కోల్‌కతా : కోవిడ్-19తో జాప్యం నెలకొన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) త్వరలో అమలవుతుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో సామాజిక్ సమూహ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సీఏఏతో దేశ ప్రజలందరికీ మేలు చేకూరుతుందని, దీనికోసం బీజేపీ కట్టుబడిఉందని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై నడ్డా విమర్శలతో విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
బీజేపీ దేశ ప్రజలందరి వికాసానికి పాటుపడుతుందని చెప్పారు. వచ్చేఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నడ్డా సోమవారం ఉత్తర బెంగాల్‌లో పలు ప్రాంతీయ, సామాజిక బృందాలతో సమావేశమయ్యారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద రైతు సంఘాలు, వ్యవసాయ మౌలిక వసతుల ఏర్పాటు కోసం రూ లక్ష కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. స్ధానిక ఉత్పత్తులను గుర్తించి వాటి మార్కెటింగ్ కోసం రోడ్‌మాప్‌ను రూపొందించాలని బీజేపీ ఎంపీలను నడ్డా కోరారు. స్ధానిక మార్కెట్లను ప్రోత్సహించి స్ధానిక వ్యాపారులకు మేలు చేసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment