20 లక్షల కస్టమర్లకు చేరువయ్యాం..
కల్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణరామన్
వీరిలో 90 శాతం మంది పాతవారే
- మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నాం
- 2015-16లో రూ.13,000 కోట్ల టర్నోవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కేరళలోని త్రిస్సూర్‌లో 23 ఏళ్ల క్రితం ఒక స్టోర్‌తో ప్రారంభమైన కల్యాణ్ జువెల్లర్స్ ప్రస్థానం ఇప్పుడు దేశ సరిహద్దులను చెరిపేసింది. విదేశీ కస్టమర్లకూ పుత్తడి వెలుగులను విజయవంతంగా పంచుతోంది. ఈ వెలుగులు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ను సైతం ఆకట్టుకునేలా చేశాయి. వార్బర్గ్ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెట్టిందంటే సంస్థ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 20 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకుందీ ఆభరణాల సంస్థ. ఇదే ఊపుతో ఇతర రాష్ట్రాలతోపాటు మరిన్ని దేశాల్లో అడుగు పెట్టబోతున్నామని అంటున్నారు కల్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణరామన్. సంస్థ భవిష్యత్ ప్రణాళిక, చేపట్టిన కార్యక్రమాలు, పరిశ్రమ తీరుతెన్నులను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కల్యాణ్ జువెల్లర్స్ గురించి వివరిస్తారా?
భారత్‌లో 72 స్టోర్లను నిర్వహిస్తున్నాం. యూఏఈలో 10, కువైట్‌లో 3 ఔట్లెట్లు ఉన్నాయి. బంగారు ఆభరణాలకు బీఐఎస్ ధ్రువీకరణ పరిచయం చేసింది తొలుత మేమే. పారదర్శకత కోసం ఆభరణం పూర్తి వివరాలతో ప్రైస్ ట్యాగ్‌ను తీసుకొచ్చాం. ధ్రువీకరణ కలిగిన వజ్రాలను అందుబాటు ధరలో విక్రయిస్తున్నాం. క్యాష్ బ్యాక్, బై బ్యాక్ ఆఫర్లనూ నిర్వహిస్తున్నాం. మహిళలు అత్యధిక కస్టమర్లుగా ఉన్న ఆభరణాల రంగంలో పురుషులను ప్రచారకర్తలుగా నియమించాం. 20 లక్షల మంది కస్టమర్లకు చేరువయ్యాం. వీరిలో 90 శాతం మంది పాత కస్టమర్లే కావడం విశేషం. కల్యాణ్ పారదర్శక వ్యాపారానికి ఇది నిదర్శనం.
కొత్తగా ఏఏ దేశాలకు విస్తరిస్తున్నారు?
ఆభరణాల తయారీ, పంపిణీ రంగంలో భారత్‌లో అగ్రశ్రేణి సంస్థగా నిలిచాం. మార్చికల్లా మరో 15 స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో స్టోర్ల సంఖ్య 100 కానుంది. ఖతార్‌లో అడుగు పెట్టనున్నాం. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లో ప్రవేశించనున్నాం. వచ్చే ఏడాది సింగపూర్, మలేషియాల్లో దుకాణాలను తెరుస్తాం. విస్తరణకుగాను 2015-16లో రూ.800 కోట్లు వ్యయం చేస్తాం. ఇ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించే ఆలోచన ఉంది.
మై కల్యాణ్ స్టోర్ల విస్తరణ ఏమైనా ఉందా?
కస్టమర్ సర్వీస్ ఔట్లెట్లను తొలిసారిగా ప్రారంభించిన ఘనత మాదే. మై కల్యాణ్ పేరుతో 600 కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఆభరణాల కొనుగోలు, పథకాలు, బీమా, వేడుకలకు ముందస్తు కొనుగోలు ప్రణాళిక, గిఫ్ట్ వోచర్లు, ఆభరణాల కొనుగోలు చిట్కాలను ఇక్కడ కస్టమర్లకు వివరిస్తాం. ఈ కేంద్రాలను మినీ డైమండ్ స్టోర్లుగా మార్చనున్నాం. రూ.5-25 వేల ధరలో లభించే వజ్రాభరణాలను విక్రయిస్తాం. ఈ విభాగంలో దేశంలో అపార అవకాశాలు ఉన్నాయి. మై కల్యాణ్ స్టోర్ల ద్వారా మార్చికల్లా రూ.100 కోట్ల వ్యాపారం ఆశిస్తున్నాం.
ఆభరణాల విక్రయాలు తగ్గాయి కదా.. మీరేమంటారు?
తొలి త్రైమాసికంలో అమ్మకాలు అంతగా సాగలేదు. అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని రెండవ త్రైమాసికం గణాంకాలనుబట్టి అవగతమైంది. వివాహాలు, పండుగల సీజన్ మరింత కలసి రానుంది. సంస్థ వృద్ధిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే రెండేళ్లుగా పెద్ద ఎత్తున విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. దీర్ఘకాలిక వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నాం. బంగారు ఆభరణాల పట్ల వినియోగదార్లలో ఉత్సాహం ఎన్నటికీ తరగదని మా విశ్వాసం. తరతరాలుగా ప్రీతిపాత్రమైన పుత్తడిపై ముఖ్యంగా భారతీయులకు మక్కువ ఎక్కువే.
పుత్తడి ధర మరింత తగ్గే అవకాశం ఉందా?
పసిడి ధర హేతుబద్ధ స్థాయి వద్ద క్రమంగా స్థిరపడుతోంది. పుత్తడి కొనుగోలుకు ఇదే సరైన సమయం. ప్రస్తుత ధర వద్ద బంగారం కొనుగోలు చేయడం ద్వారా అధిక విలువను పొందవచ్చు. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం ఆశిస్తున్నారు?
2014-15లో కల్యాణ్ జువెల్లర్స్ సుమారు రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధితో రూ.13,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లు అధిక వృద్ధికి ఆస్కారం ఉన్నవి. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఆదాయం ప్రముఖంగానే సమకూరుతోంది.