
భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభకు ఈసారి జరిగిన ఎన్నికల్లో రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. శుక్రవారం మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా 76.22 శాతం ఓటింగ్ నమోదైంది. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి చూస్తే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారికావడం విశేషం.
ఇంతకాలం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 75.63 శాతమే అధికంగా ఉండేది. శుక్రవారం నాటి పోలింగ్ ఆనాటి రికార్డును తుడిచేసింది. మిగతా జిల్లాలతో పోలిస్తే సివానీ జిల్లాలో అత్యధికంగా 85.68 శాతం పోలింగ్ నమోదైంది. గిరిజనులు ఎక్కువగా ఉండే అలీరాజ్‌పూర్ జిల్లాలో అత్యల్పంగా 60.10 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో సరిహద్దు పంచుకుంటున్న నక్సల్స్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలో 85.23 శాతం పోలింగ్ నమోదైంది.
ఛత్తీస్‌గఢ్‌లో 76.31 శాతం
ఈ నెల ఏడున, 17న రెండు విడతల్లో జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో 76.31 శాతం పోలింగ్ నమోదైందని శనివారం ఎన్నికల ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 76.88 శాతం కంటే ఈసారి కాస్తంత తక్కువ పోలింగ్ నమోదైంది. కురుద్ నియోజకవర్గంలో ఏకంగా 90.17 శాతం పోలింగ్ నమోదైంది. బీజాపూర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 48.37 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment