
మహారాణి రమాకుమారి దేవి(ఫైల్ ఫొటో)
జయపురం (భువనేశ్వర్): మహారాణి రమాకుమారి దేవి(92) వృద్ధాప్య అనారోగ్య కారణాలతో సోమవారం పరమపదించారు. ఆమె జయపురం ఆఖరి మహారాజు రామకృష్ణ దేవ్ పట్టపురాణి. సాహిత్య సామ్రాట్ విక్రమదేవ్ వర్మకు కోడలు. రామకృష్ణ దేవ్ వృద్ధాప్య ఛాయలతో కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. రమాకుమారి దేవి ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల శాశనసభ నియోజకవర్గం నుంచి 1975లో ఎమ్మెల్యేగా పోటిచేసి, గెలుపొందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, ముగ్గురూ ఇదివరకే మృతిచెందారు. ఇద్దరు యువరాణిలు(కోడల్లు), మనుమడు విశ్వేశ్వర చంద్రచూడ్ దేవ్, మనుమరాలు ఉన్నారు.
విషణ్న వదనంలో యువరాజు చంద్రచూడ్ దేవ్, అతని తల్లి
మహారాణి మరణ సమయంలో కోటలోనే ఉన్న చంద్రచూడ్, రాజ కుటుంబీకులు తుది సేవలందించారు. మరణ వార్త తెలుసుకున్న జయపురం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. సాయంత్ర జరిపిన అంతిమ యాత్రలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు భారీగా తరలివచ్చి, పాల్గొన్నారు. జయపురంలోని రాజుల ప్రత్యేక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు రాజ లాంఛనాలతో చేపట్టారు. మహారాణి రమాకుమారి దేవి మృతికి జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆఖరి రాజైన మహారాజ రామకృష్ణ దేవ్ పట్టపురాణి రమాకుమారి దేవి భహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.