సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో రాష్ట్రాల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రమే ఇవ్వగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పరమైన అంశాల్లో తాము ఎందు కు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఏపీ విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంది. ఒకట్రెండు అంశాలు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయని గుర్తుచేసిన ధర్మాసనం.. ఆ అంశాలు ముందుగా తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది. విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిందని, పిటిషన్లకు సంబంధించి ఇంకేం మనుగడలో ఉందని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి దాఖలైన 26 పిటిషన్లను జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణకు చెందిన పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపడం సరికాదని, విభజన హామీలు అమలు చేయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుల తరఫు సీనియర్ న్యాయవాది నిరూప్‌రెడ్డి, న్యాయవాది శ్రావణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 1953, 1956ల్లో జరిగిన విభజన శాస్త్రీయంగా జరిగిందని, కానీ 2014లో జరిగిన ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని చెప్పారు. అనంతరం మరో పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
నిబంధనలు పాటించకుండానే విభజన: పార్లమెంటులో తగిన నిబంధనలు పాటించకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ఆర్టికల్ 100 ప్రకారం విభజన జరగలేదని, దీని ప్రకారం ప్రొసిడ్యూర్ ఫాలో కాలేదని, హెడ్ కౌంట్ చేయలేదని, వోటింగ్ పెట్టలేదని, కనీసం సభ్యులు ఎస్ లేదా నో చెప్పలేదని తెలిపారు. ఎంపీ అయినా తనను బయటకు పంపారని, విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందనడానికి తానే ప్రత్యక్ష సాక్షినని అరుణ్‌కుమార్ తెలిపారు.
అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటు పరిగణించాలా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి పంపిన విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం లేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకోని రాజకీయ పరమైన అంశంలో తాము ఎందుకు జోక్యం చేసుకోవాలంటూ ప్రశ్నించింది.
కాగా తొలుత దాఖలు చేసిన పిటిషన్‌లో తమ అభ్యర్థన మార్చుకున్నామని అరుణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం సాయం అవసరముందన్నారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న ఆయా అంశాలు తేలిన తర్వాతే తాము నిర్ణయం తీసుకోగలమని పిటిషనర్లకు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment