సాక్షి, న్యూఢిల్లీ : దేశ సమగ్రత, భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 21వ వార్షికోత్సవాన్ని ఆదివారం దేశం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు కార్గిల్ హీరోలకు ఘనంగా నివాళులు అర్పించారు. 1999లో సరిగ్గా ఇదే రోజున కార్గిల్ -ద్రాస్ సెక్టార్‌లో పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైంది. కార్గిల్‌లో పాకిస్తాన్ దళాలను గుర్తించడంతో 1999 మే 3 నుంచి జులై 26 వరకూ కార్గిల్ యుద్ధం సాగింది. 1998లోనే పాకిస్తాన్ దళాలు దాడికి ప్రణాళికలు రూపొందించాయి. అంతకుముందు పాకిస్తాన్ సైన్యాధ్యక్షులు ఈ తరహా సూచనలు చేసినా దాడులు యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనతో ఆ ప్రతిపాదనలను పాకిస్తాన్ నేతలు తోసిపుచ్చారు. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైతం భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి నుంచి ఫోన్‌కాల్ వచ్చేవరకూ తనకు దాడి గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం.
కాగా, ఆపరేషన్ విజయ్ భారీ సక్సెస్‌కు ఒక రోజు ముందు ఏం జరిగిందనే విషయాలను వివరిస్తూ భారత సైన్యం శనివారం ట్వీట్ చేసింది. ‘ఆ రోజు భారత సైన్యం అత్యంత సాహసంతో ముస్కో లోయలో జులూ శిఖరంపై దాడికి పాల్పడింది..మన సేనలు సమరోత్సాహంతో అంకితభావంతో ముందుకు దూకి ప్రత్యర్ధుల ముట్టడిలో ఉన్న మన ప్రాంతాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నా’రని సోషల్ మీడియా వేదికగా సైన్యం పేర్కొంది. జాతి సమగ్రతను కాపాడేందుకు భారత సైనికులు చేసిన సమున్నత త్యాగానికి గుర్తుగా జులై 26ను అమరవీరులకు దేశం అంకితం చేసింది. 12,000 అడుగుల ఎత్తులో మన సైనికులు ద్రాస్, కక్సర్, బటాలిక్, తుర్తుక్ సెక్టార్లలో ప్రత్యర్ధి సేనలకు చుక్కలు చూపారు. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సేనల చెరలో ఉన్న మన భూభాగంపై భారత సైన్యం తిరిగి పట్టుబిగించడంతో ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతంగా ముగిసింది. చదవండి : డబ్బులు తీసుకుని పాత ఆయుధాలిచ్చారు
Comments
Please login to add a commentAdd a comment