కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడి
జోద్‌పూర్: మన దేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. సరిహద్దుల్లో సమగ్ర యాంటీ–డ్రోన్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. శత్రుదేశాల నుంచి డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాల ముప్పు పెరుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. అందుకే సరిహద్దుల్లో శత్రుదేశాల డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేయడానికి యాంటీ–డ్రోన్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించినట్లు స్పష్టంచేశారు.
సరిహద్దు భద్రతా దళాలు, రక్షణ శాఖ, పరిశోధన సంస్థలు, డీఆర్‌డీఓ భాగస్వామ్యంతో దీన్ని తీసుకురాబోతున్నట్లు వివరించారు. రాజస్తాన్‌లో ఆదివారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) 60వ రైజింగ్ డేలో అమిత్ షా పాల్గొన్నారు. బీఎస్‌ఎఫ్ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. లేజర్‌తో పనిచేసే యాంటీ–డ్రోన్ గన్ మౌంటెడ్ వ్యవస్థను ఇప్పటికే ప్రవేశపెట్టామని, దీంతో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పంజాబ్‌లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2023లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యం 110 డ్రోన్లను కూలి్చవేసింది, కొన్నింటిని స్వాధీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment