చైనా దూకుడుకు చెక్‌ పెట్టేలా భారత్‌ భారీ ప్లాన్‌..  | India Plans International Transhipment Port At Galathea Bay | Sakshi
Sakshi News home page

చైనా దూకుడుకు చెక్‌ పెట్టేలా భారత్‌ భారీ ప్లాన్‌.. 

Published Sat, Feb 4 2023 7:45 AM | Last Updated on Sat, Feb 4 2023 10:44 AM

India Plans International Transhipment Port At Galathea Bay - Sakshi

సాక్షి, అమరావతి: సువిశాల జలసాగరం మన దేశ వ్యూహా­త్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్‌ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టులపై ఆధారపడుతున్న అనివార్యతకు ఇది ముగింపు పలకనుంది. 

దేశ భద్రత ప్రయోజనాలకు కీలక స్థావరంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా నికోబార్‌ దీవుల్లోని ‘గలాటియా బే’ వద్ద అంతర్జాతీయ ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టును నిర్మించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర మార్గానికి సమీపంలో నిర్మించనున్న ఈ పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలకం కానుంది. అందుకు సన్నాహకంగా 2020లోనే కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్, నికోబార్‌ రాజధాని పోర్టు బ్లెయిర్‌కు చెన్నై నుంచి సముద్రగర్భంలో 2,312 కి.మీ. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టు నిర్మాణానికి రూ.41వేల కోట్లతో టెండర్ల ప్రక్రియ చేపట్టింది.

ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టు లేక ఆర్థిక భారం
అతి పొడవైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ భారత్‌కు అంతర్జాతీయ ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టు లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. తూర్పు తీరం, పశ్చిమ తీరంలోని పోర్టుల్లో బెర్త్‌ల వద్ద గరిష్ట లోతు 8 మీటర్ల నుంచి 12 మీటర్లే ఉంది. దీంతో గరిష్టంగా 75 వేల టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన కంటైనర్‌ నౌకలే ఈ పోర్టులకు వస్తున్నాయి. అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ వ్యాపార ప్రమాణాల మేరకు 1.65 లక్షల టన్నుల నుంచి 1.80 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న కంటైనర్‌ నౌకల్లో సరుకు రవాణా జరుగుతోంది. అంత పెద్ద కంటైనర్లతో కూడిన నౌకలు రావాలంటే పోర్టుల్లోని బెర్త్‌ల వద్ద లోతు 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఉండాలి. 

అటువంటి పోర్టు లేకపోవడంతో వివిధ దేశాల నుంచి వస్తున్న భారీ షిప్‌లను భారత్‌కు సమీపంలో ఉన్న సింగపూర్, కొలంబో, క్లంగ్‌ (మలేషియా), దుబాయిలోని అంతర్జాతీయ షిప్‌మెంట్‌ పోర్టులకు తరలించి అక్కడ 75వేల టన్నుల కార్గో సామర్థ్యం ఉన్న కంటైనర్లలోకి మార్చి భారత్‌లోని పోర్టులకు రప్పించాల్సి వస్తోంది. భారత్‌ నుంచి 75 వేల టన్నులకు మించిన కార్గో రవాణా చేయాలంటే తొలుత చిన్న కంటైనర్లలో సమీప దేశాల్లోని అంతర్జా­తీయ ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టులకు తరలించి అక్కడ నుంచి భారీ కంటైనర్‌ ద్వారా గమ్యస్థా­నా­లకు చేర్చాల్సి వస్తోంది. అందుకోసం హ్యాండ్లింగ్‌ చార్జీల కింద ఒక్కో కంటైనర్‌ యూనిట్‌ కోసం 250 అమెరికన్‌ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. భారత్‌ మొత్తం కార్గో రవాణాలో 25 శాతం నాలుగు విదేశీ ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. అందులో 40 శాతం కొలంబో పోర్టు ద్వారానే సాగుతుండటం గమనార్హం. దీంతో భారత్‌ ఏటా రూ.5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. 

చైనా గుప్పిట్లో కొలంబో పోర్టు
కొలంబో పోర్టుపై చైనా ఆధిపత్యం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. శ్రీలంక ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా చేసుకుని చైనా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చింది. కొలంబో పోర్టు పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. 
అందుకు ప్రతిగా కొలంబో పోర్టుపై చైనా నియంత్రణను అంగీకరించింది. ఒత్తిడికి లొంగి 
చైనా యుద్ధ నౌకలు కొలంబో పోర్టులో లంగరు వేసేందుకు శ్రీలంక సమ్మతించింది. దీనిపై భారత్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొలంబో పోర్టుపై ఆధారపడటం భారత్‌ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా సరైంది కాదని రక్షణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు.

వ్యూహాత్మకంగా కీలకం.. గలాటియా బే
- వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణతోపాటు అంతర్జాతీయ నౌకా రవా­ణా­లో కీలక వాటా కోసం నికోబార్‌లో ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టు నిర్మించాలని భారత్‌ నిర్ణయించింది. అందుకే అటు హిందూ మహాసముద్రం ఇటు పసిఫిక్‌ మహాసముద్రానికి సమీపంలో బంగాళాఖాతంలో ఉన్న నికోబార్‌ దీవిలోని ‘గలాటియా బే’ వ్యూహాత్మక ప్రదేశంగా ఎంపిక చేసింది.

- గలాటియా బే ఉంది అంటే గంటకంటే తక్కువ సమయంలో ఆ పోర్టుకు చేరుకోవచ్చు. దీంతో సింగపూర్, కొలంబో, క్లంగ్‌ పోర్టుల కంటే నికోబార్‌ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఎక్కువగా ఆకర్షించే అవకాశాలున్నాయి.  

- గలాటియా బే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మలక్కా జలసంధి ముఖద్వారానికి సమీపంలో ఉంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహా సముద్రాలను అనుసంధానించే మలక్కా జల సంధి ద్వారా ఏటా లక్ష నౌకలు రాకపోకలు సాగిస్తాయి. ప్రపంచంలో మొత్తం జల రవాణాలో 25 శాతం ఈ  జలసంధి ద్వారానే సాగుతుంది. 

- ఆస్ట్రేలియా, జపాన్, కొరియా సముద్ర మార్గంలో గలాటియా బే నోడల్‌ కేంద్రంగా ఉండటంతో ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టుకు అనువైందని   కేంద్ర ప్రభుత్వ జియోటెక్నికల్‌ నివేదిక–2016 పేర్కొంది.

- అంతర్జాతీయ కార్గో రవాణాలో అగ్రస్థానంలో ఉన్న సింగపూర్, దుబాయి ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టులకు దీటు­గా నికోబార్‌లో నిర్మించే పోర్టు అభివృద్ధి చెందుతుంది. 

- బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో భారత్‌ రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకంగా నిలుస్తుంది. 

- అక్కడ నిర్మించే పోర్టు బెర్త్‌ల వద్ద 18 మీటర్ల నుంచి 20 మీటర్ల లోతు ఉండేలా నిర్మించేందుకు అవకాశం ఉంది. ఆ దీవి వద్ద సముద్ర అడుగు భాగం పూర్తిగా గట్టి రాయితో ఉంది. దీంతో పెద్దగా డ్రెడ్జింగ్‌ (ఇసుక మేటలు తీయడం) చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా నిర్వహణ వ్యయం తగ్గుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement