
త్వరలోనే అది సాకారం కావడం తథ్యం
వ్యోమగామి శుభాంశు శుక్లా ధీమా
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరింత వేగంతో దూసుకెళ్లడం ఖాయమని భారత వ్యోమగామి, భారత వైమానిక దళం గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లా ఉద్ఘాటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) వెళ్లి, విజయవంతంగా తిరిగి వచి్చన శుక్లా ఇటీవల స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
మన వ్యోమగామి మన గడ్డపై నుంచి మన సొంత రాకెట్, మన సొంత క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తథ్యమని, త్వరలోనే అది సాకారమవుతుందని పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్ మిషన్ ద్వారా వెలకట్టలేని అనుభవం సొంతం చేసుకున్నానని తెలిపారు. శిక్షణ ద్వారా నేర్చుకున్నదాని కంటే ఇది ఎంతో మెరుగైనదని అన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన దేశం అద్భుతంగా కనిపించిందని, సారే జహాసే అచ్ఛా అని వ్యాఖ్యానించారు. యాక్సియోమ్–4 మిషన్ ద్వారా గడించిన అనుభవం మన గగన్‌యాన్ మిషన్‌కు ఎంతగానో తోడ్పడుతుందని శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్ యాత్రలో భాగంగా గత ఏడాది కాలంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శుక్లా ఇంకా ఏం చెప్పారంటే...
ఈ విజయం భారతీయులదే
‘‘ఎంత శిక్షణ పొందామన్నది ముఖ్యం కాదు. రాకెట్‌లో కూర్చున్న తర్వాత ఇంజన్‌ను మండించాక విభిన్నమైన అనుభూతి కలుగుతుంది. శిక్షణలో అలాంటిది పొందలేం. ఐఎస్‌ఎస్ యాత్రలో నేను పొందిన అనుభూతిని, అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. రాకెట్ ఐఎస్‌ఎస్ వైపు దూసుకెళ్లడం మొదలయ్యాక.. కొన్ని సెకండ్లపాటు ఆ రాకెట్ వెనుక నేను పరుగెడుతున్నట్లు భావించా.
నేను నిజంగా రాకెట్‌లో ప్రయాణిస్తున్నట్లు తెలియడానికి కొంత సమయం పట్టింది. నమ్మశక్యం కాని అనుభవం సొంతమైంది. నాకు అన్ని విధాలుగా మద్దతు ఇచి్చన మన ప్రభుత్వానికి, ఇస్రోకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఐఎస్‌ఎస్ యాత్ర సఫలం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
తామే స్వయంగా ఈ యాత్రలో పాల్గొంటున్నట్లు భారతీయులంతా భావించారు. నాకు అన్ని వేళలా అండగా నిలిచారు. నేను క్షేమంగా తిరిగిరావాలని ప్రారి్థంచారు. నా విజయం ప్రజలందరికీ చెందుతుంది’’ అని శుభాంశు శుక్లా స్పష్టంచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
Met with the Hon PM today. Last time I spoke to him virtually was from Orbit with this same flag in the background on the @iss. I cannot describe how proud I felt that day representing Bharat and today when I was speaking to the PM @narendramodi Like I said this is just the first… pic.twitter.com/TsKGZmG8Ya
— Shubhanshu Shukla (@gagan_shux) August 18, 2025
శుక్లాకు నేను లక్ష్మణుడిని: ప్రశాంత్
శుభాంశు శుక్లా రాముడైతే తాను లక్ష్మణుడిని అని గగన్‌యాన్ మిషన్‌లో భాగస్వామి అయిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. మీడియా సమావేశంలో ఆయన కూడా మాట్లాడారు. శుక్లా వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ తనకు అన్నగానే భావిస్తానని అన్నారు. ఈ రాముడికి లక్ష్మణుడిగా ఉండడం తనకు ఇష్టమని తెలిపారు. రామ లక్ష్మణులకు మొత్తం వానరసేన అండగా నిలిచిందని గుర్తుచేశారు.
ఇస్రోలో తామంతా ఒక బృందంగా కలిసి పనిచేస్తున్నామని వివరించారు. అది ఫెంటాస్టిక్ టీమ్ అన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఇస్రోను 1969లో స్థాపించారని, గత పదేళ్లుగా ఎన్నో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు. గతంలో అంతరిక్ష ప్రయోగాల్లో మూసధోరణి ఉండేదని, దాన్ని బద్ధలు కొట్టామని పేర్కొన్నారు. ఇప్పుడు మనమే ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారామని తెలిపారు.
రాజ్‌నాథ్ సింగ్‌తో శుక్లా భేటీ
వ్యోమగామి శుభాంశు శుక్లా గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తన అంతరిక్ష ప్రయాణం గురించి శుక్లా వివరించారు. శుక్లా ప్రస్థానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన విజయాలు మనకు గర్వకారణమని వివరించారు.