177 ఏళ్ల క్రితం పుట్టిన దూద్‌పేడా
నేడు విదేశాలకు సైతం ఎగుమతి
బనశంకరి: చాలామంది ఇష్టంగా తినే మిఠాయిల్లో ధారవాడ దూద్ పేడా ఒకటి. ఎంతో రుచిగా, తియ్యగా బాగుంటుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయి మృదువుగా ఎంతో రుచికరంగా ఉంటుంది. పండుగల సమయాల్లో ఇంట్లో దూద్‌పేడా చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. కర్ణాటకలోని ధారవాడలో చిన్నగల్లీ నుంచి ప్రారంభమైన దూద్‌పేడా ప్రయాణం నేడు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. పాలతో తయారుచేసే పదార్థాలపైకి అధికకాలం వినియోగంలోకి రావడంతో ధారవాడ దూద్‌పేడా జీఐ ట్యాగ్ పొందింది.
బయటి వాతావరణంలో ఐదారు రోజులు పాటు దూద్‌పేడా చెడిపోకుండా రుచికరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో 19వ శతాబ్దం ప్రారంభంలో ప్లేగ్ మహమ్మారి అనంతరం ధారవాడకు వలస వచ్చిన ఠాకూర్ కుటుంబం దూద్‌పేడాను తయారు చేసి వ్యాపారం ప్రారంభించారు. మిఠాయి వ్యాపారి రామ్‌రతన్‌సింగ్ ఠాకూర్ స్థానికంగా దూద్‌పేడా తయారు చేసి విక్రయించేవారు. అనంతరం ఇదే కుటుంబం ఈ వ్యాపారం విస్తరించారు. రామ్‌రతన్‌సింగ్‌ఠాకూర్ మనవడు బాబుసింగ్‌ఠాకూర్ ధారవాడ లైన్‌బజార్ దుకాణంలో దూద్‌పేడా వ్యాపారం మరింత విస్తరించగా నేడు ఇదే కుటుంబం 6వ తరం కొనసాగిస్తోంది. ధారవాడలో 177 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చిన తీపి వంటకం నేడు పెద్ద పరిశ్రమగా మారిపోయింది. ఇన్నేళ్లు గడిచినప్పటికీ ధారవాడ దూద్‌పేడా నాణ్యత, రుచిలో ఎలాంటి మార్పు రాలేదు ఏడాది నుంచి ఏడాదికి దూద్‌పేడా డిమాండ్ హెచ్చుమీరగా మార్కెట్ కూడా విస్తరించింది.
బ్రిటిష్ వారి నుంచి గౌరవం
ధారవాడ పారిశ్రామికవాడ ప్రదేశంలో దూద్‌పేడా ప్రదర్శనలో పాల్గొనడానికి (1913 నవంబరు 17) అప్పటి బాంబే గవర్నర్ హెచ్‌ఇ.లార్డ్స్‌విల్లింగ్టన్, బాబుసింగ్‌ఠాకూర్‌కు వెండిపతకం సరి్టఫికెట్ అందించి గౌరవించారు. అంతేగాక ధారవాడ దూద్‌పేడా కు రాజీవ్‌గాందీ శ్రేష్ట పురస్కారం, ప్రియదర్శిని ఇందిరాగాంధీ పురస్కారాలు అందుకున్నారు.
దూద్‌పేడా ప్రత్యేకతలు..
తీపి తిండి రంగంలో ధారవాడ దూద్‌పేడా గత ఏడాది 2023లో దసరా, దీపావళి పండుగ సమయంలో రికార్డుస్థాయిలో 25 వేల కిలోలు విక్రయం కాగా 2022లో 20 టన్నులు విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ప్రతిరోజు సరాసరి 9–10 వేల కిలోల ధారవాడ పేడా రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. ధారవాడ–హుబ్లీ మాత్రమే కాకుండా బెంగళూరు, బెళగావిలో దూద్‌పేడా పెద్దపెద్ద దుకాణాలు ఏర్పాటుకాగా ప్రాంచైసీ దుకాణాల సంఖ్య 1000కి పైగా ఉండటం విశేషం. హైదరాబాద్ కోల్‌కత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నైతో పాటు ప్రముఖ 150 నగరాల్లో ధారవాడ దూద్‌పేడా విక్రయిస్తున్నారు. ప్రముఖ రైల్వే, బస్‌స్టేషన్లలో కూడా దూద్‌పేడా అందుబాటులోకి వచ్చింది.
రుచిలో సరిసాటి
నాణ్యత రుచిలో ధారవాడ దూద్‌పేడాకు సరిసాటి ఏదీలేదు. దూద్‌పేడాను స్వచ్ఛమైన నెయ్యి, కోవా, చక్కెరతో తయారు చేస్తారు. ధారవాడ స్థానిక ప్రదేశాలనుంచి సేకరించిన పాలను వినియోగించి కోవా తయారు చేస్తారు. ముందుగా ఒక లీటరు పాలు తీసుకుని వాటిని 50 ఎంఎల్ అయ్యేవరకు మరిగించాలి. అలా మరిగించిన పాలల్లో చక్కెర వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో ప్లెయిన్ కోవా, ఇలాచి పొడివేసి మరోసారి బాగా కలుపుకుని దగ్గరగా ముద్దలా అయ్యేలా చేసుకోవాలి. అనంతరం పేస్ట్‌ను నెయ్యిరాసిన ప్లేట్‌మీద పరుచుకుని కాస్త చల్లారిన తరువాత గుండ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే కమ్మని దూద్‌పేడా తయారవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment