ముంబై: భార్యను వదిలించుకుని.. ప్రేమించిన అమ్మాయితో జీవితం గడపాలనుకున్నాడు ఓ వ్యక్తి. అనుకోకుండా కరోనా రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దాంతో నాకు కోవిడ్-19.. త్వరలోనే చనిపోతాను అని భార్యకు అబద్ధం చెప్పి.. ఐడెంటీ మార్చుకుని లవర్‌తో మరో చోట నివాసం ఉంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. నవీ ముంబైలోని తలోజా ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తికి వివాహం అయ్యింది. కానీ మరో యువతిని ప్రేమించాడు. భార్యతో బంధాన్ని తెంపుకుని.. లవర్‌తో జీవించాలనుకున్నాడు. దాంతో కొద్ది రోజుల క్రితం భార్యకు కాల్ చేసి ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.. త్వరలోనే నేను చనిపోతాను’ అని చెప్పి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఆందోళనకు గురయిన నిందితుడి భార్య దీని గురించి తన అన్నకు తెలిపింది. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించడం ప్రారంభించారు. (చదవండి: 'ఆ ఫోటో నాదే.. నేను చనిపోలేదు')
ఇంతలో ఓ రోజు నిందితుడి బైక్ వషి ప్రాంతంలో అతడి బంధువుకు కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే బైక్‌తో పాటు హెల్మెట్, కంపెనీ ఐడీ కార్డ్ అన్ని ఉన్నాయి. దాంతో అతడు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. మొబైల్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేద్దామనుకుంటే ఫోన్ ఆఫ్‌లో ఉంది. దాంతో ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇలా కాదనుకుని పోలీసులు అతడి వ్యక్తిగత విషయాలు కూపీ లాగగా అతడికి మరో స్త్రీతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. దాని ఆధారంగా దర్యాపు చేయగా నిందితుడు ఇండోర్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఓ బృందం అక్కడకు వెళ్లి పరిశీలించగా.. నిందితుడు తన గుర్తింపు మార్చుకుని.. ఓ గదిని అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నాడు. పోలీసులు అతడిని తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment