అశోక్ చవాన్, నారాయణ్ రాణే, శివాజీరావ్ పాటిల్ , శంకర్‌రావు చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్
సాక్షి,ముంబై: గతంలో ముఖ్యమంత్రి పదవిలో రాష్ట్రానికి సారథ్యం వహించిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు కొత్తగా కొలువు దీరిన షిండే ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవిని అలంకరించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఎవరైనా పైకి ఎదుగుతారే తప్ప ఇలా పై నుంచి కిందికి రారంటూ చమత్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతారని భావించిన ఫడ్నవీస్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టడంవల్ల ఆయన ముఖంలో గతంలో మాదిరిగా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా మంత్రి పదవి చేపట్టడమేమీ నామోషీ కాదని, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో రాజ్యాంగబద్ద పదవిలో కొనసాగడం తప్పేమీ కాదని మరికొందరు సమర్థిస్తున్నారు. ఇదేవిధంగా గతంలో కూడా చాలామంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత మంత్రి పదవిని చేపట్టడం కొత్తేమీ కాదని చెప్పుకొస్తున్నారు.
ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత మంత్రి అయిన నేతలు వీరే
► 1975లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శంకర్‌రావ్ చవాన్ 1978లో శరద్ పవార్ నేతృత్వంలోని పురోగామి లోక్‌శాహి దళ్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు.
►1985లో సీఎంగా పనిచేసిన శివాజీరావ్ పాటిల్–నిలంగేకర్ 2004లో సుశీల్‌కుమార్ షిండే ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు.
►1999లో శివసేన–బీజేపీ కూటమి ప్రభుత్వంలో కేవలం సంవత్సరకాలంపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నారాయణ్ రాణే శివసేన నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రాణే కాంగ్రెస్–ఎన్సీపీ కూటమిలో ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వంలో రెవెన్యూ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.
► 2008లో ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ 2019లో మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలో ప్రజా పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు.
►2014లో శివసేన–బీజేపీ కాషాయ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు.
చదవండి: నాకూ ఆఫర్ ఇచ్చారు.. అందుకే వద్దన్నా: సంజయ్ రౌత్
Comments
Please login to add a commentAdd a comment