కురుస్తున్న అగ్నిగోళాలు, కూలిపోతున్న నివాస స్థలాలు, జూడో ఫైటర్ పుతిన్ భద్ర సమాజంపై విసరుతున్న పంచ్‌లు.. యుద్ధాన్ని ఆపలేని జెలెన్‌స్కీ విదూషక ప్రసంగాలు. ‘చమురు’ గొంతులో ఇరుక్కుని మాట్లాడలేని మౌన ప్రేక్షక దేశాలు.. ఇవి మాత్రమే యుద్ధ చిత్రాలు కాదు.
.. కొన్ని తరాలైనా కోలుకోలేని జీవన విధ్వంసం అసలు యుద్ధ రూపం. పిల్లలను పొదువుకుని పరుగెత్తే తల్లులు, పొలిమేరల్లో లైంగికదాడుల్లో ఆడబిడ్డల ఆక్రందనలు. రహదారులపై అన్నదమ్ముల శవాలు. ఇదీ అసలు రూపం.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధమొక్కటే కాదు. ఏ యుద్ధమైనా అంతే.
కురుక్షేత్రానికి ఆజ్యం పోసిన ‘శకుని’, ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యే ‘హిట్లర్’ లాంటి వాళ్లు మానవ నాగరికతకు సమాధి లాంటి ‘బంకర్ల’లోనే ఆకలితో, అవమానంతో, ఆగ్రహంతో ఊపిరిపోసుకుంటారు. ఏ యుద్ధమైనా.. మరో యుద్ధానికి, మారణ హోమానికి నాంది అవుతుంది.
యుద్ధమెక్కడైనా నష్టం అందరికీ..
యుద్ధమంటే ఓ దేశం మరో దేశంపై చేసే దాడి మాత్రమే కాదు. ఆ రెండు దేశాలే నష్టపోవు. ప్రపంచ దేశాలన్నీ వివిధ అవసరాల కోసం ఒకదానిపై ఒక టి ఆధారపడిన క్రమంలో.. చాలా దేశాల్లో, లక్షల మంది ప్రజలపై ప్రభావం పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి, రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల ప్రభావం చాలా దేశాలపై పడింది.
మన దేశాన్నే చూసుకుంటే.. పెట్రోలియం ఉత్పత్తులు, వంట నూనెలు సహా చాలా సరుకుల ధరలు పెరిగాయి. విద్య, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, తిరుగుబాట్లతో ఒక్క 2021వ సంవత్సరంలోనే రూ. 1,09,32,98,40,00,00,000–పదికోట్ల 93 లక్షల 29 వేల 840 కోట్లు (14.4 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక నష్టం జరిగినట్టు ‘ఎకనమిక్ వ్యాల్యూ ఆఫ్ పీస్ రిపోర్ట్’ అంచనా.
కోట్ల ప్రాణాలు గాలికి..
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వాటి పర్యవసనాల ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది అవయవాలు కోల్పోయి, ఆరోగ్యం దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితులతో ఏటా సగటున లక్ష మందికిపైనే చనిపోతు న్నట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొనడం గమనార్హం. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయాలు, రోగాల వల్ల రెండుకోట్ల మంది సైనికులు, కోటిన్నర మంది ప్రజలు మరణించినట్టు అంచనా.
- 1937–45 మధ్య జరిగిన చైనా–జపాన్ యుద్ధంలో రెండుకోట్ల మందికిపైగా చనిపోయారు. ఒక్క రెండో ప్రపంచ యుద్ధంలోనే 8.5 కోట్ల మంది చనిపోయినట్టు అంచనా. అందులో దాదాపు 80 శాతం అంటే ఆరున్నర కోట్ల మం దికిపైగా రష్యా, చైనా, జర్మనీ, పోలాండ్ దేశాలకు చెందినవారేనని నిపుణులు చెప్తున్నారు. ఇండియా సైనికులు, పౌరులు కలిపి 15 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా.
- 1950–53 మధ్య ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధంలో 45 లక్షల మంది చనిపోయారు.
- 1979–89 మధ్య సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో 20 లక్షల మంది, 1998–2003 మధ్య జరిగిన రెండో కాంగో వార్‌లో 54 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. గత 20 ఏళ్లలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా అంతర్యుద్ధం వంటివాటిల్లోనూ లక్షల మంది చనిపోయారు.
అంతా అతలాకుతలం..
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అంతర్యుద్ధం చెలరేగినా.. అమాయక ప్రజలకే ముప్పు. అప్పటిదాకా హాయిగా బతుకుతున్న వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులైపోతాయి. ఐదేళ్ల కింద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్)లో ఓ స్వచ్చంద సంస్థ బాధితుల అనుభవాలు, దుస్థితిని పట్టి చూపింది.
ఊరిపెద్దగా ఉండి అడుక్కునే దశకు..
ఆయన పేరు ఆల్బర్ట్.. సీఏఆర్‌లోని ఔకా ప్రాంతంలో ఓ గ్రామ పెద్ద. కాఫీ పండిస్తూ.. కుటుంబంతో సంతోషంగా బతికేవాడు. కానీ 2014లో ఓ రోజు రాత్రి తిరుగుబాటు దళాలు చేసిన దాడిలో ఆ గ్రామం నాశనమైంది. ఆల్బర్ట్ కుడి చెయ్యి తెగిపోయింది. అతను సహా ఊరిలోని వాళ్లంతా కాంగోకు వలస వెళ్లారు. అప్పటిదాకా నలుగురికి సాయం చేసిన ఆల్బర్ట్.. ఏ పనీ చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక.. చివరికి భిక్షమెత్తుకునే దుస్థితికి చేరాడు.
పిల్లలకు పీడకలే..
యుద్ధాలు, అంతర్యుద్ధాలతో అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల బతుకు, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయి దేశాలు, మిలీషియా దళాలు పిల్లలను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నాయి. విద్యాసంస్థలపై దాడులు, పిల్లల కిడ్నాప్‌లు, చంపడం, బాలికలపై అత్యాచారాలు వంటివీ పెరిగాయి.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌కు చెందిన బిట్రీస్ అనే మహిళ భర్త మిలీషియా దాడుల్లో చనిపోయాడు. ఆరేళ్ల కింద కొడుకుతో కాంగోకు పారిపోయింది. శరణార్థుల క్యాంపులో దుర్భర పరిస్థితిలో బతుకుతోంది. ‘‘సరిగా తిండి లేదు. ఏ సౌకర్యాలూ లేవు. అంతా స్వార్థంతో బతుకుతున్నారు. ఈ వాతావరణంలో పెరుగుతున్న నా కొడు కు భవిష్యత్తు ఏమవుతుందో’’నని ఆమె వాపోయింది.
యుద్ధ విమానాల దాడిలో ధ్వంసమైన డ్రెస్డెన్ నగరం మధ్య చిన్న గుట్టలా కుప్పపోసి ఉన్న మృతదేహాలివి. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దారుణ జన హననానికి ఈ ఫొటో చిహ్నంగా నిలిచింది. జర్మన్ నాజీలు యూదులను, ఇతర దేశస్తులను ఊచకోత కోస్తుంటే.. వారిని రక్షించేందుకని జర్మనీపై దాడికి దిగిన మిత్రదేశాల (బ్రిటన్, అమెరికా తదితర దేశాల) సైన్యాలు.. 1945 ఫిబ్రవరిలో జర్మనీలోని డ్రెస్డెన్ నగరంలో పౌరులు, జనావాసాలపై విచక్షణా రహితంగా బాంబులు వేశాయి.
అమెరికన్ సైనికులు తన కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేయడం, తనకూ తీవ్రగాయాలవడంతో.. బాధతో రక్తమోడుతూ రోదిస్తున్నతో ఐదేళ్ల ఇరాకీ బాలిక ఈమె. ఇరాక్‌లో తిష్టవేసిన అమెరికా సైన్యాలు ఏర్పాటు చేసిన ఓ చెక్ పాయింట్ వద్ద 2005లో ఈ దారుణ విషాదం జరిగింది.
1937.. చైనాలో
బాంబు దాడులతో కూలిపోయిన రైల్వేస్టేషన్.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. తల్లిని కోల్పోయి, తీవ్రంగా గాయపడి గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి.. 1937లో జరిగిన చైనా–జపాన్ యుద్ధంనాటి దారుణ పరిస్థితిని కళ్లకు కట్టే చిత్రమిది. చైనాలోని షాంఘై సౌత్ రైల్వేస్టేషన్‌పై జపాన్ వి«ధ్వంసక దాడి ఫలితం.
2022.. ఉక్రెయిన్‌లో
ఉక్రెయిన్‌లోని రైల్వేస్టేషన్‌పై మొన్నటి శుక్రవారం రష్యా చేసిన మిస్సైల్ దాడిలో తీవ్రంగా గాయపడి రొదిస్తున్న మహిళ ఈమె. రష్యా దాడులతో సృష్టిస్తున్న విధ్వంసం నుంచి తప్పించుకుని మరోచోటికి వెళ్లిపోదామనుకున్న 52 మంది ఈ దాడిలో ప్రాణాలు వదిలారు. మరెందరో క్షతగాత్రులుగా మిగిలారు.
.. ఒకటా.. రెండా.. ఇలాంటివి మరెన్నో. అసలేం జరుగుతోంది? తప్పెవరిదో.. ఒప్పెవరిదో.. ఏ దేశమైతేనేం.. ఎవరిపై యుద్ధం చేస్తేనేం.. జరిగేదంతా వినాశనం, విధ్వంసం, జన హననమే. ఎప్పుడో 19వ శతాబ్దంలో దేశాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు, ప్రపంచ యుద్ధాల నుంచి నేడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి దాకా.. యుద్ధోన్మాదం సృష్టిస్తున్న బీభత్సం ఇంతా అంతా కాదు. ఇంకా గుణపాఠాలు నేర్చేదెప్పుడు?
– సాక్షి, సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment