nations
-
జగన్‌లాంటి అన్న మీ దేశాల్లో ఉన్నారా!
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అసలైన అండదండ అని, సీఎం జగన్ వంటి అన్నలు మీ దేశాల్లోను, సమాజాల్లోను ఉన్నారా అని వివిధ దేశాల నుంచి హాజరైన మహిళలను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ, స్త్రీ శిశు సంక్షేమ సలహాదారు నారమల్లి పద్మజ అడిగారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి వారిద్దరూ హాజరయ్యారు. గురువారం జరిగిన సదస్సులో ఏపీలో అమలవుతున్న మహిళాభివృద్ధి కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, భద్రత అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను 6 నిమిషాల వీడియో ద్వారా ప్రతినిధులకు వివరించారు. ‘మహిళల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు ద్వారానే ప్రగతిలో వేగం సాధ్యం’ అనే అంశంపై వారు మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. యాక్సిలరేట్ ప్రోగ్రెస్’ అన్నది 2024లో ఐక్యరాజ్య సమితి నినాదమని, ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా ఆచరణలోకి తెచ్చారని వివరించారు. ఏపీలో అయిదేళ్ళుగా జెండర్ సమానత్వం పరంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. జగనన్న అమ్మ ఒడి లాంటి స్కీమ్‌లు మీ దేశాల్లో, మీ సమాజాల్లో కూడా తల్లులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి మీ సమాజాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీలో అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వల్ల మహిళల ఆర్థిక స్తోమతతోపాటు వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. -
Onions: ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్, బెహ్రెయిన్, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.. కానీ మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన విధంగా ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, దేశంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించి దేశీయంగా సరఫరా పెంచేందుకు కేంద్రం గతేడాది డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ చేసిన సూచన మేరకు తాజాగా నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి? -
‘పెరిగే సముద్ర మట్టాలతో కొన్ని దేశాలే జలసమాధి’
భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘పెరుగుతున్న సముద్ర మట్టాలు’ అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్రమట్టాలు ఆరు మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి’ అని హెచ్చరించారు. చదవండి: ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి -
యుద్ధమేదైనా.. అదే దృశ్యం!
కురుస్తున్న అగ్నిగోళాలు, కూలిపోతున్న నివాస స్థలాలు, జూడో ఫైటర్ పుతిన్ భద్ర సమాజంపై విసరుతున్న పంచ్‌లు.. యుద్ధాన్ని ఆపలేని జెలెన్స్కీ విదూషక ప్రసంగాలు. ‘చమురు’ గొంతులో ఇరుక్కుని మాట్లాడలేని మౌన ప్రేక్షక దేశాలు.. ఇవి మాత్రమే యుద్ధ చిత్రాలు కాదు. .. కొన్ని తరాలైనా కోలుకోలేని జీవన విధ్వంసం అసలు యుద్ధ రూపం. పిల్లలను పొదువుకుని పరుగెత్తే తల్లులు, పొలిమేరల్లో లైంగికదాడుల్లో ఆడబిడ్డల ఆక్రందనలు. రహదారులపై అన్నదమ్ముల శవాలు. ఇదీ అసలు రూపం.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధమొక్కటే కాదు. ఏ యుద్ధమైనా అంతే. కురుక్షేత్రానికి ఆజ్యం పోసిన ‘శకుని’, ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యే ‘హిట్లర్’ లాంటి వాళ్లు మానవ నాగరికతకు సమాధి లాంటి ‘బంకర్ల’లోనే ఆకలితో, అవమానంతో, ఆగ్రహంతో ఊపిరిపోసుకుంటారు. ఏ యుద్ధమైనా.. మరో యుద్ధానికి, మారణ హోమానికి నాంది అవుతుంది. యుద్ధమెక్కడైనా నష్టం అందరికీ.. యుద్ధమంటే ఓ దేశం మరో దేశంపై చేసే దాడి మాత్రమే కాదు. ఆ రెండు దేశాలే నష్టపోవు. ప్రపంచ దేశాలన్నీ వివిధ అవసరాల కోసం ఒకదానిపై ఒక టి ఆధారపడిన క్రమంలో.. చాలా దేశాల్లో, లక్షల మంది ప్రజలపై ప్రభావం పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి, రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల ప్రభావం చాలా దేశాలపై పడింది. మన దేశాన్నే చూసుకుంటే.. పెట్రోలియం ఉత్పత్తులు, వంట నూనెలు సహా చాలా సరుకుల ధరలు పెరిగాయి. విద్య, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, తిరుగుబాట్లతో ఒక్క 2021వ సంవత్సరంలోనే రూ. 1,09,32,98,40,00,00,000–పదికోట్ల 93 లక్షల 29 వేల 840 కోట్లు (14.4 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక నష్టం జరిగినట్టు ‘ఎకనమిక్ వ్యాల్యూ ఆఫ్ పీస్ రిపోర్ట్’ అంచనా. కోట్ల ప్రాణాలు గాలికి.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వాటి పర్యవసనాల ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది అవయవాలు కోల్పోయి, ఆరోగ్యం దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితులతో ఏటా సగటున లక్ష మందికిపైనే చనిపోతు న్నట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొనడం గమనార్హం. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయాలు, రోగాల వల్ల రెండుకోట్ల మంది సైనికులు, కోటిన్నర మంది ప్రజలు మరణించినట్టు అంచనా. 1937–45 మధ్య జరిగిన చైనా–జపాన్ యుద్ధంలో రెండుకోట్ల మందికిపైగా చనిపోయారు. ఒక్క రెండో ప్రపంచ యుద్ధంలోనే 8.5 కోట్ల మంది చనిపోయినట్టు అంచనా. అందులో దాదాపు 80 శాతం అంటే ఆరున్నర కోట్ల మం దికిపైగా రష్యా, చైనా, జర్మనీ, పోలాండ్ దేశాలకు చెందినవారేనని నిపుణులు చెప్తున్నారు. ఇండియా సైనికులు, పౌరులు కలిపి 15 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా. 1950–53 మధ్య ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధంలో 45 లక్షల మంది చనిపోయారు. 1979–89 మధ్య సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో 20 లక్షల మంది, 1998–2003 మధ్య జరిగిన రెండో కాంగో వార్‌లో 54 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. గత 20 ఏళ్లలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా అంతర్యుద్ధం వంటివాటిల్లోనూ లక్షల మంది చనిపోయారు. అంతా అతలాకుతలం.. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అంతర్యుద్ధం చెలరేగినా.. అమాయక ప్రజలకే ముప్పు. అప్పటిదాకా హాయిగా బతుకుతున్న వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులైపోతాయి. ఐదేళ్ల కింద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్)లో ఓ స్వచ్చంద సంస్థ బాధితుల అనుభవాలు, దుస్థితిని పట్టి చూపింది. ఊరిపెద్దగా ఉండి అడుక్కునే దశకు.. ఆయన పేరు ఆల్బర్ట్.. సీఏఆర్లోని ఔకా ప్రాంతంలో ఓ గ్రామ పెద్ద. కాఫీ పండిస్తూ.. కుటుంబంతో సంతోషంగా బతికేవాడు. కానీ 2014లో ఓ రోజు రాత్రి తిరుగుబాటు దళాలు చేసిన దాడిలో ఆ గ్రామం నాశనమైంది. ఆల్బర్ట్ కుడి చెయ్యి తెగిపోయింది. అతను సహా ఊరిలోని వాళ్లంతా కాంగోకు వలస వెళ్లారు. అప్పటిదాకా నలుగురికి సాయం చేసిన ఆల్బర్ట్.. ఏ పనీ చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక.. చివరికి భిక్షమెత్తుకునే దుస్థితికి చేరాడు. పిల్లలకు పీడకలే.. యుద్ధాలు, అంతర్యుద్ధాలతో అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల బతుకు, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయి దేశాలు, మిలీషియా దళాలు పిల్లలను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నాయి. విద్యాసంస్థలపై దాడులు, పిల్లల కిడ్నాప్‌లు, చంపడం, బాలికలపై అత్యాచారాలు వంటివీ పెరిగాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు చెందిన బిట్రీస్ అనే మహిళ భర్త మిలీషియా దాడుల్లో చనిపోయాడు. ఆరేళ్ల కింద కొడుకుతో కాంగోకు పారిపోయింది. శరణార్థుల క్యాంపులో దుర్భర పరిస్థితిలో బతుకుతోంది. ‘‘సరిగా తిండి లేదు. ఏ సౌకర్యాలూ లేవు. అంతా స్వార్థంతో బతుకుతున్నారు. ఈ వాతావరణంలో పెరుగుతున్న నా కొడు కు భవిష్యత్తు ఏమవుతుందో’’నని ఆమె వాపోయింది. యుద్ధ విమానాల దాడిలో ధ్వంసమైన డ్రెస్డెన్ నగరం మధ్య చిన్న గుట్టలా కుప్పపోసి ఉన్న మృతదేహాలివి. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దారుణ జన హననానికి ఈ ఫొటో చిహ్నంగా నిలిచింది. జర్మన్ నాజీలు యూదులను, ఇతర దేశస్తులను ఊచకోత కోస్తుంటే.. వారిని రక్షించేందుకని జర్మనీపై దాడికి దిగిన మిత్రదేశాల (బ్రిటన్, అమెరికా తదితర దేశాల) సైన్యాలు.. 1945 ఫిబ్రవరిలో జర్మనీలోని డ్రెస్డెన్ నగరంలో పౌరులు, జనావాసాలపై విచక్షణా రహితంగా బాంబులు వేశాయి. అమెరికన్ సైనికులు తన కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేయడం, తనకూ తీవ్రగాయాలవడంతో.. బాధతో రక్తమోడుతూ రోదిస్తున్నతో ఐదేళ్ల ఇరాకీ బాలిక ఈమె. ఇరాక్‌లో తిష్టవేసిన అమెరికా సైన్యాలు ఏర్పాటు చేసిన ఓ చెక్ పాయింట్ వద్ద 2005లో ఈ దారుణ విషాదం జరిగింది. 1937.. చైనాలో బాంబు దాడులతో కూలిపోయిన రైల్వేస్టేషన్.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. తల్లిని కోల్పోయి, తీవ్రంగా గాయపడి గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి.. 1937లో జరిగిన చైనా–జపాన్ యుద్ధంనాటి దారుణ పరిస్థితిని కళ్లకు కట్టే చిత్రమిది. చైనాలోని షాంఘై సౌత్ రైల్వేస్టేషన్‌పై జపాన్ వి«ధ్వంసక దాడి ఫలితం. 2022.. ఉక్రెయిన్‌లో ఉక్రెయిన్‌లోని రైల్వేస్టేషన్‌పై మొన్నటి శుక్రవారం రష్యా చేసిన మిస్సైల్ దాడిలో తీవ్రంగా గాయపడి రొదిస్తున్న మహిళ ఈమె. రష్యా దాడులతో సృష్టిస్తున్న విధ్వంసం నుంచి తప్పించుకుని మరోచోటికి వెళ్లిపోదామనుకున్న 52 మంది ఈ దాడిలో ప్రాణాలు వదిలారు. మరెందరో క్షతగాత్రులుగా మిగిలారు. .. ఒకటా.. రెండా.. ఇలాంటివి మరెన్నో. అసలేం జరుగుతోంది? తప్పెవరిదో.. ఒప్పెవరిదో.. ఏ దేశమైతేనేం.. ఎవరిపై యుద్ధం చేస్తేనేం.. జరిగేదంతా వినాశనం, విధ్వంసం, జన హననమే. ఎప్పుడో 19వ శతాబ్దంలో దేశాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు, ప్రపంచ యుద్ధాల నుంచి నేడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి దాకా.. యుద్ధోన్మాదం సృష్టిస్తున్న బీభత్సం ఇంతా అంతా కాదు. ఇంకా గుణపాఠాలు నేర్చేదెప్పుడు? – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
మతం మాకు చాలా ముఖ్యం!
► భారత్‌లో 80% మంది.. అమెరికాలో 50% మంది వెల్లడి ► మతానికి ప్రాధాన్యతనిచ్చే జనం ఇథియోపియాలో అత్యధికం ► చైనాలో అత్యల్పం.. 100 మందిలో ముగ్గురే మతవిశ్వాసులు ► 2050 నాటికి మారనున్న మత సమీకరణాలు: ప్యూ రీసెర్చ్ సర్వే భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తమ జీవితంలో మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే.. ఇటువంటి వారు ఇథియోపియాలో అత్యధికంగా ఉంటే.. చైనాలో అతి తక్కువగా ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడిస్తోంది. 2015లో ప్రపంచ వైఖరుల సర్వేలో భాగంగా.. మతం విషయంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్నదానిపై అధ్యయనం చేశారు. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా ప్రజల్లో ప్రతి 100 మందిలో 98 మంది మతం తమకు చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తేలింది. సర్వేలో ప్రశ్నించిన వారిలో దాదాపు అందరూ ఇథియోపియన్ ఆర్థొడాక్స్ చర్చ్ అనేది తమ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమని బదులిచ్చారు. మరో ఆఫ్రికా దేశమైన సెనెగల్‌లో కూడా దాదాపు ఇదే రకమైన పరిస్థితి ఉంది. మెజారిటీ ముస్లిం మతస్తులైన అక్కడి ప్రజల్లో 97 శాతం మంది మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇక పాకిస్తాన్, ఇండొనేసియా, బుర్కినా ఫాసో తదితర దేశాల్లో 90 శాతానికన్నా ఎక్కువ మంది తమ జీవితంలో మతం చాలా ముఖ్యమైన భాగమని స్పందించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికం అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలకన్నా.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలకు మతం చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. ఆర్థికంగా శక్తివంతమైన చాలా దేశాల్లో మతం ముఖ్యమైన అంశంగా పరిగణించే జనం 20 శాతం లేదా అంతకన్నా తక్కువగానే ఉన్నారు. ఉదాహరణకు బ్రిటన్, జర్మనీల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే తమ జీవితాల్లో మతాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చెప్తున్నారు. రష్యా, ఆస్ట్రేలియాల్లో ఈ సంఖ్య ఇంకొంచెం తక్కువగా ఉంది. అయితే.. అగ్రరాజ్యం అమెరికాలో సగానికన్నా ఎక్కువ మంది మతాన్ని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించడం విశేషం. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మతాన్ని ముఖ్యమైన విషయంగా పరిగణించే వారి సంఖ్య చైనాలో అతి తక్కువగా ఉంది. అక్కడ ప్రతి 100 మందిలో ముగ్గురు మాత్రమే మతం చాలా ముఖ్యమైనదని చెప్పారు. 2050 నాటికి క్రైస్తవులతో సమానంగా ముస్లింలు... ప్రపంచ జనావరణాలు, జనాభాలు మారుతున్న పరిస్థితుల్లో.. ప్రపంచంలో మత సమీకరణాలు 2050 నాటికి గణనీయంగా మారతాయని అధ్యయనకర్తలు చెప్తున్నారు. అప్పటికి ముస్లింల జనాభా క్రైస్తవుల జనాభాకు సమానంగా పెరుగుతుందని అంచనా. మరోవైపు.. ఏ మతాన్నీ ఆచరించని ప్రజల సంఖ్య పెరగడం నెమ్మదిస్తుందని.. ఫలితంగా ప్రపంచ జనాభాలో ఇటువంటి వారి శాతం మరింత తక్కువ అవుతుందని విశ్లేషిస్తున్నారు. ► హిందువుల జనాభా 1970లో 46 కోట్లుగా ఉంటే.. 2010 నాటికి 103 కోట్లకు పెరిగింది. ఈ సంఖ్య 2050 నాటికి 138 కోట్లకు పెరుగుతుందని అంచనా. ► క్రైస్తవుల సంఖ్య 1970లో 123 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 217 కోట్లకు పెరిగింది. ఈ జనాభా 2050 నాటికి 292 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► ముస్లింల జనాభా 1970లో 57 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 160 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 276 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ► ఏ మతం ఆచరించని వారి సంఖ్య 1970లో 71 కోట్లు కాగా.. 2010 నాటికి 113 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 123 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► బౌద్ధ మతస్తుల సంఖ్య 1970లో 23 కోట్లు ఉంటే.. 2010 నాటికి 49 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఈ మతస్తుల సంఖ్య అంతే ఉంటుందని అంచనా. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)