techi
-
వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం
రవి కుమార్, సునంద యువ దంపతులు. లాక్డౌన్ నేపథ్యంలో సొంతూరు వెళ్లిపోయారు. రసాయన రహితంగా పండించిన ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందన్న స్పృహతో రసాయనాల్లేని వ్యవసాయం ప్రారంభించారు. రవి ఆన్లైన్లో ఉద్యోగం చేస్తూనే 8 ఎకరాల నల్లరేగడి భూమిలో భార్య తోడ్పాటుతో ఆఫ్‌లైన్‌లో వర్షాధార సేద్యం చేస్తున్నారు. పూర్తిగా సీవీఆర్ పద్ధతిలో మట్టి సేద్యంతో తొలి ఏడాదే మంచి దిగుబడులు తీసి భళా అనిపించుకుంటున్నారు ఈ ఆదర్శ యువ రైతులు. మాదాని రవి, సునంద ఎమ్మెస్సీ చదువుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ అతను ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే, ఆమె ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండే వాళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. రవి స్వగ్రామం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని విజయనగరం. 40 ఎకరాల భూమి కలిగిన అతని తల్లిదండ్రులు వరి, పత్తి తదితర పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. బాల్యం నుంచీ రవికి వ్యవసాయం అంటే మక్కువ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రవి, సునంద ప్రకృతి వ్యవసాయ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రసంగాలు విని, పుస్తకాలు, పత్రికలు చదివి, రైతుల విజయగాధల వీడియోలు చూసి స్ఫూర్తి పొందారు. వారాంతాల్లో వీలైనప్పుడల్లా స్వయంగా కొన్ని క్షేత్రాలకు వెళ్లి చూసి, వివరాలు తెలుసుకొని వచ్చేవారు. ఇంట్లో ఎవరో ఒకరికి నెలకోసారైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. మార్కెట్లో దొరికే వంటనూనెలు వాడటం ఆపేసి గానుగ నూనె వాడటం మొదలు పెట్టిన తర్వాత క్రమంగా ఆస్పత్తికి వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందని.. ఆ తర్వాత బియ్యం, పప్పులు కూడా మార్చుకున్నామని సునంద చెప్పారు. ఆ విధంగా రసాయనాల్లేని ఆహారంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని గుర్తించిన తర్వాత.. నగర పరిసరాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా వారాంతాల్లో మనమే ఎందుకు పంటలు పండించుకోకూడని ఆలోచించారు. ఆ ప్రయత్నాలు సాగుతుండగా కరోనా వచ్చిపడింది. నవారతో ప్రారంభం లాక్డౌన్ కారణంగా వర్క్‌ఫ్రం హోం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో వీరి కుటుంబం సొంత గ్రామానికి మకాం మార్చింది. తొలుత గత ఏడాది ఫిబ్రవరిలో 3–4 సెంట్ల భూమిలో నవార విత్తారు. ‘మా అత్త మామల ద్వారా దుక్కి చేయటం, గొర్రుతో విత్తనం వేయటం వంటి ప్రతి పనినీ కొత్తగా నేర్చుకున్నాం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడటం అక్కడి రైతులందరికీ బాగా అలవాటు. అవి లేకుండా పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించేవారు. అయినా వెనక్కి తగ్గ లేదు’ అన్నారు సునంద. మొదట వ్యవసాయం చాలా కష్టంగా అనిపించినా పట్టు వదలకుండా ముందుకు సాగారు. మొదట ఆకు కూరలు, కూరగాయలు సాగు చేశారు. వేసవిలో పెరట్లో గోంగూర మొక్కలకు పిండి నల్లి సోకినప్పుడు మట్టి ద్రావణం ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది. దాంతో వ్యవసాయం అంతా పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) చెప్పిన విధంగా కేవలం మట్టి ద్రావణం పద్ధతిలోనే సాగు చేసి మంచి దిగుబడులు తీయొచ్చన్న నమ్మకం కుదిరింది. అదే పద్ధతి అనుసరిస్తున్నాం అని సునంద వివరించారు. పంట ఏదైనా కేవలం మట్టి ద్రావణమే ఈ ఏడాది వానాకాలంలో 8 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా వరి, సోయాబీన్, కంది, సజ్జ, కొర్రలు, రాగి తదితర పంటలు ఎడ్ల గొర్రుతో విత్తారు. పంటలు ఏవైనా మట్టి ద్రావణమే ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేస్తుండటం విశేషం. 200 లీటర్ల నీటిలో 30 లోపలి మట్టి (భూమిలో 2 అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టి), అర లీటరు అముదంను కలిపి ఈ ద్రావణాన్ని అన్ని పంటలకు 10 రోజులకోసారి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. పంట పూత/పిందె దశలో 3 పిచికారీలకు మాత్రం ఈ ద్రావణానికి రాక్ డస్ట్ 5 కిలోలు కలిపి పిచికారీలు చేయాలి. దీనితో పాటు.. 30 కిలోల లోపలి మట్టికి అర లీటరు ఆముదం కలిపి.. ఆ మట్టి మిశ్రమాన్ని పంట మొక్కల కింద 20 రోజులకు ఒకసారి ఎరువుగా వేయాలి. ఈ మట్టి మిశ్రమం వేసిన తర్వాత వారం వరకు జీవామృతం వంటి ద్రావణాలు వేయకూడదు. ఇంతే. పంటలన్నిటికీ ఇవే ఇస్తున్నామని సునంద, రవి వివరించారు. సోయా.. ఎకరానికి 11 క్విం. సునంద, రవి వానాకాలంలో 3 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా సోయా విత్తారు. సాళ్ల మధ్య 1.5 అడుగులు పెట్టారు. కలుపు మందు చల్లకుండా నాగళ్లతో 2 సాళ్లు పైపాటు చేయించారు, ఓసారి కూలీలతో కలుపు తీయించారు. సీవీఆర్ మట్టి ద్రావణం మాత్రం పిచికారీ చేశారు. పూత, పిందె దశలో మినుము, పెసర, నవార వడ్లు, బొబ్బర్లను ఒక్కో రకం ఒక్కోసారి మొలకల ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేశామని సునంద వివరించారు. ఇంకేమీ వెయ్యలేదు. అయినా, సగటున ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. వత్తుగా విత్తుకొని రసాయనిక సేద్యం చేసిన వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం సాగులో పూర్వానుభవం లేని తమకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సునంద, రవి ఆనందిస్తున్నారు. 2 ఎకరాల్లో కంది విత్తారు. అంతర పంటలు వేశారు. 5 క్వింటాళ్ల కొర్రలు, 2 క్లింటాళ్ల సజ్జలు (సగానికిపైగా చిలకలు తినగా మిగిలినవి), 5 క్వింటాళ్ల కొర్రల దిగుబడి వచ్చింది. ఇవి కోసిన తర్వాత కుసుమ విత్తారు. 3 ఎకరాల్లో అధిక పోషకాలతో కూడిన ఇంద్రాణి, కుజూపటాలియా, కాలాబట్టి, నవార, మాపిళ్ళె సాంబ వంటి దేశీ వరి రకాలను సాగు చేసి 30 క్వింటాళ్ల దిగుబడి పొందటం విశేషం. ధైర్యంగా మట్టి ద్రావణంతో సేద్యం చేపట్టి నలుగురూ ఇదేమి సేద్యం అని తప్పుపడుతున్నా ముందుకు సాగి.. చివరకు గ్రామస్తులతో ఔరా అనిపించుకున్నారు రవి, సునంద వ్యవసాయంలోకి రాదలచిన యువతకు మార్గదర్శకులు. – కమ్రె నరేష్, సాక్షి, కౌటాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా ఉంది నేను ఇంటి వద్ద నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సునంద ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటి పనులతో పాటు వ్యవసాయం చూసుకుంటున్నది. నేను విధుల్లో ఉన్న సమయంలో నా భార్య సునంద పొలం పనులు చూసుకుంటుంది. ఇద్దరం కలిసి ఇష్టపూర్వకంగా సహజ వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఫలితాలను చూసి మాకెంతో ఆనందంగా ఉంది. సహజ పద్ధతిలో పండించిన పంటతో మంచి ఆరోగ్యం చేకూరుతుంది. యువ రైతులందరూ సహజ పద్ధతిలో పంటల సాగు చేపట్టాలి. అప్పుడే భూమి సారవంతం కావడంతో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. – మాదాని రవి, యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి చాలు! వ్యవసాయం చేయడానికి శ్రద్ధతో పాటు చాలా ఒపిక ఉండాలి. అటు ఉద్యోగం.. ఇటు పిల్లల్ని చూసుకుంటూ సహజ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నాం. ఏసీలో ఉండే మీరు ఎందుకు వ్యసాయం చేస్తున్నారు? మందులు (రసాయనిక ఎరువులు, పురుగుమందులు) వాడకుండా పంటలు ఎలా పండుతాయని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ, ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నాం. పంట దిగుబడిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి ఒక్కటి అనుసరిస్తే చాలని మా అనుభవంలో శాస్త్రీయంగా నేర్చుకున్నాం. సంతృప్తిగా ఉంది. NSU Nandanam natural farms యూట్యూబ్ ఛానల్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. – సునంద (77995 44705), యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా -
ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు
సాక్షి, వాల్మీకిపురం (చిత్తూరు జిల్లా): తిరుమలకు వెళ్తున్న ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒకరు అక్కడికక్కడే మరణించారు. శనివారం ఉదయం ఈ సంఘటన వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మదనపల్లె రూరల్ మండలం అడ్డగింటివారిపల్లెకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి (25), గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ప్రియాంక (24), వైష్ణవి (24), అనూష (24), విజయవాడ వద్ద కొడాలికి చెందిన రమ్య (23), తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శ్వేత (25) బెంగళూరులోని ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను చూద్దామని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలను సందర్శించడానికి శనివారం ఉదయం వీరంతా ఏపి 09 బిపి 1246 నంబరు గల ఇన్నోవా కారులో బయలుదేరారు. టిఎం వ్యాలీ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే యత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రియాంక అక్కడికక్కడే మరణించింది. వైష్ణవి, అనూష, రమ్యకు తీవ్రగాయాలయ్యాయి. శ్వేత, కారు నడుపుతున్న కిరణ్‌కు స్వల్పగాయాలయ్యాయి. బెంగళూరుకు తరలింపు.. ఆ దారిన వెళ్తున్నవారు బాధితులను కారు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌ను పిలిపించారు. శ్వేతను మినహా మిగతావారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వాహనంలో బెంగళూరుకు తరలించినట్లు తెలియవచ్చింది. ప్రియాంక మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆమె కుటుంబ సభ్యులు మదనపల్లెకు చేరుకున్నారు. -
‘చంద్రయాన్’ రోవర్ క్షేమం!
న్యూఢిల్లీ: ‘చంద్రయాన్ 2’ ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న టెకీ షణ్ముగ సుబ్రమణియన్ వాదిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలను ఆయన చూపిస్తున్నారు. ఆయన వాదన ప్రకారం.. ల్యాండర్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది. ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది. గతంలో మూన్‌ల్యాండర్ ‘విక్రమ్’ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. తాజాగా, ప్రజ్ఞాన్ క్షేమంగా ఉందని పేర్కొంటూ, పలు ఫొటో ఆధారాలతో సుబ్రమణియన్ పలు ట్వీట్లు చేశారు. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. ‘చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. నాసా విడుదల చేసిన ఒక ఫొటోను వివరిస్తూ.. ల్యాండర్, రోవర్ ఉన్న ప్రదేశాలను ఆయన అంచనా వేశారు. రోవర్ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేనన్నారు. గత సెప్టెంబర్‌లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. -
‘టీ’ కోసం 15 లక్షల వేతనాన్ని వదులుకున్నారు..!
కష్టపడి పనిచేయడం కంటే ఇష్టపడి పనిచేయడంలోనే తృప్తి ఉందని.. సంపాదన కన్నా ఆత్మసంతృప్తి పొందడంలోనే ఆనందం ఉందంటున్నారు మాజీ టెక్కీ దంపతులు. నాగ్‌పూర్‌కు చెందిన నితిన్ బయానీ, పూజ భార్యాభర్తలు. పూణెలోని ప్రఖ్యాత కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఇద్దరూ కలిసి నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించేవారు. ఎంత సంపాదించినా ఆ ఉద్యోగం వారికి తృప్తినివ్వలేదు. జీవితంలో ఏదో కొత్తదనం ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ ఉద్యోగాలు మానేశారు. తమకెంతో ఇష్టమైన ‘టీ’ తో వ్యాపారం చేయాలని ఫిక్స్ అయిపోయారు. ‘చాయ్‌విల్లా.. రిఫ్రెష్ యువర్ సెల్ఫ్’ పేరుతో నాగ్‌పూర్ సీఏ రోడ్డులో 5 నెలల క్రితం టీ స్టాల్ ప్రారంభించారు. ఈ వినూత్న స్టాల్లో 15 రకాల ఫ్లేవర్లతో టీ, కాఫీలతో పాటు వివిధ రకాల స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. స్టాల్‌కి వెళ్లడం కుదరకపోతే వాట్సాప్, జొమాటోల్లో ఆర్డర్లు ఇవ్వొచ్చు. చాయ్‌విల్లా యజమాని నితిన్ బయానీ ఎఎన్ఐతో మాట్లాడుతూ.. ‘పదేళ్లపాటు ఐబీఎమ్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేశాను. నా భార్య పూజ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. మా ఇద్దరికీ చేసే పనిలో తృప్తి లభించలేదు. అందుకే టీ షాప్ ప్రారంభించాం. ప్రస్తుతం నెలకు 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం. త్వరలోనే బిజినెస్ చెయిన్‌ను విస్తరిస్తామన్నారు. సోషల్ మీడియాను , అప్డేటెడ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నామని తెలిపారు. రిఫ్రెష్ అండ్ రిలాక్స్... కస్టమర్ మాట్లాడుతూ.. ‘చాయ్‌విల్లా రీఫ్రెష్ యువర్సెల్ఫ్’ టీ తో రిఫ్రెష్‌తో పాటు రిలాక్స్ అవుతున్నామని, ఇక్కడ రుచితో పాటు శుభ్రతతో కూడిన టీ అందుబాటులో ఉంటుందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. -
ఇన్ఫోసిస్ సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
*భర్త పరిస్థితి విషమం, కుమారుడికి గాయాలు *మూడు కార్లు ధ్వంసం *'మత్తు'లో కారు రేసింగ్తోనే ప్రమాదం హైదరాబాద్: తప్ప తాగి... స్నేహితులతో కలిసి కారు రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తి సిగ్నల్ వద్ద నిలిపి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందగా... ఆమె భర్త, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ భోపాల్ పరిధిలోని సాగర్ గ్రామానికి చెందిన సోనీరాం చందానీ(36), హరీష్ ప్రసాద్(40) ప్రేమవివాహం చేసుకున్నారు. సోనీ ఇన్ఫోసిస్‌లో సాప్ట్వేర్ ఇంజినీర్ కాగా.. హరీష్ వ్యాపారం చేస్తున్నాడు. వీరు మాదాపూర్‌లోని విఠల్రావునగర్లో ఉంటున్నారు. గురువారం రాత్రి 8.50కి బైక్‌పై హరీష్ ప్రసాద్, సోనీ, కొడుకు మోక్ష్(4) నానక్‌రాంగూడ నుంచి ఔటర్‌పై గచ్చిబౌలి వైపు వస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడటంతో బైక్ ఆపాడు. ఔటర్‌పై వెనుక నుంచి వచ్చిన స్కోడా కారు (టీఎస్09 ఈసీ9599) బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే సోనీ మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో హరీష్ ప్రసాద్‌ను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. మోక్ష్కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. హోండా సిటీ కారులో ఉన్న ఓ మహిళ, వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హోండా సిటీ, ఇన్నోవా కార్లు ధ్వంసమయ్యాయి. రేసింగ్ వల్లే ప్రమాదం... డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసే శ్వేతాబ్కుమార్ తోటి ఉద్యోగులు ఐదుగురిని తీసుకొని రేసింగ్‌కు బయలుదేరాడు. శంషాబాద్ నుంచి మితిమీరిన వేగంతో వస్తూ బైక్, కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కారులో ఉన్న బీరు సీసాలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారులో ఉన్న శ్వేతాబ్ కుమార్‌తో పాటు వినోద్, రిషాబ్, శ్రీవాత్సవలకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. శ్వేతాబ్ కుమార్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొంది పారిపోయాడన్నారు. పరారైనట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. -
భార్యపై అసత్య ప్రచారం, సాప్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
హైదరాబాద్ : తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తున్న ఓ శాడిస్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రాజు కథనం ప్రకారం... సైదాబాద్‌కు చెందిన ఎస్.ప్రవీణ్ (47) సాప్ట్వేర్ ఇంజినీర్. అతని భార్య (45), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతా అమెరికాలో స్థిరపడ్డారు. రెండేళ్లుగా విభేదాలు తలెత్తడంతో భార్యపిల్లల నుంచి ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా... భార్యపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ బెదిరిస్తూ ఈ-మెయిల్ పంపడంతో పాటు ఆమెకు వివాహేతర సంబంధం ఉందని బంధువులు, కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్లు, మెయిల్స్ పంపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. -
ముఖంమీద ఉమ్మి, అసభ్యంగా దూషించాడు
ఓ మహిళా సాప్ట్వేర్ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వయంగా నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి జోక్యం చేసుకుని చర్యలకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కోల్‌కతాకు చెందిన రీనా బిస్వాస్ అలియాస్ రాణి బెంగళూరులో ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తోంది. ఈనెల 18న రాత్రి 11 గంటల సమయంలో ఆమె విధులు ముగించుకుని ఆటోలో మడివాళలోని ఇంటికి బయలుదేరింది. కొద్ది దూరం అనంతరం మారుతినగర్లో ఆటో ఆపేసిన డ్రైవర్, మీటర్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇంత రాత్రివేళలో అక్కడినుంచి ఇంటివరకు నడిచి వెళ్లడం ప్రమాదమని చెప్పినా అతను డ్రాప్ చేయడానికి నిరాకరించాడు. దాంతో డబ్బులు చెల్లించే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన డ్రైవర్ ...రీనాను ఆటోలో నుంచి బయటకు లాగిపడేశాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని ఇద్దరికి సర్ది చెప్పారు. అనంతరం రీనా ఈ ఘటనపై మడివాళ పోలీస్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంటికి వచ్చి ఫేస్బుక్లో ఆటో ఫొటో పెట్టి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. ఆటో డ్రైవర్ తన ముఖం మీద ఉమ్మటంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించింది. విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని మడివాళ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.