
మరో 69 మంది జాడ గల్లంతు
చోసితీ గ్రామంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లా చోసీతీ గ్రామంలో ‘క్లౌడ్ బరస్ట్’ ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 60కి చేరింది. 30 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. మరో 69 మంది జాడ ఇంకా లభించలేదు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి నిలిపివేసిన గాలింపు చర్యలను శుక్రవారం ఉదయం పునఃప్రారంభించారు. సైన్యం, పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది చోసితీ గ్రామంలో రాళ్లు, బురదను తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. క్లౌడ్ బరస్ట్‌లో 100 మందికిపైగా గాయపడ్డారని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. శిథిలాల కింద నుంచి వెలికి తీసినవారిని తక్షణమే ఆసుపత్రికి తరలించడానికి చోసితీలో 65 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.
గ్రామంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు క్లౌడ్ బరస్ట్ విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. గ్రామాన్ని బురద ముంచెత్తింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మచైల్ మాత యాత్రను రెండో రోజు శుక్రవారం కూడా రద్దుచేశారు.