![Lowest victory margins in BJP vs AAP contest in Delhi Election Results](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/BJP.jpg.webp?itok=k-9zKBma)
ఢిల్లీ ఎన్నికల్లో 24 చోట్ల మెజారిటీ 10వేల లోపే
‘టగ్ ఆఫ్ వార్’ స్థానాల్లో అత్యధికం బీజేపీకే
ఏకంగా 27 ఏళ్ల తర్వాత రాజధాని ఎన్నికల కొలనులో చీపురును నిండా ముంచేస్తూ కమల వికసించింది. అందుకోసం రెండు పార్టిల మధ్య హోరాహోరీ పోరే సాగినట్టు శనివారం వెల్లడైన అసెంబ్లీ ఫలితాల సరళిని విశ్లేషిస్తే అర్థమవుతోంది. తక్కువ మెజారిటీ నమోదైన అసెంబ్లీ స్థానాల సంఖ్య 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బాగా పెరిగింది. ఏకంగా 24 స్థానాల్లో మెజారిటీ 10,000 లోపే నమోదైంది. 2020 ఎన్నికల్లో వీటి సంఖ్య 15 మాత్రమే! సదరు 24 స్థానాల్లో 16 బీజేపీ సొంతం కాగా ఆప్‌కు 8 మాత్రమే దక్కాయి. అంతేకాదు, 2020లో 33 స్థానాల్లో 10 వేలకు మించి మెజారిటీ రాగా ఈసారి అది 29 స్థానాలకు తగ్గింది.
13 చోట్ల 5,000 లోపే
ఈసారి 13 అసెంబ్లీ స్థానాల్లో 5,000 ఓట్ల లోపు మెజారిటీ నమోదైంది. అదే సమయంలో మరోవైపు భారీ మెజారిటీతో గెలిచిన స్థానాల సంఖ్య కూడా తగ్గింది. 2020లో 22 చోట్ల 25,000కు పైగా మెజారిటీ నమోదైతే ఈసారి అది 17 స్థానాలకు పరిమితమైంది. అతి తక్కువగా సంగం విహార్ స్థానంలో బీజేపీ నేత చందన్ కుమార్ చౌదరి కేవలం 344 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. త్రిలోక్‌పురీలో 392, జంగ్‌పురాలో 675 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ రెండు సీట్లూ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. మాటియా మహల్‌లో మొహమ్మద్ ఇక్బాల్ (ఆప్) 42, 724 ఓట్ల మెజారిటీ సాధించారు. వేయిలోపు మెజారిటీలు 2020లో రెండే నమోదు కాగా ఈసారి మూడుకు పెరిగాయి. 5,000 లోపు మెజారిటీలు 20 20లో 7 కాగా 10కి పెరిగాయి. 5,000 నుంచి 10,000 మెజారిటీ విజయాలు 6 నుంచి 11కు పెరిగాయి.
మార్జిన్లలో కమలనాథుల హవా
అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో బీజేపీ వాళ్లే ఎక్కువగా ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 10వేలకు మించి మెజారిటీతో ఆప్ ఏకంగా 51 చోట్ల విజయం సాధించగా ఈసారి ఏకంగా 14కు పరిమితమైంది. 2020లో బీజేపీ 10వేల మెజారిటీతో కేవలం 4 స్థానాలను దక్కించుకోగా ఆ సంఖ్య ఈసారి ఏకంగా 32కు పెరిగింది! 2020 ఎన్నికల్లో ఆప్ ఆరు చోట్ల 1,000–5,000 మెజారిటీ సాధిస్తే ఈసారి బీజేపీ ఆ ఫీట్ సాధించింది. ఆప్ మాత్రం 4 స్థానాలకు పరిమితమైంది. ఇక 5,000–10,000 మధ్య మెజారిటీతో ఆప్ కేవలం 4 చోట్ల గెలిస్తే బీజేపీ 7 చోట్ల గెలిచింది.
ఆప్ 2020లో ఏకంగా 30 చోట్ల 10,000–25 వేల మధ్య మెజారిటీ సాధించగా ఈసారి కేవలం 3 చోట్ల మాత్రమే ఆ ఘనత సాధించగలిగింది. 2020లో కేవలం 9 చోట్ల 10,000–25 వేల మధ్య మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 20 చోట్ల ఆ ఘనత సాధించింది. ఆప్ 2020లో ఏకంగా 21 స్థానాల్లో పాతిక వేల పైగా మెజారిటీ సాధించిన ఆప్ ఈసారి కేవలం 5 నియోజకవర్గాల్లోనే ఆ ఫీట్ సాధించింది. 2020లో కేవలం 5 చోట్ల పాతిక వేల పై చిలుకు మెజారిటీతో నెగ్గిన బీజేపీ ఈసారి 12 చోట్ల ఆ ఘనత సాధించింది.
అన్ని వర్గాల్లోనూ ఆప్ డీలా...
అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆప్‌తో పోలిస్తే బీజేపీకే ఆదరణ కనిపించడం మరో విశేషం. 2020తో పోలిస్తే బీజేపీకి నిరుపేదలు 3.5 శాతం ఎక్కువగా, పేదలు 10.1 శాతం, మధ్య తరగతి 7.3 శాతం, సంపన్నులు 9.3 శాతం ఎక్కువగా బీజేపీకే ఓటేశారు. ఆప్‌కు అన్ని వర్గాల్లోనూ ఓట్లు తగ్గాయి. 2020తో పోలిస్తే నిరుపేదలు 8.2 శాతం తక్కువగా, పేదలు 11.1 శాతం, మధ్య తరగతి 6.6 శాతం, సంపన్నులు ఏకంగా 12 శాతం తక్కువగా ఓటేశారు.
ముస్లిముల్లోనూ బీజేపీకే ఆదరణ
ఈసారి ముస్లింలు ఆప్ కంటే బీజేపీని ఎక్కువగా ఆదరించడం విశేషం. చూస్తే 25 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 32.9 శాతం ఓట్లు పడ్డాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే ఇది 1.3 శాతం ఎక్కువ. వారి జనాభా 10 నుంచి 25 % ఉన్నచోట్ల 44.7% ఓట్లు పడటం విశేషం. ఇది 2020 కంటే ఏకంగా 8.1 శాతం ఎక్కువ. ముస్లింలు 10 శాతం లోపున్న నియోజకవర్గాల్లో 49.7 శాతం ఓట్లొచ్చాయి. ఇది గతం కంటే 8.5 శాతం ఎక్కువ. ఆప్‌కు వస్తే ముస్లింలు 25 శాతానికి పైగా ఉన్న స్థానాల్లో 12.3 శాతం తక్కువగా 49.5 శాతం ఓట్లు పడ్డాయి. 10 నుంచి 25% ముస్లిం జనాభా ఉన్న చోట్ల కూడా గతంతో పోలిస్తే 7.5 శాతం తగ్గి 45 శాతం పడ్డాయి. వారు 10 శాతం లోపున్న చోట్ల మాత్రం ఏకంగా 10.3 శాతం తగ్గి 42.4 శాతం పడ్డాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment