సాక్షి, చెన్నై: రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. ద్రవిడ కళగం నేత కన్నదాసన్ మద్రాసు హైకోర్టులో గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆధారాలతో సహా అందులో వివరించారు. బహిరంగ సభలు, వేదికలపై గవర్నర్ బాధ్యతలను విస్మరించి, సనాతన ధర్మానికి అనుకూలంగా, ద్రావిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే తమిళనాడు సర్కారు పంపించే నివేదికలు, తీర్మానాలపై సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర గవర్నర్‌గా పదవిలో ఉన్న వ్యక్తి ఇతర సంస్థలు, సంఘాలలో పనిచేయడానికి వీలు లేదని ఆ పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్ రవి పుదుచ్చేరిలోని ఆరోవిల్ ఫౌండేషన్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు. ఈ పదవి ద్వారా ఆయనకు వేతనం, పదవీ విరమణ పెన్షన్ వంటి సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు. ఈ దృష్ట్యా గవర్నర్‌ను రీకాల్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం ఇన్‌చార్జ్ సీజే రాజ, న్యాయమూర్తి భరత చక్రవర్తి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.
విచారించలేం..
న్యాయమూర్తులు స్పందిస్తూ, గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఉన్నత కోర్టుల తీర్పులు, రాజకీయ శాసనాల ఆధారంగా నియమితులైన వారిపై ఎలాంటి చర్యలకు గానీ, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ ఈ పిటిషన్ విచారణను తోసిపుచ్చారు.
టీఆర్ బాలు ఫైర్..
గవర్నర్ తీరుపై మండిపడుతూ డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఓ ప్రకటన చేశారు. ఆయన రాష్ట్రానికి గవర్నర్ తరహాలో కాకుండా, బీజేపీకి మరో అధ్యక్షుడి వ్యవహరిస్తున్నట్లుందని మండిపడ్డారు. తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment