును భారత్ పేర్కొన్నారని ఉదహరించారు. ఇండియా పేరు వలసరాజ్యానికి, పాశ్చాత్యుల ఆధిపత్యానికి గుర్తుగా ఉంటుందని వాదించారు.
అయితే ఇండియా పేరు ఎలా చేర్చారు ?
చారిత్రకంగా చూస్తే ఇండస్ నది (సింధు నది)కి ఇవతల ఉండే భూభాగాన్ని విదేశీయులు ఇండియాగా పిలిచారు. కాలక్రమంలో అది కొనసాగుతూ వచ్చింది. నిజానికి ఆంగ్లేయుల పాలనా కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకువచ్చారు. మన రాజ్యాంగంలో చాలా అంశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే తీసుకున్నారు. ఆ తర్వాత 1947లో దేశ విభజన సమయంలో పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు భారత్ వైపు, ఇక్కడున్న ముస్లింలు పాకిస్తాన్‌వైపు వెళ్లే ప్రయత్నంలో భారీ ఊచకోత జరిగింది. వేలాదిమంది చనిపోయారు. మైనార్టీలలో తీవ్రమైన ఆందోళనలు చెలరేగాయి.
ఈ విభజన గాయాల నేపథ్యం రాజ్యాంగ సభ Constituent Assembly సభ్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారత్ అనే పేరు హిందుత్వాన్ని మాత్రమే సూచిస్తుందనే ఉద్దేశంతో, దేశంలోని ఉన్న భిన్న మతాలు, సంస్కృతుల నేపథ్యంలో ఇండియా పేరును కూడా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఇండియా పేరుపై నిర్వహించిన ఓటింగ్‌లోఅనుకూలంగా 51, వ్యతిరేకంగా 38 ఓట్లు వచ్చాయి. అటు భారత్, ఇండియా మధ్య సమన్వయం కోసం ఇండియా దటీజ్ భారత్ అని రెండు పేర్లను రాజ్యాంగంలోని మొదటి అధికరణంలో చేర్చారు.
అయితే ఈ అంశంపై రాజ్యాంగసభలో వాడీవేడీ చర్చ జరిగిన సమయంలో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, పేర్లపైనా ఘర్షణపూరిత చర్చ కంటే, చేయాల్సిన అసలు పని చాలా ఉందని దానిపైనే దృష్టి పెట్టాలని కోరి ఈ చర్చకు ముగింపు పలికారు.
ఇదీ చదవండి: భారత్ అనే పేరు ఎలా పుట్టిందంటే..
ఒకే దేశం–ఒకే పేరు
ఒకే దేశం – ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఒకే దేశం– ఒకే చట్టం (ఉమ్మడి పౌరస్మృతి) అనే పాలసీని అమలు చేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం త్వరలోనే ఒకే దేశం–ఒకే పేరు తో రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, దేశానికున్న రెండు పేర్లలో ఒకటి తొలగించి, భారత్‌ను శాశ్వతం చేయనున్నారు.
:::నాగిళ్ల వెంకటేష్, డిప్యూటీ ఇన్‌పుట్ ఎడిటర్, సాక్షిటీవీ
Comments
Please login to add a commentAdd a comment