అహ్మదాబాద్: రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి గుజరాత్‌లో అమలులో ఉన్న లిక్కర్ నిషేదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరిమిత సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ పార్టీ ఎంపీ శక్తిసింగ్ గొహిల్ ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. లిక్కర్ బ్యాన్ సడలింపులు రాష్ట్రంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయని గొహిల్ హెచ్చరించారు.ఈ సడలింపుల వల్ల ప్రభుత్వం ఎలాంటి లాభం పొందాలనుకుంటోందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు.
గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ(గిఫ్ట్ సిటీ)లో లిక్కర్ అందుబాటులో ఉంటుందని స్టేట్ ఎక్సైజ్ శాఖ తాజాగా ప్రకటించింది. చాలా కాలం పాటు బ్యాన్ కొనసాగించి సడెన్‌గా గిఫ్ట్ సిటీలో లిక్కర్ అమ్మకాలు అనుమతించడానికి బలమైన కారణాలున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది.
‘భారీగా పన్ను రాయితీలున్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం కావడంతో గిఫ్ట్ సిటీలో దేశీయ, విదేశ కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఈ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులకు లిక్కర్ అమ్మేందుకు తాత్కాలిక ప్రాతిపదికన హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులకు అనుమతిచ్చినట్లు గుజరాత్ స్టేట్ నార్కొటిక్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
సింగపూర్ లాంటి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ కేంద్రాలతో పోటీ పడి ఆర్థిక సేవల రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలకు సులభతర రెగ్యులేటరీ నిబంధనలతో పాటు భారీ పన్ను రాయితీలను ప్రభుత్వం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment