
న్యూఢిల్లీ: ‘చంద్రయాన్ 2’ ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న టెకీ షణ్ముగ సుబ్రమణియన్ వాదిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలను ఆయన చూపిస్తున్నారు. ఆయన వాదన ప్రకారం.. ల్యాండర్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది.
ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది. గతంలో మూన్‌ల్యాండర్ ‘విక్రమ్’ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. తాజాగా, ప్రజ్ఞాన్ క్షేమంగా ఉందని పేర్కొంటూ, పలు ఫొటో ఆధారాలతో సుబ్రమణియన్ పలు ట్వీట్లు చేశారు. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు.
‘చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. నాసా విడుదల చేసిన ఒక ఫొటోను వివరిస్తూ.. ల్యాండర్, రోవర్ ఉన్న ప్రదేశాలను ఆయన అంచనా వేశారు. రోవర్ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేనన్నారు. గత సెప్టెంబర్‌లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment